న్యూయార్క్: ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014’లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లకు చోటు దక్కింది. ర్యాంకులు కేటాయించకుండా గురువారం ప్రచురించిన ఈ జాబితాలో నలుగురు భారతీయులు ఉన్నారు. మోడీ, కేజ్రీవాల్‌లతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, కోయంబత్తూరుకు చెందిన ఆరోగ్య కార్యకర్త అరుణాచలం మురుగనందమ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మోడీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఏలనున్న విభజనవాద రాజకీయ నేత అని టైమ్ పేర్కొంది. ‘మోడీ వేగంగా చర్యలు తీసుకుంటారని, ప్రై వేట్ రంగాన్ని ప్రోత్సహిస్తారని, బాగా పరిపాలిస్తారనే ఖ్యాతి ఉంది.
అయితే నిరంకుశంగా పాలిస్తారని, అతివాద హిందూ జాతీయవాది అనే మచ్చ కూడా ఉంది. అయితే మార్పు ఆశిస్తున్న దేశంలో ఇలాంటి ఆందోళనలు తగ్గుతున్నాయి’ అని వ్యాఖ్యానించింది. అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక భారత రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి అని పేర్కొంది. శక్తిమంతులను ఢీకొంటున్న ఆయనది భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమంది. అరుంధతీరాయ్ భారతదేశ చైతన్యమని అభివర్ణించింది.