
మోడీ చాయ్‌వాలా కాదు..కాంట్రాక్టర్
అహ్మదాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి , గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ‘చాయ్ వాలా’ ప్రచారాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ రంగంలోకి దిగారు. మోడీ చాయ్‌వాలా కాదని, ఆయనో కేంటీన్ కాంట్రాక్టరని సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి పటేల్ చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం ఆరంభించారని, అదంతా ఆయన ఆడే నాటకంలో ఓ భాగమేనని పటేల్ పేర్కొన్నారు.
ఆయనో కాంట్రాక్టర్ అనే విషయాన్ని చాయ్‌వాలాల సంఘం తనకు చెప్పిందని మోడీ పేరెత్తకుండా ఇక్కడ శనివారం జరిగిన ‘స్వరాజ్ కుచ్’ సభలో పాల్గొన్న అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. అత్యంత ఎత్తయిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని కుర్చీకి నిచ్చెన వెయ్యాలని అనుకుంటున్నారని మోడీపై మండిపడ్డారు. మోడీ చెప్పే గుజరాత్ మోడల్ నకిలీదని, గాంధీ, పటేల్ భావజాలమే అసలైన గుజరాత్ మోడల్ అని పటేల్ అభిప్రాయపడ్డారు. అయాచితంగా పదవిలోకి వచ్చిన వారికి ఆకస్మికంగా తానో చాయ్‌వాలానని, రామభక్తుడినని గుర్తొస్తుందని విమర్శించారు. గుజరాత్ ప్రథమ స్థానంలో ఉందని మోడీ చెపుతుంటారని, అయితే అది అథమం నుంచి ప్రథమం అని ఎద్దేవా చేశారు.