అమృతసర్ ను కేటాయిస్తేనే పోటీ చేస్తా:నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీ పెద్దలపై నిరసన గళం వినిపించాడు. తనకు అమృతసర్ ను కేటాయిస్తేనే ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతానని స్పష్టం చేశాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధూ.. తనకు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అమృతసర్ ను కేటాయించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. కాని పక్షంలో వేరే ఏ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని భావించడం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమృతసర్ ను అరుణ్ జైట్లీకి కేటాయించడంతో సిద్ధూ తన అసహనాన్ని వెళ్లగక్కారు.
ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం ఏమీ ఇబ్బంది లేకపోయినా, తనకు మాత్రం అడ్డుతగులుతున్నారని వ్యాఖ్యానించారు. 'నేను ఇక్కడి నుంచే ఎప్పుడూ పోటీ చేస్తానని ప్రజలకు మాట ఇచ్చానని సంగతిని వివరించారు. ఇక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గతంలో హామీ ఇచ్చానన్నారు. అమృతసర్ ను వదులుకుంటే ఇక ఎక్కడ సీటు ఇచ్చినా పోటీ దిగే ప్రసక్తే లేదని తెలిపారు. నేను వేరే చోట ఇమ్మని కూడా బీజేపీ పెద్దలను కోరలేదని' సిద్దూ ఆవేదన వ్యక్తం చేశారు.