నెలరోజుల్లో మార్కెట్లోకి ‘స్టైల్’ | Neptune engines to power Ashok Leyland’s new truck | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో మార్కెట్లోకి ‘స్టైల్’

Published Sat, Sep 7 2013 2:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

నెలరోజుల్లో మార్కెట్లోకి ‘స్టైల్’

నెలరోజుల్లో మార్కెట్లోకి ‘స్టైల్’

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మా బలం. 50కిపైగా దేశాల్లో సేవలందిస్తున్నాం. సంపన్న దేశాల్లో అందుబాటులో ఉన్న హైబ్రిడ్, ఎలక్ట్రిక్ బస్సులను భారత్‌లో పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె దాసరి అన్నారు. మల్టీ యాక్సిల్ ట్రక్ 3120 ఛాసిస్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాహన రంగం మందగమనంలో ఉందన్నారు.  ‘సియాం’ కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన వినోద్ ఇంకా ఏమన్నారంటే..
 
 ఈ సమయంలోనే..
 దేశంలో వాహన రంగం మందగమనంలో ఉంది. ప్రతి నాలుగేళ్లకోసారి ఇది సహజం. అయితే ఈసారి మందగమనం ఎక్కువ రోజులు కొనసాగుతోంది. వాణిజ్య వాహనాల అమ్మకాల వృద్ధి తిరోగమనంలో ఉంది. ఇంధన ధరలు రోజురోజుకూ దూసుకెళ్తున్నాయి. వాణిజ్య వాహన యజమానులకు లాభాలు గగనమే. అందుకే ఎక్కువ మైలేజీ, మన్నిక, సమర్థవంతంగా పనిచేసే వాహనాలు మార్కెట్లోకి తేవడానికి ఇదే మంచి తరుణం. రూ.500 కోట్లు వ్యయం చేసి ఐదేళ్లు శ్రమించి నెప్ట్యూన్ ఇంజిన్‌కు రూపకల్పన చేశాం. 3120 ట్రక్‌లో ఈ ఇంజన్‌ను పొందుపరిచాం. మార్కెట్లో ఉన్న ట్రక్‌లతో పోలిస్తే 10% ఎక్కువ మైలేజీ ఇస్తుంది. కొద్ది రోజుల్లో బస్సుల్లో కూడా ఈ ఇంజిన్‌ను ప్రవేశపెడతాం. కంపెనీ రుణ  భారాన్ని రూ.6 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు చేరుస్తాం.   పెద్దగా ప్రభావం చూపని ఆస్తులను విక్రయిస్తాం.
 
 కొత్తవి వస్తూనే ఉంటాయి..
 అశోక్ లేలాండ్ నుంచి నెలకొక కొత్త మోడల్ తీసుకొస్తున్నాం. మల్టీ పర్పస్ కమర్షియల్ వెహికిల్ స్టైల్ వచ్చే నెలలో మార్కెట్లోకి రానుంది. ప్రయాణికుల రవాణా విభాగంలో కంపెనీ నుంచి ఇదే తొలి చిన్న వాహనం. స్టైల్‌లో ఎనిమిది మంది హాయిగా కూర్చునే వీలుంది. ఇన్నోవా, టవేరాలకు పోటీనిస్తుంది. ధర ఇంకా నిర్ణయించాల్సి ఉంది. 8 నుంచి 15 టన్నుల విభాగంలో బాస్ పేరుతో పలు ట్రక్కులను ఈ నెల నుంచే విడుదల చేస్తున్నాం. ప్రయాణికుల కోసం తేలికపాటి రవాణా వాహనం దోస్త్ ఎక్స్‌ప్రెస్ అక్టోబరులో రానుంది. అలాగే 5, 6 టన్నుల కమర్షియల్ ట్రక్ దోస్త్ పార్ట్‌నర్ విడుదల కానుంది. పార్ట్‌నర్ బస్ వేరియంట్‌ను కూడా తయారు చేస్తాం.  
 
 జనం బస్సు ‘జన్‌బస్’..
 ముందువైపు ఇంజిన్ ఉండి, తక్కువ ఎత్తున్న (సెమీ లో ఫ్లోర్) బస్‌లను ఎనిమిదేళ్ల క్రితమే ముంబై రోడ్డు రవాణా సంస్థ కోసం భారత్‌లో తొలిసారిగా అశోక్ లేలాండ్ రూపొందించింది. అదే జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెనివల్ మిషన్‌లో (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) ప్రామాణికమైంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం రెండో దశలో జన్‌బస్‌ను ప్రవేశపెడతాం. ప్రయాణికులు మూడు నాలుగు మెట్లు ఎక్కే అవసరమే లేదు. ఒక్క అడుగు చాలు. బస్ ద్వారం రోడ్డు నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఎవరైనా సులువుగా ఎక్కొచ్చు. డ్రైవర్ మీట నొక్కితే చాలు ప్రయాణికుల సౌకర్యార్థం బస్ 5-8 సెంటీమీటర్లు ఒకవైపుకు వంగుతుంది. ముందు ఇంజిన్‌తో ఉండి తక్కువ ఎత్తులో ఉన్న బస్సు ప్రపంచంలో ఇదే మొదటిది. 18 పేటెంట్లు జన్‌బస్ సొంతం. థాయ్‌లాండ్‌లో కొద్ది రోజుల్లో ప్రవేశపెడతాం.
 
 బస్సుల వ్యాపారం బాగుంది..: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లోనూ కంపెనీ నిలబడుతుంది. మొత్తం అమ్మకాల్లో వాణిజ్య వాహనాల వాటా 50 శాతమే. బస్సులు, ఇంజిన్లు, విడిభాగాల వ్యాపారం బాగుంది. ఎగుమతులూ కలిసొచ్చాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తొలి దశలో 50% అంటే 5,500 బస్సులు సరఫరా చేశాం. రెండో దశలో 10 వేల బస్సులకు ప్రభుత్వం టెండర్లు అక్టోబరులో పిలిచే అవకాశం ఉంది. బస్సుల సరఫరా డిసెంబరు నుంచి ఉంటుంది. మిషన్‌లో భాగంగా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రపంచం లో ఇటువంటి బస్సులను పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్న కంపెనీల్లో అశోక్ లేలాండ్‌ది అగ్రస్థానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement