యుద్ధం పరిష్కారం కాదు!
♦ భారత్ ఓపికగా, నియంత్రణతో ముందుకెళ్తోంది
♦ ఉగ్రవాదం వీడితేనే పాక్‌తో చర్చలు
♦ చైనాతో ఉద్రిక్తతలపై సుష్మాస్వరాజ్..
న్యూఢిల్లీ: చైనాతో నెలకొన్న సరిహద్దు సమస్యకు చర్చలే ఏకైక పరిష్కార మార్గమని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం పార్లమెంటులో వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారంలో భారత్ చాలా ఓపికగా వ్యవహరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. డోక్లామ్ సరిహద్దు సమస్యతోపాటుగా ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై ఐరాస ఆంక్షల విషయాల్లోనూ చైనాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని సుష్మ తెలిపారు.
భారత విదేశాంగ విధానం, వ్యూహాత్మక భాగస్వాములతో వ్యవహరిస్తున్న విధానం అనే అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ‘ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు ఓపిక, నియంత్రణ కీలకం. అందుకే మనం ఓపికగా ఉంటూ మాటల్లో నియంత్రణ పాటిస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. డోక్లాం వివాదంపై నెలరోజులుగా అనుసరించిన తీరును మంత్రి సభకు వివరించారు. ‘ప్రతి సమస్యకు యుద్ధమే పరిష్కారం కాదు. అందుకే నేర్పుతో దౌత్యపరంగా సమస్య పరిష్కారం కావాలి’ అని సుష్మ వెల్లడించారు.
ఉగ్రవాదం వీడితేనే..
ఉగ్రవాదానికి ముగింపు పలికినపుడే పాకిస్తాన్‌తో చర్చలు ప్రారంభమవుతాయని కూడా సుష్మ స్పష్టం చేశారు. ‘ఒకవైపు నుంచే చర్చలు జరగాలని కోరుకోవటం సరికాదు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవు. వారు (పాక్) ఉగ్రవాదానికి సాయం చేయటం ఆపినపుడే.. మనం చర్చలు ప్రారంభిస్తాం’ అని స్పష్టం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా సార్క్‌దేశాధినేతలను ఆహ్వానించిన విషయాన్ని సుష్మ గుర్తుచేశారు. పాక్ సహా పొరుగుదేశాలన్నింటితో సత్సంబంధాల కోసమే తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
కాగా, చైనాతో సరిహద్దుపై వివాదం జరుగుతుంటే రాహుల్‌గాంధీ చైనా దౌత్యవేత్తతో సమావేశమవటంపై సుష్మ మండిపడ్డారు. ‘ముందుగా మీరు (కాంగ్రెస్) మన ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకున్నాక చైనా అధికారిని కలవాల్సింది’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఓబీఓఆర్‌పై కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.
‘చిట్‌ఫండ్’లపై చట్టం సిద్ధమవుతోంది: జైట్లీ
చిట్‌ఫండ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రజలను కాపాడేందుకు తీసుకొస్తున్న చట్టం ముసాయిదా సిద్ధమవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. లోక్‌సభలో బ్యాంకింగ్ నియంత్రణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ప్రమాదపుటంచున 100 వంతెనలు: గడ్కారీ
దేశంలోని వివిధ ప్రాంతాల్లో 100కుపైగా వంతెనలు ప్రమాదపుటంచున ఉన్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. వీటిపై అత్యవసరంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో మంత్రి వెల్లడించారు. వీటి భద్రతను పెంచేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారన్నారు. ‘దేశంలోని మొత్తం లక్షా60వేల వంతెనల భద్రతాప్రమాణాలను అధికారులు తనిఖీ చేశారు. అందులో 100 పైగా వంతెనలు బలహీన స్థితిలో ఉన్నాయి. అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు’ అని చెప్పా రు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలో రూ. 7.5 కోట్ల స్కాంపై విచారణ జరుపుతామన్నారు.