నమాజ్, సూర్య నమస్కారాలు ఒకలాంటివే: యోగి
సూర్య నమస్కారాల్లో భాగంగా వేసే ఆసనాలు నమాజ్‌కు చాలా దగ్గరగా ఉంటాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తద్వారా యోగాకు, హిందూ మతానికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. 'సూర్య నమస్కారాలలో వేసే అన్ని ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామ క్రియలు.. ఇవన్నీ కూడా మన ముస్లిం మిత్రులు నమాజ్ సమయంలో చేసేటట్లుగానే ఉంటాయి' అని లక్నోలో నిర్వహించిన ఒక యోగా కార్యక్రమంలో ఆయన అన్నారు.
అధికారంలో ఉన్నవాళ్లు భోగాల గురించి చూశారే తప్ప యోగ గురించి చూడలేదని, అందుకే ఈ రెండింటినీ కలిపే ప్రయత్నం కూడా చేయలేదని ఆదిత్యనాథ్ అన్నారు. కులమతాల పేరుతో దేశాన్ని విడగొట్టాలనుకునేవాళ్లు యోగాను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యోగాను అంతర్జాతీయం చేయడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 2014 కంటే ముందు ఎవరైనా యోగా గురించి మాట్లాడితే వాళ్లకు మతం రంగు అంటగట్టేవారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా పాల్గొన్నారు. ఆయన పక్కన కూర్చునే యోగి ఆదిత్యనాథ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.