ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ పరిసర ప్రాంతాల్లో అల్లర్లు సద్దుమణిగాయి. దాంతో అయా ప్రాంతాల్లో శనివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ముజఫర్నగర్ పరిసర ప్రాంతాల్లో గతంలో విధించిన కర్ఫ్యూను ఈ రోజు 12 గంటలపాటు సడలిస్తున్నట్లు ఉన్నతాధికారులు శనివారం ఇక్కడ వెల్లడించారు. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు కర్ఫ్యూను ఎత్తివేసినట్లు చెప్పారు. అయితే ముజఫర్నగర్ పరిసరాల్లోని గ్రామాల్లో మాత్రం ఇంకా పరిస్థితులు ఆందోళనగా ఉన్నాయని తెలిపారు. అందులోభాగంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు.
ముజఫర్నగర్, షామిలి జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో దాదాపు నాలుగు వేల మంది ప్రజలు తలదాచుకున్నారని చెప్పారు. వారందరికి ఆహారం, పాలు, మందులు అన్నింటిని అందజేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లలో ముజఫర్నగర్లోనే అత్యధికంగా 38 మంది మరణించారన్నారు. అలాగే షామిలిలో 3, షారణ్పూర్లో 1, బగ్పట్ 3, మీరట్లో 2 మృతిచెందారన్నారు. ఆ అల్లర్లలో భాగంగా 11 వేల మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే 187 మందిని అరెస్ట్ చేశామని,11 మందిపై హత్య కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.