ఎంపీ పదవికి సిద్ధూ రాజీనామా
న్యూఢిల్లీ:ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మాజీ క్రికెటర్ సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీలో చేరే యోచనలో ఉన్న కారణంగానే సిద్ధూ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల క్రితం సిద్ధూను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. 2017లో పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధమవుతున్న కారణంగానే సిద్ధూ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రధాన ప్రచార బాధ్యతలన సిద్ధూకు అప్పగించే అవకాశం ఉంది. ఆప్ పార్టీ తరపున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ బరిలోకి నిలిచే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం బీజేపీ శాసన సభ్యురాలిగా ఉన్న అతని భార్య నవజ్యోత్ కౌర్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి అరుణ్ జైట్లీ పోటీ చేయడంతో ఆ స్థానాన్ని సిద్దూ వదులుకోవాల్సి వచ్చింది.