'పేదరికాన్ని తరిమికొట్టేందుకు హిందూ, ముస్లింలు ఏకం కావాలి'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. మోడీ పాల్గొనే హుంకార్ ర్యాలీ సభలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నా.. ఆయన ఆ సభలో పాల్గొన్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన సభలో నరేంద్రమోడీ ఉద్వేగంగా ప్రసంగించారు. హుంకార్ ర్యాలీకి లక్షలాది మంది హాజరయ్యారు.
హుంకార్ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో బీహార్ కు ప్రత్యేక స్థానం ఉందని, బీహార్ లేకుండా దేశంలో ఎలాంటి మార్పు సాధ్యం కాదని అన్నారు.దేశానికి జయప్రకాశ్ నారాయణ్ లాంటి మహానాయకుడిని బీహార్ అందించిందని చెప్పారు. జయప్రకాశ్ చేయి పట్టుకుని రాజకీయాల్లో నడిచే మహాభాగ్యం తనకు లభించిందని తెలిపారు. తన ప్రసంగం ఆరంభంలో నితీష్ ను టార్గెట్ చేసిన మోడీ.. ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు.
జయప్రకాశ్ నారాయణ సిద్దాంతాలను తుంగలో తొక్కిన నితీష్ కు బీజేపీని వదిలిపెట్టడం అంత కష్టమేమీ కాదు అని మోడీ అన్నారు. బీజేపీని వ్యతిరేకించి నితీష్ కాంగ్రెస్ తో కుమ్మక్కైనారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జీవితాంతం రాం మనోహర్ లోహియా పోరాటం చేశారని, లోహియాను ఆరాధించిన వాళ్లే ప్రస్తుతం ఆయన సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడిచారంటూ నితీష్, లాలూను పరోక్షంగా విమర్శించారు.
కాంగ్రెస్ తో కుమక్కైన నితీష్ ను జయప్రకాశ్, రాం మనోహర్ లోహియా ఆత్మలు క్షమించవని అన్నారు. అవకాశం వచ్చినపుడల్లా లాలూ నన్నువిమర్శించడానికి ఎన్నడూ వెనుకాడలేదు.. మోడీని ఎన్నడూ ప్రధాని మంత్రిని కానివ్వనూ అని లాలూ అన్నారు.. తనను విమర్శించిన లాలూ.. ఓసారి ప్రమాదానికి గురైప్పుడూ ఫోన్ లో పరామర్శించాను అని మోడీ తెలిపారు. తాను రైళ్లలో టీ అమ్ముకునే స్థితి నుంచి ఈ హోదాకు చేరుకున్నానని.. రైళ్లలో టీ అమ్ముకునే వారి బాధలు తనకంటే ఏ రైల్వే మంత్రికి కూడా తెలియవు అని అన్నారు.
రాజకీయాల్లో హిపోక్రసికి కూడా ఓ హద్దు ఉంటుంది అన్నాడు. మోడీ ఎన్ని రకాల అవమానాలకు గురైనా కాని.. బీహార్ లో మరోసారి ఆటవిక రాజ్యం రాకూడదని కోరుకుంటున్నాని అన్నారు. తన ప్రసంగంలో ఆద్యంతం యాదవ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పా్ర్టీని తరిమి కొట్టేందుకు పాట్నాలోని గాంధీ మైదానం నుంచే సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు.
యూపీఏ ప్రభుత్వ పాలనకు పదేళ్లు పూర్తికానుంది అయితే గత ఎన్నికల్లో వంద రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తామని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది అని.. కాని తన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. ధరలు పెరుగుతున్నాయన్నారు. ఇది ర్యాలీ కాదని.. చరిత్రను మార్చే ఓ వేదిక అని వ్యాఖ్యానించారు. పేదరికాన్ని తరిమికొట్టాలంటే హిందూ, ముస్లింలు ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. మోడీ పాల్గొన్న వేదిక సమీపంలోనే ఐదు వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి పాట్నాలో ఆరు బాంబు పేలుళ్లు సంభవించాయి.