
కోర్టును ఆశ్రయించిన జర్నలిస్టు భార్య
భర్త హత్య కేసులో నిందితుడి రాజకీయ ప్రముఖులతో కలిసి కనిపించడంతో హిందూస్తాన్ జర్నలిస్టు రంజన్ భార్య ఆశ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, గత శనివారం జైలు నుంచి విడుదలైన మరో ఆర్జేడీ నేత షహబుద్దీన్ లతో జర్నలిస్టు రంజన్ ను హత్య నిందితుడు మహమ్మద్ కైఫ్ మీడియాకు కనిపించాడు.
దీంతో తన భర్త రంజన్ హత్య కేసుపై విచారణ చేయించాలని ఆయన భార్య ఆశా రంజన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నిందితులతో ఫోటోలు దిగడం, నిందితుడు పక్కనే ఉన్నా పోలీసులు పట్టించుకోకపోవడం లాంటివి చూస్తుంటే.. రంజన్ భార్య, ఆమె ఇద్దరు పిల్లలకు ప్రాణహాని ఉందని ఆశా తరఫు లాయర్ కిశ్లేయ్ పాండ్ అన్నారు.
కాగా, కైఫ్ పై రంజన్ హత్యే కాకుండా మరో 5 కేసులు కూడా ఉన్నాయి. సీబీఐ బుధవారం రంజన్ హత్య కేసు విచారణను ఆరంభించింది. బీహార్ నాయకులతో ఫోటోలు, వీడియోల్లో ఉంది తానేనని కైఫ్ మీడియాకు చెప్పాడు. కేసు విషయం తన లాయర్లు చూసుకుంటున్నారని తెలిపాడు. తాను పోలీసుల ముందు హాజరుకావడానికి సిద్ధమేనని అన్నాడు.
కైఫ్ తో తనకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఖండించారు. వెయ్యిమందిలో ఎవరో ఒకరు వచ్చి తనతో ఫోటో దిగితే అతడు షూటర్ అని తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా సోదరుడిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రని ఆరోపించారు.