హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి: రజనీ
చెన్నై : చలన చిత్రపరిశ్రమంతా ఓ కుటుంబమని సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. ఆదివారం ఉదయం చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు చెన్నైలో అళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రజనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విజేతలు హామీలు నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేయాలని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే చలన చిత్రరంగానికి చెందిన ప్రముఖలంతా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. శరత్కుమార్, విజయ్, రాధా, రజనీ తదితరులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది. దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైనాయి. అంతేకాకుండా అటు శరత్కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ... చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొంది.
దాంతో ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఓ విధంగా చెప్పాంటే సీనియర్ నటులు... జూనియర్ నటుల మధ్య పోటీగా మారిందని చెప్పవచ్చు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు మాత్రం శరత్కుమార జట్టుకే ఉందని సమాచారం. కానీ ఈ ఎన్నికల్లో విజయావకాశాలు మాత్రం విశాల్ జట్టుకు వరించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది.
ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పద్మనాభన్ ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ నడిగర్ సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా లేక సాధారణ పోటీ మధ్య ఎంపికయిన జట్టు పదవీ బాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే.