శశికళ గురించి ప్రజలు ఏమన్నారు?
శశికళను ముఖ్యమంత్రిగా చేయడానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు క్యూ కట్టినా, ప్రజలు మాత్రం ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు స్పష్టమైంది. తమిళనాట ప్రముఖ పత్రిక అయిన 'నక్కీరన్' ఆన్‌లైన్‌లో శశికళను ముఖ్యమంత్రి చేయడంపై ఒక పోల్ నిర్వహించగా, ఒక్క గంట సమయంలోనే ఆమెకు అనుకూలంగా 7,400 మంది ఓటు వేయగా, ఆమెకు వ్యతిరేకంగా అదే సమయంలో 7.12 లక్షల మంది ఓటు వేశారు. ప్రజల తీర్పును ఆమె పాటించాలని 90 శాతం మంది చెప్పగా, అది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారమని 7 శాతం మంది, చట్టానికి అనుగుణంగా వెళ్లాలని 3 శాతం మంది చెప్పారు. అలాగే మరో చిన్న పోర్టల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కూడా 124 మంది శశికళకు అనుకూలంగాను, 25 వేల మందికి పైగా వ్యతిరేకంగాను ఓటేశారు. దాంతో ఆమె ముఖ్యమంత్రి కావడం ప్రజలకు, ముఖ్యంగా నెటిజన్లకు ఏమాత్రం ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోంది.
జాతకాలు సరిగా చూడకపోతే ఇంతే: స్వామి
జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టుకోవడం తమిళనాడులో బాగా అలవాటు. అయితే, ఆ జాతకాలు సరిగా చూడకపోతే ఆ ఫలితాలు కూడా అలాగే ఉంటాయని, శశికళ ఈనెల తొమ్మిదోతేదీన ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం అలాంటిదేనని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యససభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి ట్వీట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడటంతో ఆయనీ వ్యాఖ్య చేశారు.