online poll
-
లాన్‌డౌన్ పొడిగింపు; జనం ఏమంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టకి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం రెండోసారి పొడిగించింది. కరోనా వ్యాప్తి నానాటికి పెరుగుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో కేంద్రం మరోసారి నిర్బంధాన్ని పొడిగించాల్సి వచ్చింది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. దీంతో లాక్డౌన్ కొనసాగింపునకు కేంద్రం సుముఖంగా ఉందన్న వార్తలు నాలుగు రోజులు నుంచి వస్తున్నాయి. అనుకున్నట్టుగానే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. (మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు) కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో నిర్బంధాన్ని కాస్త సడలించి ప్రజలకు కేంద్రం ఊరట కల్పించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా అమలు చేయనున్నట్టు ప్రభుత్వం పునరుద్ఘాటించింది. నిర్బంధాన్ని మే 3 వరకు పొడిగిస్తూ ప్రకటన చేసిన తర్వాత గ్రీన్ జోన్లలో ప్రభుత్వం పలు సడలింపులు ప్రకటించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో అమలు చేసుకోవచ్చని సూచించింది. అయితే రాష్ట్రాలు వీటిలో చాలా వాటిని అమలు చేయలేదు. అటు జనం కూడా కరోనా భయంతో లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నారు. (3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా..) ‘సాక్షి డాట్ కామ్’ నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లోనూ ఎక్కువ మంది లాన్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. మే నెలాఖరు వరకు పొడిగించాలని 63 శాతం మంది, కొన్ని సడలింపులతో పొడిగించాలని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. 19 శాతం మంది మరో 15 రోజులైనా పొడిగించాలన్నారు. లాక్డౌన్ పొడిగించాల్సిన అవసరం లేదని కేవలం 6 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని ఎవరూ కోరుకోలేదు. దీన్నిబట్టి ప్రజలు ఎక్కువ శాతం లాక్డౌన్ కొనసాగించడానికే మొగ్గుచూపారని అర్థమవుతుంది. -
అభిమానులే గెలిపించాలి
కెరీర్లో ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నారు ఆలియా భట్. అవకాశాలు ఆమెకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆలియాకు ఓ అరుదైన అవకాశం వచ్చింది. కానీ ఇందులో గెలవడం ఆలియా చేతిలో లేదు. ఆమె అభిమానులే గెలిపించాలి. ‘మోస్ట్ ఇన్స్పైరింగ్ ఆసియన్ ఉమెన్ పీపుల్ ఛాయిస్ అవార్డు’ కు అలియా భట్ నామినేట్ అయ్యారు. ఈ ఏడాది ఇండియా నుంచి నామినేట్ అయ్యింది ఆలియా భట్ ఒక్కరే కావడం విశేషం. ఇక ఆలియాను గెలిపించాలంటే ఆమె అభిమానులు ఆన్లైన్ పోల్ ఓట్లు వేయాలి. ఈ అవకాశం అక్టోబరు 18 వరకు ఉంటుంది. నవంబరు 10న విజేతను ప్రకటిస్తారు. చైనీస్ యాక్టర్ జౌ డోంగ్యూ, సౌత్ కొరియన్ నటి జంగ్ యు మీ, థాయ్ నటి ప్రయా లండ్‌బర్గ్ వంటి వారు ఆలియా భట్‌కు పోటీగా ఉన్నారు. ఇంతకుముందు ఈ అవార్డును ప్రియాంకా చోప్రా గెలుచుకున్నారు. మరి.. ఆలియా గెలుచుకుంటారా? అభిమానుల చేతుల్లోనే ఉంది. -
పన్నీర్‌కే 95 శాతం మద్దతు!
చెన్నై: దేశ వ్యాప్తంగా ప్రజలు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో.. శశికళ, పన్నీర్ సెల్వంల మధ్య జరుగుతున్న పోరులో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఇదే అంశంపై ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికి నిర్వహించిన పలు సర్వేల్లో పన్నీర్ సెల్వంకే ఊహించని మద్దతు లభిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 95 శాతం మంది ప్రజలు పన్నీర్‌కే పట్టం కట్టడం విశేషం. మొత్తం 82,000 మంది పాల్గొన్న సర్వేలో 78,700 మంది పన్నీర్‌కు మద్దతు తెలుపగా.. కేవలం 3,700 మంది మద్దతు మాత్రమే చిన్నమ్మ పొందగలిగారు. తమిళ్ సమయమ్ నిర్వహించిన మరో సర్వేలో పన్నీర్‌కు ఏకంగా 97 శాతం మంది మద్దతు పలికారు. -
శశికళ గురించి ప్రజలు ఏమన్నారు?
శశికళను ముఖ్యమంత్రిగా చేయడానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు క్యూ కట్టినా, ప్రజలు మాత్రం ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు స్పష్టమైంది. తమిళనాట ప్రముఖ పత్రిక అయిన 'నక్కీరన్' ఆన్లైన్లో శశికళను ముఖ్యమంత్రి చేయడంపై ఒక పోల్ నిర్వహించగా, ఒక్క గంట సమయంలోనే ఆమెకు అనుకూలంగా 7,400 మంది ఓటు వేయగా, ఆమెకు వ్యతిరేకంగా అదే సమయంలో 7.12 లక్షల మంది ఓటు వేశారు. ప్రజల తీర్పును ఆమె పాటించాలని 90 శాతం మంది చెప్పగా, అది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారమని 7 శాతం మంది, చట్టానికి అనుగుణంగా వెళ్లాలని 3 శాతం మంది చెప్పారు. అలాగే మరో చిన్న పోర్టల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కూడా 124 మంది శశికళకు అనుకూలంగాను, 25 వేల మందికి పైగా వ్యతిరేకంగాను ఓటేశారు. దాంతో ఆమె ముఖ్యమంత్రి కావడం ప్రజలకు, ముఖ్యంగా నెటిజన్లకు ఏమాత్రం ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోంది. జాతకాలు సరిగా చూడకపోతే ఇంతే: స్వామి జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టుకోవడం తమిళనాడులో బాగా అలవాటు. అయితే, ఆ జాతకాలు సరిగా చూడకపోతే ఆ ఫలితాలు కూడా అలాగే ఉంటాయని, శశికళ ఈనెల తొమ్మిదోతేదీన ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం అలాంటిదేనని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యససభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి ట్వీట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడటంతో ఆయనీ వ్యాఖ్య చేశారు. Astrology which not perfectly understood and hence can go wrong predicts Sasikala will become CM on 9 th Feb — Subramanian Swamy (@Swamy39) 7 February 2017 -
మోదీ మళ్ళీ రావాలి..!
న్యూఢిల్లీః నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 లోనూ అధికారంలోకి రావాలని 70 శాతం మంది భారత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత.. మోదీనే మళ్ళీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్సాప్ సహకారంతో ఓ న్యూస్ యాప్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ కొత్త అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. న్యూస్ యాప్ ద్వారా నిర్వహించిన ఆన్ లైన్ పోల్ కు స్పందించిన మొత్తం 63,141 వినియోగదారుల్లో నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావాలని 79 శాతం మంది ఓటు వేయగా, 17 శాతం మంది వద్దని, 13 శాతం మంది మాత్రం ఇంకా నిర్ణయించలేదంటూ స్పందించారు. అయితే మిగిలిన మద్దతుదారులతో పోలిస్తే మహిళల నుంచి మాత్రం మద్దతు స్వల్పంగా తగ్గి 64 శాతంగా నమోదైంది. యూత్ ఆఫ్ ద నేషనల్ పోల్ రెండో ఎడిషన్ ప్రకారం 64 శాతం మంది మహిళలు మద్దతు పలుకగా... 18 శాతంమంది వద్దని, మరో 18 శాతం మంది నిర్ణయించలేదని ఓట్ చేశారు. జూలై 25 నుంచి ఆగస్లు 7 వరకూ నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది 35 సంవత్సరాల వయసు లోపు వారే పాల్గొన్నారు. అయితే పోల్ లో పాల్గొన్న సగంకంటే ఎక్కువ (57 శాతం) మంది కొన్ని రాష్ట్రాల్లో మద్య నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. కళాశాల ప్రాంగణాల్లో విద్యార్థుల రాజకీయాలను నిషేధించడంపై అడిగిన ప్రశ్నకు 61 శాతం మంది అవును అని, 32 శాతం మంది కాదని, 7 శాత మంది మాత్రం చెప్పలేమని అన్నారు. అలాగే గత రెండు సంవత్సరాల్లో దళితులు, మైనారిటీల అత్యాచారాల పెరుగుదలపై 33 శాతం మంది నిజమని, 46 శాతం మంది కాదని, 21 శాతం మంది మాత్రం చెప్పలేమని ఓటు వేశారు. ముఖ్యంగా తాము నిర్వహించిన పోల్ లో యువత, విద్యావంతులు మోదీ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నట్లు వ్యక్తమౌతున్నదని, కాశ్మీర్లో బుర్హాన్ వాని మరణం అనంతరం నిరసనలు.. ప్రభుత్వం అనుసరించిన విధానాలను వారు ఆమోదించినట్లు ఇప్సాస్ ఇండియా సీఈవో అమిత్ అదార్కర్ తెలిపారు. -
అసంతృప్తిగా ఉంటే.. పోలీసు కాల్ వస్తుంది!
మీరు అసంతృప్తిగా ఉన్నారా? అయితే మీకు మేం కాల్ చేస్తాం అంటున్నారు దుబాయ్ పోలీసులు. 2021 నాటికి ప్రపంచంలోని టాప్ టెన్ సంతోషకరమైన నగరాల జాబితాలో చోటు సంపాదించే ఉద్దేశంతో దుబాయ్ పోలీసులు ఈ మేరకు కొత్త ఆన్లైన్ సర్వే చేపట్టారు. ఈ సర్వే ప్రకారం మీరు ఆనందంగా ఉన్నారా? మాములుగా ఉన్నారా? బాధగా ఉన్నారా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆన్లైన్ సర్వేలో ఎవరైనా తాము అసంతృప్తిగా ఉన్నట్టు ఆప్షన్ ఎంపిక చేస్తే.. వారికి పోలీసులు కాల్ చేసి మాట్లాడనున్నారు. వారి అసంతృప్తికి కారణాలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే దుబాయ్ చాలా రంగాల్లో పేరుగాంచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడమూ ఇక్కడే ఉంది. ఈ నేపథ్యంలో ఆనందకరమైన నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉండాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఇందుకు నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్నామని చెప్తే వారికి పోలీసులు కాల్ చేయడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 'ద హ్యాపీనెస్ ఇండస్ట్రీ: హై ద గవర్న్మెంట్ అండ్ బిగ్ బిజినెస్ సోల్డ్ అస్ వెల్-బియింగ్' రచయిత విలియమ్ డేవిస్ ఈ సర్వేపై స్పందిస్తూ 'ఇది ప్రజలను భయపెట్టే సర్వేలా నాకు అనిపిస్తున్నది. ఎవరైనా పొరపాటున తాము అసంతృప్తిగా ఉన్నామంటే.. 'ఏంటి సంగతి' అని పోలీసుల నుంచి వారికి కాల్ రావడం ఒక రకంగా భయపెట్టేదే' అని పేర్కొన్నారు. -
ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లో 21వ శతాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. 2000 సంవత్సరంనుంచి ప్రదర్శన ప్రకారం 23 శాతం అభిమానులు సచిన్‌కు ఓటు వేయగా, ఆసీస్ స్టార్ పాంటింగ్ (11%)కు నాలుగో స్థానం మాత్రమే దక్కింది. సంగక్కర, గిల్‌క్రిస్ట్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు సచిన్‌ను ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెట్ అభివృద్ధి కమిటీలోకి తీసుకుంది. ముంబైలో క్రికెట్ అభివృద్ధికి మాస్టర్ తోడ్పడతాడని ఎంసీఏ తెలిపింది. -
‘టైమ్ 100’జాబితాలో నలుగురు భారతీయులు
న్యూయార్క్: ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014’లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లకు చోటు దక్కింది. ర్యాంకులు కేటాయించకుండా గురువారం ప్రచురించిన ఈ జాబితాలో నలుగురు భారతీయులు ఉన్నారు. మోడీ, కేజ్రీవాల్‌లతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, కోయంబత్తూరుకు చెందిన ఆరోగ్య కార్యకర్త అరుణాచలం మురుగనందమ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మోడీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఏలనున్న విభజనవాద రాజకీయ నేత అని టైమ్ పేర్కొంది. ‘మోడీ వేగంగా చర్యలు తీసుకుంటారని, ప్రై వేట్ రంగాన్ని ప్రోత్సహిస్తారని, బాగా పరిపాలిస్తారనే ఖ్యాతి ఉంది. అయితే నిరంకుశంగా పాలిస్తారని, అతివాద హిందూ జాతీయవాది అనే మచ్చ కూడా ఉంది. అయితే మార్పు ఆశిస్తున్న దేశంలో ఇలాంటి ఆందోళనలు తగ్గుతున్నాయి’ అని వ్యాఖ్యానించింది. అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక భారత రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి అని పేర్కొంది. శక్తిమంతులను ఢీకొంటున్న ఆయనది భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమంది. అరుంధతీరాయ్ భారతదేశ చైతన్యమని అభివర్ణించింది. -
‘టైమ్’ ప్రభావశీలుర పోల్‌లో మోడీని అధిగమించిన కేజ్రీ
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్... ప్రపంచంలోని వందమంది ప్రభావశీలుర జాబితా రూపకల్పనకు నిర్వహిస్తున్న ఆన్లైన్ పోల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. మంగళవారం ఉదయం వరకూ నమోదైన గణాంకాల ప్రకారం కేజ్రీవాల్ అత్యధిక ‘ఎస్’ ఓట్లతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోపాటు అమెరికా పాప్ గాయని కేటీ పెర్రీని అధిగమించారు. ఈ పోల్‌లో కేజ్రీవాల్‌కు 71.5 శాతం ‘ఎస్’ ఓట్లు లభించగా వ్యతిరేకంగా 28.5 శాతం ‘నో’ ఓట్లు పడ్డాయి. కేజ్రీవాల్‌కు ఇప్పటివరకూ 3,168,308 ఓట్లు లభించాయి. మరోవైపు ఈ జాబితాలో పోటీపడుతున్న ప్రముఖుల్లో అందరికంటే ఎక్కువ శాతం ‘నో’ ఓట్లతో మోడీ వెనకంజలో ఉన్నారు. మోడీకి 49.7 శాతం ‘ఎస్’ ఓట్లు లభించగా 50.3 శాతం ‘నో’ ఓట్లు వచ్చాయి. మోడీకి ఇప్పటివరకూ 5,075,588 ఓట్లు వచ్చాయి. కేజ్రీవాల్, మోడీ తర్వాతి స్థానంలో ఈజిప్టు సైనిక కమాండర్ అబ్దుల్ ఫత్తా అల్-సిసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తం 96,070 ఓట్లతో 40వ ర్యాంకులో కొనసాగుతున్నారు.