‘టైమ్’ ప్రభావశీలుర పోల్‌లో మోడీని అధిగమించిన కేజ్రీ
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్... ప్రపంచంలోని వందమంది ప్రభావశీలుర జాబితా రూపకల్పనకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పోల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. మంగళవారం ఉదయం వరకూ నమోదైన గణాంకాల ప్రకారం కేజ్రీవాల్ అత్యధిక ‘ఎస్’ ఓట్లతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోపాటు అమెరికా పాప్ గాయని కేటీ పెర్రీని అధిగమించారు.
ఈ పోల్‌లో కేజ్రీవాల్‌కు 71.5 శాతం ‘ఎస్’ ఓట్లు లభించగా వ్యతిరేకంగా 28.5 శాతం ‘నో’ ఓట్లు పడ్డాయి. కేజ్రీవాల్‌కు ఇప్పటివరకూ 3,168,308 ఓట్లు లభించాయి. మరోవైపు ఈ జాబితాలో పోటీపడుతున్న ప్రముఖుల్లో అందరికంటే ఎక్కువ శాతం ‘నో’ ఓట్లతో మోడీ వెనకంజలో ఉన్నారు.
మోడీకి 49.7 శాతం ‘ఎస్’ ఓట్లు లభించగా 50.3 శాతం ‘నో’ ఓట్లు వచ్చాయి. మోడీకి ఇప్పటివరకూ 5,075,588 ఓట్లు వచ్చాయి. కేజ్రీవాల్, మోడీ తర్వాతి స్థానంలో ఈజిప్టు సైనిక కమాండర్ అబ్దుల్ ఫత్తా అల్-సిసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తం 96,070 ఓట్లతో 40వ ర్యాంకులో కొనసాగుతున్నారు.