సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టకి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం రెండోసారి పొడిగించింది. కరోనా వ్యాప్తి నానాటికి పెరుగుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో కేంద్రం మరోసారి నిర్బంధాన్ని పొడిగించాల్సి వచ్చింది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. దీంతో లాక్‌డౌన్ కొనసాగింపునకు కేంద్రం సుముఖంగా ఉందన్న వార్తలు నాలుగు రోజులు నుంచి వస్తున్నాయి. అనుకున్నట్టుగానే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. (మే 17 వరకు లాక్‌డౌన్ పొడగింపు)
కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో నిర్బంధాన్ని కాస్త సడలించి ప్రజలకు కేంద్రం ఊరట కల్పించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా అమలు చేయనున్నట్టు ప్రభుత్వం పునరుద్ఘాటించింది. నిర్బంధాన్ని మే 3 వరకు పొడిగిస్తూ ప్రకటన చేసిన తర్వాత గ్రీన్ జోన్లలో ప్రభుత్వం పలు సడలింపులు ప్రకటించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో అమలు చేసుకోవచ్చని సూచించింది. అయితే రాష్ట్రాలు వీటిలో చాలా వాటిని అమలు చేయలేదు. అటు జనం కూడా కరోనా భయంతో లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నారు. (3 తర్వాత లాక్‌డౌన్ సడలింపు పక్కా..)
‘సాక్షి డాట్ కామ్’ నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లోనూ ఎక్కువ మంది లాన్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. మే నెలాఖరు వరకు పొడిగించాలని 63 శాతం మంది, కొన్ని సడలింపులతో పొడిగించాలని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. 19 శాతం మంది మరో 15 రోజులైనా పొడిగించాలన్నారు. లాక్‌డౌన్ పొడిగించాల్సిన అవసరం లేదని కేవలం 6 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని ఎవరూ కోరుకోలేదు. దీన్నిబట్టి ప్రజలు ఎక్కువ శాతం లాక్‌డౌన్ కొనసాగించడానికే మొగ్గుచూపారని అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment