'ఆ రోజు మీకు ఇష్టమైన దైవాన్నే తలుచుకోండి'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పాల్గొనే ముస్లింలు శ్లోకాలనే చదవాల్సిన అవసరం లేదని.. వారికి ఇష్టమైనా అల్లా నామాన్ని తలుచుకోవచ్చని గోవా మంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. యోగా దినోత్సవం రోజు కుల మత భేదాలు లేకుండా అందరు పాల్గొనాలనే ఉద్దేశంతో, ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందులో నుంచి ఇప్పటికే సూర్య నమస్కారాన్ని పక్కకు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్నందున అందులో ముస్లింలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
యోగాలోని శ్లోకాలు తమ మత విశ్వాసాలకు విరుద్ధమైనవని, తమను అందులో పాల్గొనకుండా మినహాయింపు ఇవ్వాలని కొందరు ముస్లిం పెద్దలు ఆయనను కలవడంతో ఈ విషయం చెప్పారు. ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున అది ఎలాంటి వివాదం లేకుండా నిర్వహించాలని నిర్ణయించామని, అందుకు అనుకూలమైన సడలింపులు కూడా కేంద్రం కల్పించిందని సుష్మా స్వరాజ్ ప్రకటించారని, అందరినీ దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం సజావుగా జరగాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.