ప్రజల్ని బాధిస్తూ ఏపీ విభజన: నరేంద్ర మోడీ
కాంగ్రెస్ తీరుపై నరేంద్ర మోడీ ధ్వజం
అజ్మీర్/సికర్ (రాజస్థాన్): ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరును బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తప్పుపట్టారు. ఇద్దరు అన్నదమ్ములు లేదా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికీ కాంగ్రెస్ నాయకులు సంకోచించట్లేదని ధ్వజమెత్తారు. ‘విభజించు పాలించు’ విధానంతో వారు ముందుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా దేశానికి కాంగ్రెస్ పార్టీ చేటు తెస్తోందని, దీన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. అజ్మీర్‌లోని పటేల్ స్టేడియంలో గురువారం జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విభజించి వరుసగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పాటుచేస్తే అక్కడి ప్రజలు సంతోషించారని చెప్పారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాధపెట్టి విభజన ప్రక్రియ సాగిస్తోందని విమర్శించారు. దీంతో తెలంగాణ, సీమాంధ్ర ఇరు ప్రాంతాలూ మండుతున్నాయని చెప్పారు.
దేశంలో రెండు భిన్న ఆలోచన ధోరణులు, సైద్ధాంతిక విధానాలు ఉన్నాయంటూ బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోడీ పైవిధంగా స్పందించారు. పేదల కోసం చట్టాలు మాత్రమే చేస్తే సరిపోదన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దేశంలోని పేదరికం, నిరక్షరాస్యత దీన్ని ఎత్తిచూపిస్తున్నాయని దుయ్యబట్టారు. తర్వాత సికర్‌లో జరిగిన ఎన్నికల సభలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ‘‘దేశ ప్రజలను పేదలుగా, నిరక్షరాస్యులుగా ఉంచడానికి అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించారా? కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చలేదు. అంతేగాక 60 ఏళ్లలో దేశాన్ని ధ్వంసం చేసింది’’ అని విమర్శించారు.
సింహానికి పిస్తోలు చూపించి భయపెట్టాలి గానీ, దాని లెసైన్స్ చూపిస్తే భయపడుతుందా అంటూ ప్రశ్నించారు. అలాగే చట్టాలు రూపొందించడం కాదు. వాటి ఆచరణ కూడా చాలా ముఖ్యం అని చెప్పారు. సుప్రీం కోర్టు చెబుతున్నా పట్టించుకోకుండా వేలాది టన్నులు ఆహార ధాన్యాలను గోదాముల్లో కుళ్లబెట్టేస్తున్న యూపీఏ ప్రభుత్వం.. ఇలాంటి చర్యలతో పేదలను అవమానపరుస్తోందని మండిపడ్డారు. ఆ ధాన్యాలను 80 పైసల చొప్పున మద్యం ఉత్పత్తిదారులకు సరఫరా చేస్తుంది తప్ప, రైతులకు మాత్రం ఇవ్వదని విమర్శించారు. కేంద్రంలోగానీ, రాజస్థాన్‌లోగానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు కనబడడంలేదన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కలల పథకం నదుల అనుసంధానంపై కాంగ్రెస్ దృష్టి పెట్టి ఉంటే చాలా ప్రాంతాలు సస్యశ్యామలమై ఉండేవన్నారు. బీజేపీకి దేశంలో అనుకూల పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్ హస్తం దేశంలో ఏమూలలో కూడా లేకుండా చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు.