
సవాళ్లను అవకాశంగా మార్చుకుందాం!
వర్షాభావాన్ని ఎదుర్కొందామన్న ప్రధాని
న్యూఢిల్లీ: ఈసారి లోటు వర్షపాతం నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇలాంటి సవాళ్లనే అవకాశాలుగా మలచుకోవాలని అభిప్రాయపడ్డారు. కురిసే వర్షాలనైనా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాగుకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటలను తవ్వుకోవాలని రైతులకు సూచించారు. ‘ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన’ పథకంపై వ్యవసాయ శాఖతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలు, పీఎంవో ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ పలు సూచనలు చేశారు. దేశంలో వ్యవసాయ నెట్‌వర్క్‌ను పెంపొందించడానికి బహుళవిధ వ్యూహాలను అమలు చేయాలని పేర్కొన్నారు. లోటు వర్షపాతాన్ని సవాల్‌గా తీసుకుని పరిష్కారాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటలను తవ్వి వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలని, ఇది జిల్లా స్థాయిలో యువ అధికారులు ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. రైతులకు ప్రయోజనాలను వేగంగా అందించేందుకు పాలనా విధానాలను, సాంకేతికతను సమీక్షించుకోవాలని కూడా మోదీ ఆదేశించారు. నీటి సద్వినియోగం దిశగా దేశవ్యాప్తంగా పంటల విధానాలను కూడా సమీక్షించి సాగు నెట్‌వర్క్‌ను విస్తరించాలని, సూక్ష్మ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు చేయాలని సూచించారు.