
ఉగ్రవాదాన్ని ఎలా నిర్మూలిద్దాం?
ఉగ్రవాద నిర్మూలనపై చోగమ్ కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ సహా 53 దేశాలతో కూడిన కామన్వెల్త్
చోగమ్ సదస్సులో మంతనాలు
వాలెట్టా(మాల్టా): ఉగ్రవాద నిర్మూలనపై చోగమ్ కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ సహా 53 దేశాలతో కూడిన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు(చోగమ్) శుక్రవారం మాల్టా రాజధాని వాలెట్టాలో ప్రారంభమైంది. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, త్వరలో పారిస్‌లో జరిగే వాతావరణ సదస్సులో ఒప్పందం ఖరారుకు ఎదురవుతున్న అడ్డంకుల తొలగింపుపై మంతనాలు జరిపారు. మూడు రోజులు సాగే ఈ సదస్సును బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ప్రారంభించారు. అడవుల సంరక్షణ, ఇతర రంగాల్లో కామెన్వెల్త్ దేశాల విజయాలను వివరించారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదం ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుసవాలని అన్నారు. చోగమ్ దేశాల్లో ఉగ్రవాద నిరోధానికి 50 లక్షల పౌండ్లతో(రూ. 50కోట్లు) నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఉగ్రవాద నిర్మూలనే కామన్వెల్త్ దేశాలకు అత్యంత ప్రాధాన్య అంశంగా ఉండాలని మాల్టా ప్రధాని జోసఫ్ మస్కట్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొంటున్నారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్ తదితరులు ప్రసంగిస్తారు. రెండేళ్లకోసారి జరిగే చోగమ్ సదస్సును ఈ సారి ‘యాడింగ్ గ్లోబల్ వాల్యూ’ అనే అంశంపై నిర్వహిస్తున్నారు. సదస్సుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, చోగమ్ ప్రధాన కార్యదర్శిగా తొలిసారి ఒక మహిళ ఎన్నికైంది. బ్రిటన్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ప్యాట్రీసియా స్కాంట్లాండ్‌ను ఈ పదవికి ఎన్నుకున్నారు. భారత్‌కు చెందిన కమలేశ్ శర్మ నుంచి 2016 ఏప్రిల్‌లో ఆమె ఈ బాధ్యతలు అందుకుంటారు. ఇదిలా ఉండగా, పారిస్ వాతావరణ సదస్సుకు సంబంధించి చోగమ్‌లో తీసుకునే నిర్ణయం వాస్తవాలకు అద్దం పట్టేలా ఉండాలని భారత్ వాదించింది.