పూరీని విచారించనున్న నార్కోటిక్స్‌అధికారులు
హైదరాబాద్ : సిట్ అధికారుల విచారణకు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను తాజాగా నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేయనున్నారు. ఈ రోజు ఉదయం సిట్ విచారణ నిమిత్తం అబార్కీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్ హాజరు అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను సిట్ అధికారులు విడతలు వారీగా విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఎవరో మొదట తెలియదని చెప్పిన పూరీ జగన్నాథ్... పలు ఆధారాలను సిట్ బృందం బయటపెట్టడంతో నిజం ఒప్పుకోక తప్పలేదు.
కెల్విన్ పరిచయం విషయంలో ముందు బుకాయించిన పూరీ... ఆతర్వాత జ్యోతిలక్ష్మి ఆడియో విడుదల ఫంక్షన్‌కు కెల్విన్‌తో పాటు జీశాన్ కూడా హాజరయిన ఫోటోలను సిట్ బృందం బయటపెట్టడంతో... కెల్విన్‌తో పరిచయాన్ని అంగీకరించినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఛార్మీ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అలాగే పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని తేల్చేందుకు ఆయన రక్త నమూనాలు సేకరించే అవకాశం ఉంది. అలాగే పూరీ ఇచ్చిన సమాచారంతో ఓ వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ విచారణ కొనసాగుతోందని, అయితే విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించడం కుదరదని తెలిపారు. మరోవైపు పూరీ కుటుంబసభ్యులతో పాటు, ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పూరీ జగన్నాథ్‌ను విచారణ చేయనున్న నేపథ్యంలో గంట గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. మరికొన్ని గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.