‘ప్రైవేటు’ విశృంఖలతకు సుప్రీం కళ్లెం
సందర్భం
ప్రైవేటు విద్యాసంస్థల ప్రవేశాలు, ఫీజులు వారి ఇష్టానుసారమే అనడాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మెరిట్ మాత్రమే ఉన్నత ప్రామాణికమని, నీట్ ప్రైవేటు సంస్థల ప్రాథమిక హక్కులకు భంగకరం కాదని, అది రాజ్యాంగ బద్ధమని స్పష్టీకరించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తాయని ఆశిద్దాం.
జాతి ఔన్నత్యానికి వెన్నె ముక విద్యే. కానీ దాన్ని ఒక వ్యాపారంగా మార్చడంలో ప్రభుత్వాలు, న్యాయస్థా నాలు, మరీ ముఖ్యంగా విద్యా సంస్థలు తమ వంతు పాత్రను పోషించాయి. మొత్తం విద్యా వ్యవస్థ దారుణంగా దిగజారి పోయింది. సుప్రీంకోర్టు ఇటీ వల వెలువరించిన ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) తీర్పు నేపథ్యంలో ఒకసారి ఈ పరిస్థితిని పరికిద్దాం. ఒకప్పుడు కేపటేషన్ ఫీజు వసూలు చేయడం తీవ్ర నేరం. మన రాష్ట్రంలో దీన్ని అరికట్టడానికి ఒక చట్టం ఉంది. కోర్టు తీర్పుల ఫలితంగా అది నిర్వీర్యం అయింది. ఆ చట్టం ప్రకారం, ఒకప్పుడు వైద్య, ఇంజ నీరింగ్ ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ ఉండేది. అందరికీ ర్యాంకులు ఇచ్చేవారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్నిటిలోనూ ప్రవేశాలకు ఆ ర్యాంకులే ప్రాతిపదిక. కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా ఉండేవి. సీట్ల కేటాయింపును కన్వీనరే నిర్వహించే వారు, ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించేది. ఇది చాలా కాలం బాగానే పనిచేసింది. ఉన్నిక్రిష్ణన్ (1993) కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధానం దేశవ్యాపితంగా అమలయ్యేలా చేసింది.
అప్పటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్ని క్రిష్ణన్ కేసును తిరగ తోడటానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. వివిధ కేసుల్లో వివిధ హైకోర్టులు రకరకాలుగా తీర్పులు చెప్పాయి. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తే, మరికొన్ని పై తీర్పుని సమ ర్థించాయి. ఫీజుల వసూళ్ళలో వైవిధ్యం వల్ల మేనేజ్ మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు, కన్వీనర్ కోటా విద్యార్థుల ఫీజును భరించాల్సి వస్తుందనేది యాజమా న్యాల ముఖ్య వాదన. కానీ, కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థులు మెరిట్ ప్రాతిపదికన సీట్లు పొందేవారు. వారి ఫీజు ప్రభుత్వ కాలేజీల ఫీజులతో సమానంగా ఉండేది. మేనేజ్‌మెంట్ కోటాలో చేరే వారు అటువంటి మెరిట్ లేనివారు, వారు ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి వచ్చేది. దీన్నే అసంబద్ధమనేవారు!
2002 బీఎంఏ పాయ్ కేసులో సుప్రీం కోర్టు ఎట్టకేలకు ఈ వాదనకు ఆమోద ముద్ర వేసింది, ఉన్ని క్రిష్ణన్ కేసు ఈ మేరకు రాజ్యాంగబద్ధం కాదని తీర్పు నిచ్చింది. ఇస్లామిక్ అకాడమీ (బాంబే మోడరన్ స్కూల్ 2004), పీఏ ఇనాందార్ (2005) కేసులలో సుప్రీం కోర్టు ప్రేవేటు విద్యాసంస్థల యాజమాన్యాల వాదనను సమ ర్థించాయే తప్ప, అసలు సమస్య వైపు చూడలేదు. మెరిట్ ఉండాలంటూనే, అందుకు త గిన ప్రాతిపదికను రూపొందించలేదు. ఇది మొత్తం విద్యారంగం రూపునే మార్చివేసింది. ప్రైవేటు కాలేజీల వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం ఉండరాదనడంతో ప్రవేశ పరీక్షలు, అధ్యాపకుల నియామకాలు ప్రైవేటు కాలేజీలే నిర్వహిం చుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ నియంత్రణ తగ్గిపోయి, విద్యాపరమైన వ్యవ హారాలకే పరిమితమైంది. ప్రైవేటు రంగంలో దిగజారిన ప్రమాణాలు, సరైన విద్యా వసతుల లేమి, అంతులేని ఫీజులు కలసి ‘మెరిట్’ను పాతర వేశాయి. ప్రభుత్వాలు నిర్లిప్తంగా విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశాయి.
ఏమైతేనేం విద్యారంగం తీవ్రంగా దెబ్బతింది. మెరిట్‌కు విలువ లేకుండా పోయింది. ఫీజులు మెరిట్ ఉన్నవాళ్లకు అందుబాటులో లేకుండా పోయాయి. ముఖ్యంగా వైద్య విద్య వెల కోట్లకు చేరింది. మెరిట్ ఉన్న వాళ్లను బయట ఉంచి, లేనివాళ్లకు తలుపులు తెరిచారు. దీన్ని ఏదో మేరకు నియంత్రించాలనే 2007లో కేంద్రం నీట్‌ను ముందుకు తెచ్చింది. దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సంక ల్పించింది. దీంతో ప్రైవేటు సంస్థలు నీట్ ప్రవేశ పరీక్ష తమకు వర్తించదని, ఇది గత సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవ డమని, రాజ్యాంగబద్ధం కాదని దీన్ని సవాలు చేశాయి. వివిధ హైకోర్టుల్లోని అన్ని కేసులను తమవద్దకే బదిలీ చేయించుకుని సుప్రీంకోర్టు అన్నిటినీ కలిపి విచారించి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కేసులో 18.7.2013న తీర్పును వెల్లడించింది. నీట్ ప్రైవేట్ కాలేజీలకు వర్తించ దని, అది వారి హక్కులలో జోక్యం చేసుకోవడమేనని తీర్పునిచ్చింది. నీట్, వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలను రద్దు చేయజాలదని మెజారిటీ తీర్పు చెప్పింది. ఈ తీర్పునే ఇటీవల సుప్రీం కోర్టు (11.4.2016)న వెనక్కు తీసుకొని, రాజ్యాంగ ధర్మాసనం ముందు పునర్విచారణకు ఆదేశించింది.
రాజ్యాంగ ధర్మాసనం 2.5.2016న తన తీర్పును వెల్లడించింది. ప్రైవేటు విద్యాసంస్థల కళాశాలల ప్రవే శాలు, ఫీజులు వారి ఇష్టానుసారమే అనడాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వాదన ఇంతకు ముందటి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని తేల్చింది. మెరిట్ మాత్రమే ఉన్నత ప్రామాణికమని, దీన్ని ఎట్టి పరిస్థితులలో దిగజార్చేది లేదని స్పష్టం చేసింది. అదే విధంగా కేపిటేషన్ ఫీజు విపరీతంగా వసూలు చేయ టాన్ని సమర్థించబోమని చెప్పింది. నీట్ ప్రవేశ పరీక్ష చట్టం, నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం కాదని, ప్రైవేటు సంస్థల ప్రాథమిక హక్కులను భంగపరచడం లేదని తేల్చింది. నీట్ రాజ్యాంగబద్ధమని స్పష్టీకరించింది. ఫీజు లను నియంత్రించవచ్చునని చెప్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. సుమారు దశాబ్దం పైగా కొనసాగిన అనిశ్చిత పరిస్థితికి ఈ తీర్పు తెరదించింది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు, వాటి నిర్వహణ రంగాలు పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తారని ఆశిద్దాం. అదే విధంగా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా బాధ్యతగా ఉంటాయని ఆశించవచ్చునా?
- ఎ. సత్యప్రసాద్
వ్యాసకర్త మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్
ఈమెయిల్ : asphyd@icloud.com