‘నీట్’ ర్యాంకులు బేఖాతర్!
-సుప్రీం ఆదేశాలకు తూట్లు
-ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీలో ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యం
-ఇప్పటికే ఒక్కో ఎంబీబీఎస్ సీటు రూ. 3కోట్లకుపైనేవిక్రయం!
-తూతూమంత్రంగా కౌన్సెలింగ్?
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లను ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ప్రైవేటు మెడికల్ కాలేజీలు బేఖాతర్ చేస్తున్నాయి. ముఖ్యంగా 15 శాతం ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) సీట్లను అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీలు అంగట్లో సరుకుగా ఇప్పటికే విక్రయించుకున్నాయి! ఒక్కో సీటును రూ. 3 కోట్లకుపైగానే విక్రయించాయని సమాచారం. కాలేజీల తీరు వల్ల ‘నీట్’ స్ఫూర్తి దెబ్బతిన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నీట్ ర్యాంకుల ఆధారంగా జరగాల్సిన అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి మార్గదర్శకాలు ఉండటంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఇలాగైతే ‘నీట్’ ర్యాంకులెందుకు?
గతేడాది వరకు ఎంసెట్ ద్వారా ప్రభుత్వ మెడికల్ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేసేవారు. ప్రైవేటులో మిగిలిన 50 శాతం సీట్లలో 35 శాతం యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్లకు ప్రైవేటు కాలేజీలు సొంతంగా పరీక్ష, కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టేవి. మిగిలిన 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను ర్యాంకులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా విక్రయించుకునేవి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలనే సుప్రీంకోర్టు ‘నీట్’ను తప్పనిసరి చేసింది. బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ సీట్లను తప్పనిసరిగా నీట్ ర్యాంకుల ద్వారానే కేటాయించాలని ఆదేశించింది. కానీ అందుకు విరుద్ధంగా ప్రైవేటు యాజమాన్యాలు ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు కాలేజీలవారీగా నోటిఫికేషన్ జారీచేసి కౌన్సెలింగ్ నిర్వహించుకొని ఇష్టారీతిన సీట్లను భర్తీ చేసుకునేలా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లన్నింటికీ కలిపి ఒకే కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించ రని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ సీట్లకు ఒక్కో కాలేజీ ఒక్కో నోటిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించుకుంటే పారదర్శకత ఏముంటుందని...అలాంటప్పుడు ‘నీట్’ ర్యాంకులు ఎందుకంటున్నారు.
540 ఎన్‌ఆర్‌ఐ సీట్లు హాంఫట్...
రాష్ట్రంలో మొత్తం 22 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిల్లో 3,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050 సీట్లు, 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 సీట్లు, మూడు మైనారిటీ కాలేజీల్లో 450 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లతోపాటు 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం 2,100 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం (1,050) సీట్లను, మైనారిటీ కాలేజీల్లోని 60 శాతం కన్వీనర్ కోటాకు చెందిన 270 సీట్లనూ ఈ ఏడాదికి ఎంసెట్-3 ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉండగా ‘నీట్’ ర్యాంకుల ద్వారా మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీల్లోని మొత్తం 1,230 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. అయితే ఆయా కాలేజీల్లో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రకారం 540 సీట్లను యాజమాన్యాలు ఇప్పటికే ఇష్టారాజ్యంగా విక్రయించుకున్నాయన్న విమర్శలున్నాయి.
బీ కేటగిరీకి ఏడాదికి పెంచే రూ. 11 లక్షల్లో ఐదు రెట్లు అంటే రూ. 55 లక్షల వరకు ఎన్‌ఆర్‌ఐ సీట్ల ఫీజు పెంచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించడం తెలిసిందే. ఆ ప్రకారం ఐదున్నరేళ్లకు రూ. 3 కోట్లకుపైగా పెంచనున్నారు. ఇప్పటికే తమకు ఇష్టమైన వారికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అంతకుమించి ఫీజుతో విక్రయించుకున్నారని తేలింది. కొన్నిచోట్ల డిమాండ్‌ను బట్టి రూ. 3.5 కోట్లకు పైగానే విక్రయించుకున్నాయని తెలిసింది. ఆ ప్రకారం కనీసం రూ. 1,600 కోట్లకు ఆ సీట్లనన్నింటినీ విక్రయించినట్లు చర్చ జరుగుతోంది. అయితే సాంకేతికంగా ఆ సీట్లకు తూతూమంత్రంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది.