మోదీ మళ్ళీ రావాలి..!
న్యూఢిల్లీః నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 లోనూ అధికారంలోకి రావాలని 70 శాతం మంది భారత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత.. మోదీనే మళ్ళీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్సాప్ సహకారంతో ఓ న్యూస్ యాప్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ కొత్త అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
న్యూస్ యాప్ ద్వారా నిర్వహించిన ఆన్ లైన్ పోల్ కు స్పందించిన మొత్తం 63,141 వినియోగదారుల్లో నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావాలని 79 శాతం మంది ఓటు వేయగా, 17 శాతం మంది వద్దని, 13 శాతం మంది మాత్రం ఇంకా నిర్ణయించలేదంటూ స్పందించారు. అయితే మిగిలిన మద్దతుదారులతో పోలిస్తే మహిళల నుంచి మాత్రం మద్దతు స్వల్పంగా తగ్గి 64 శాతంగా నమోదైంది. యూత్ ఆఫ్ ద నేషనల్ పోల్ రెండో ఎడిషన్ ప్రకారం 64 శాతం మంది మహిళలు మద్దతు పలుకగా... 18 శాతంమంది వద్దని, మరో 18 శాతం మంది నిర్ణయించలేదని ఓట్ చేశారు.
జూలై 25 నుంచి ఆగస్లు 7 వరకూ నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది 35 సంవత్సరాల వయసు లోపు వారే పాల్గొన్నారు. అయితే పోల్ లో పాల్గొన్న సగంకంటే ఎక్కువ (57 శాతం) మంది కొన్ని రాష్ట్రాల్లో మద్య నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. కళాశాల ప్రాంగణాల్లో విద్యార్థుల రాజకీయాలను నిషేధించడంపై అడిగిన ప్రశ్నకు 61 శాతం మంది అవును అని, 32 శాతం మంది కాదని, 7 శాత మంది మాత్రం చెప్పలేమని అన్నారు. అలాగే గత రెండు సంవత్సరాల్లో దళితులు, మైనారిటీల అత్యాచారాల పెరుగుదలపై 33 శాతం మంది నిజమని, 46 శాతం మంది కాదని, 21 శాతం మంది మాత్రం చెప్పలేమని ఓటు వేశారు. ముఖ్యంగా తాము నిర్వహించిన పోల్ లో యువత, విద్యావంతులు మోదీ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నట్లు వ్యక్తమౌతున్నదని, కాశ్మీర్లో బుర్హాన్ వాని మరణం అనంతరం నిరసనలు.. ప్రభుత్వం అనుసరించిన విధానాలను వారు ఆమోదించినట్లు ఇప్సాస్ ఇండియా సీఈవో అమిత్ అదార్కర్ తెలిపారు.