పాక్ కొత్త ఆర్మీ చీఫ్ ను ఎంపిక చేసేశారా?
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ పదవీ కాలం మరో పన్నెండు రోజులే ఉండటంతో ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాలు పాక్ లో ఊపందుకున్నాయి. కొంతమంది పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కొత్త ఆర్మీ జనరల్ నియామకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. అయితే, నవాజ్ షరీఫ్ ఇప్పటికే ఆ నిర్ణయాన్ని తీసేసుకున్నారని ప్రముఖ జర్నలిస్టు ఘరిద్హా ఫరూఖీ అంటున్నారు. వాస్తవానికి రహీల్, నవాజ్ ల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలకు ఆయన పదవీ కాలం ముగియక ముందే కొత్త ఆర్మీ జనరల్ పేరును షరీఫ్ ప్రకటిస్తారని అందరూ భావించారు.
పేరును ప్రకటించడం కాదు కదా షరీఫ్ కనీసం ఎవరితోనూ ఈ విషయంపై షరీఫ్ అధికారికంగా చర్చించ లేదు. దీనిపై స్పందించిన ఫరూఖీ తన సన్నిహితులైన పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్, హోంశాఖ మంత్రి చౌదరి నిసార్ లతో ఈ విషయంపై షరీఫ్ చర్చించారని కుండబద్దలు కొట్టారు. నవంబర్ 29న ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ తో పాటు చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీజేసీఎస్సీ)లో కూడా ఓ ఖాళీ ఏర్పడనుంది. దీంతో ఆ రెండు పోస్టులను భర్తీ చేసేందుకు షరీఫ్ ఆరుగురు సీనియర్ అధికారులను పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
చట్ట ప్రకారం ఆర్మీ చీఫ్ ను నియమించే సర్వధికారం కేవలం దేశ ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. ఇకపోతే సీజేసీఎస్సీలోని పోస్టును భర్తీ చేసేందుకు ప్రధానమంత్రి రక్షణ శాఖ సలహాను కోరవచ్చు.
1. లెఫ్టెనెంట్ జనరల్ జుబెర్ హయత్
ఈయన ప్రస్తుతం జనరల్ స్టాఫ్(సీజీఎస్) కు చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో పనిచేసిన అనుభవం హయత్ కు ఉంది. దీంతో ఈయన్ను సీజేసీఎస్సీ ఎంపిక చేసే అవకాశాలు పుష్కలం.
2.కార్ప్స్ కమాండర్ లెఫ్టెనెంట్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ అహ్మద్
ఈయన కూడా సీజీఎస్ కు చీఫ్ గా పనిచేశారు. నదీమ్ అహ్మద్ కు రహీల్ షరీఫ్ వద్ద మంచి పేరుంది. నవాజ్ షరీఫ్, రహీల్ ల మధ్య మంచి అనుబంధం లేకపోవడం వల్ల ఈయనకు ఆర్మీ చీఫ్ పదవి అవకాశాలు దక్కడం కష్టమే.
3. 31 కార్ప్స్ కమాండర్ లెప్టెనెంట్ జనరల్ జావేద్ ఇక్బాల్ రామ్ దే
షరీఫ్ పరిశీలిస్తున్న పేర్లలో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందుకు ఈయన కుటుంబ నేపథ్యమే కారణం. జావేద్ ను ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేయడం ఒక రకంగా ప్రమాదకరమేనని పాక్ రాజకీయ వర్గాలు అంటున్నాయి.
4. లెఫ్టెనెంట్ జనరల్ కమర్ జావేద్ బజ్వా
ఈయన ప్రస్తుతం జీహెచ్ క్యూలో ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టుకు అంత ప్రాధాన్యం లేకపోయినా ప్రస్తుత ఆర్మీ చీఫ్ రహీల్ కూడా ఈ స్ధానం నుంచే ఆర్మీ చీఫ్ గా ఎంపికయ్యారు. నియంత్రణ రేఖ వద్ద విధులను నిర్వహించే 10 కార్ప్స్ కమాండర్ గా కూడా బజ్వా విధులు నిర్వహించారు. భారత్-పాక్ సంబంధాలను దృష్టిలో ఉంచుకుంటే బజ్వాను ఆర్మీ చీఫ్ గా చేసే అవకాశం ఉంది.
5. లెఫ్టెనెంట్ జనరల్ నజీబుల్లా ఖాన్
జాయింట్ స్టాఫ్ క్వార్టర్స్ కు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. 2017జనవరితో ఈయన పదవీ కాలం ముగియనుంది.
6. లెఫ్టెనెంట్ జనరల్ మసూక్ అహ్మద్
మిలటరీ సలహాదారుగా, యూఎన్ శాంతి శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయన పదవీకాలం ముగిసినా ప్రభుత్వం పొడిగించడంతో అందులోనే కొనసాగుతున్నారు.