సల్మాన్ ట్వీట్లపై మండిపడ్డ తండ్రి
- ఉద్రిక్తతల నేపథ్యంలో నటుడి ఇంటివద్ద భద్రత పెంపు
ముంబై: ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరితీయొద్దంటూ ట్వీట్లు చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై ఆయన తండ్రి సలీం ఖాన్ మండిపడ్డారు. 257 మంది ప్రాణాలు కోల్పోయిన నాటి ఘటన గురించి సల్మాన్కు ఏమాత్రం అవగాహన లేదని.. ట్విట్టర్లో అతని రాతలన్నీ అర్థరహితమైనవని, తెలివితక్కువతనాన్ని బయటపెట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు.
ఆదివారం మద్యహ్నం తన అభిప్రాయాన్ని మీడియాకు తెలియజేసిన సలీం ఖాన్.. యాకూబ్ ఉరితీత విషయంలో మాత్రం కొడుకుతో ఏకీభవించాడు. 'యాకూబ్ దోషే అయినప్పటికీ ఉరి విధించకుండా అతడ్ని జీవితాంతం జైలులో ఉచడమే సరైన శిక్ష' అని సలీం అన్నారు. సల్మాన్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోవాలని ప్రజలను కోరారు.
ఇదిలాఉండగా, సల్మాన్ ఖాన్ ట్వీట్లపై రాజకీయ వర్గాలతోపాటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అతడి నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు ముంబై పోలీసులు. సల్మాన్ తన ట్వీట్లను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ముంబై పేలుళ్ల కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ కోరారు. కోర్టు తీర్పులను తప్పుపట్టడం సరికాదని హితవుపలికారు.