
విశ్వంలో గ్రహాల సంఖ్య 9కి చేరనుందా?
సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయని వాటిలో జీవరాశి కలిగినది కేవలం భూమి మాత్రమేనని అందరికీ తెలుసు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో సౌర కుటుంబంలో మరో గ్రహం(తొమ్మిదో గ్రహం) కూడా ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా తొమ్మిదో గ్రహం కారణంగా సూర్యుని కదలికలో అసాధారణ మార్పులు కలిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆకారంలో భారీగా ఉండటం, మిగిలిన గ్రహాల కక్ష్య(ఆర్బిట్)లతో పోల్చితే తొమ్మిదో గ్రహ కక్ష్య దిశలో మార్పు ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాల్ టెక్ కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్ధి, తొమ్మిదో గ్రహ జాడను కనుగొనడానికి యత్నిస్తున్న ఎలిజబెత్ బెయిలీ కక్ష్యకు సంబంధించిన ఊహా వీడియోను విడుదల చేశారు. ఊహా వీడియోలో చూపిన విధంగా సౌర కుటుంబం మారితే గ్రహల కక్ష్యల అమరికలో పెనుమార్పులు సంభవిస్తాయి.
ప్రస్తుత సౌర కుటుంబాన్ని ఒకసారి పరిశీలిస్తే గ్రహాలన్నీ సూర్యునితో పాటు కొద్ది డిగ్రీల తేడాతో ఒక వరుసలో ఉన్నాయి. తొమ్మిదో గ్రహ కక్ష్య ఒక్కసారిగా ఆరు డిగ్రీల కోణంలో అసాధారాణ రీతిలో దిశ మార్చుకుని ఉండటం వల్ల జరిగే పరిణామాలను ఇప్పుడప్పుడే ఊహించలేమని కాల్ టెక్ కు చెందిన మరో ఖగోళ శాస్త్రవేత్త మైక్ బ్రౌన్ చెప్పారు. బ్రౌన్, అతని సహచర శాస్త్రవేత్త బెటీ జిన్ లు గణిత మోడళ్లు, కంప్యూటర్ సిమ్యూలేషన్స్ లలో గమనించిన తేడాల ద్వారా చివరి గ్రహమైన నెప్ట్యూన్ తర్వాత మంచు దిబ్బలు కలిగిన మరో గ్రహం ఏదో ఉందనే ఆధారాలు కనిపిస్తున్నట్లు చెప్పారు.
భూమి కంటే 10 రెట్లు పెద్దగా ఈ గ్రహం ఉండొచ్చని ఊహిస్తున్నారు. కాగా, తొమ్మిదో గ్రహాన్ని మరికొందరు 'ప్లానెట్ ఎక్స్' పేరుతో పిలుస్తున్నారు. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న 'ప్లానెట్ ఎక్స్' కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని మాత్రం ద్రువీకరించడం లేదు.