అదరగొట్టిన మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ ఐపీఓ
ముంబై: మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అదరగొట్టింది. పబ్లిక్ ఇష్యూ మొదలైన రెండో రోజు (మంగళవారం) మధ్యాహ్నానికే మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ పబ్లిక్ ఇష్యూ ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. జాగరణ్ ప్రకాశన్ గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ ఆఫర్‌లో భాగంగా 1.04 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 1.06 కో్ట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. మరోవైపు ఇప్పటికే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 146 కోట్లను సమీకరించింది. ధరల శ్రేణి రూ. 324-333 గా నిర్ణయించిన ఈ ఐపీవో బుధవారం ముగియనుంది.
కాగా జాగ్రణ్ ప్రకాశన్ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ రేడియో సిటీ ఎఫ్‌ఎం చానల్‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఎఫ్‌ఎం చానళ్లను నిర్వహించే ఈ సంస్థ ఐపీవో సోమవారం మొదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 37 నగరాల్లో రేడియో సిటీ బ్రాండ్ కింద ఎఫ్‌ఎం ప్రసారాలందిస్తున్న సంస్థ ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్లకు మించి నిధులను సమీకరించాలని భావించింది. ఇందులో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో 26.59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్(ఎంబీఎల్) ప్రకటించిన సంగతి విదితమే.