బాస్ రేప్ చేసి.. ఆస్ట్రేలియా వరకు వెంటాడాడు!
దేశంలో మహిళలపై కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. హర్యానాలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కొడుకు కిరాతకంగా ఒక యువతిని వెంటాడిన ఘటన నేపథ్యంలోనే మరో షాకింగ్ కేసు వెలుగుచూసింది. ఓ మాజీ సీనియర్ సహోద్యోగి భారత్‌లో తనను వేధించి.. లైంగిక దాడి చేయడమే కాకుండా.. తనను వెంటాడుతూ ఆస్ట్రేలియా కూడా వచ్చాడని, అతని బారినుంచి తప్పించుకునేందుకు భర్త, ఇద్దరు పిల్లలతో ఆస్ట్రేలియా వచ్చినా.. అక్కడ వేధింపులకు దిగాడని 38 ఏళ్ల ఎన్నారై మహిళ ఫిర్యాదు చేసింది. వెంటాడి వేధించడం, డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడటం, లైంగిక దాడి చేయడం వంటి పలు అభియోగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
బాధితురాలు నిందితుడిని తొలిసారి తను పనిచేసే గురుగ్రామ్‌లోని కార్యాలయంలో కలిసింది. హైదరాబాద్‌కు చెందిన అతను, ఆమె ఒకే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. తన ఉద్యోగంలో భాగంగా తరచూ ఆమె అతనితో సంప్రదింపులు జరిపేది. 'మేం తరచూ టెలిఫోన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేవాళ్లం. పని నిమిత్తం అతను తరచూ గురుగ్రామ్ వచ్చేవాడు. అతని ప్రాజెక్టుల్లో నన్ను కలుపుకుంటూ.. నాతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించేవాడు. బహిరంగంగా నా పనితీరును పొడిగేవాడు. తన భార్య దుర్మార్గురాలని, స్వార్థపరురాలని, కజిన్‌తో ఆమె లేచిపోయిందని తరచూ చెప్పేవాడు. కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా కూతురిని సొంతంగా పెంచుతున్నట్టు చెప్పేవాడు. తన కష్టాలు పంచుకోవడానికి ఒక స్నేహితుడు తోడు ఉంటే బాగుండేదని చెప్పేవాడు. తన సమస్యలు చెప్పేందుకు తరచూ నాకు ఫోన్ చేసేవాడు' అని ఆమె తెలిపింది.
'2013 మార్చ్‌లో ఒక రోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని ఫోన్ ద్వారా తెలుసుకున్న అతను వెంటనే సాయంత్రం వచ్చాడు. ఇంటికి వచ్చిన అతనికి కూల్ డ్రీంక్ ఇచ్చాను. ఆ తర్వాత నేను కూల్‌డ్రింక్ తాగాను. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన నేను కళ్లు తెరిచి చూసేసరికి బెడ్రూమ్‌లో నగ్నంగా ఉన్నాను. పక్కన చైర్‌లో కూర్చున్న అతను జరిగిన దానిని మరిచిపోవాలని, ఈ విషయం బయట తెలిస్తే నీ పరువు పోవడంతోపాటు ఉద్యోగం కూడా పోతుందని బెదిరించాడు. ఆ తర్వాత నా అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించి.. తనను ఎప్పుడు సంతోష పెట్టాలని బలవంతపెట్టేవాడు' అని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తన వెంట పలు నగరాల్లోని పెద్ద పెద్ద హోటళ్లకు బలవంతంగా తీసుకెళ్లాడని, తనను విడిచిపెట్టాలని వేడుకోవడంతో డబ్బులు ఇవ్వమంటూ బెదిరించాడని, దీంతో గత్యంతరం లేక లక్షలకొద్దీ డబ్బు ఇచ్చానని బాధితురాలు తెలిపింది.
'దాడులను ఆపాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని కోరాడు. అందుకు నేను అంగీకరించాను. అయినా, కొన్నిరోజుల తర్వాత మళ్లీ నాపై దాడి చేశాడు' అని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తనను వెంబడించి.. తాను ఆస్ట్రేలియా వెళుతున్న విషయాన్ని తెలుసుకొని.. అక్కడికి వచ్చి మరీ వేధించాడని, తన భర్తకు ఈమెయిళ్లు పంపుతూ.. తనను ఇప్పటికీ వెన్నాడుతున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.