కొనుగోలు ఆలోచన విరమించుకున్న ఆర్టీసీ?
గత బీఆర్‌ఎస్ హయాంలో కేటీఆర్ సూచన మేరకు వాటిని తిరిగి ప్రవేశపెట్టాలని యోచన
ఇప్పుడు ప్రభుత్వం మారటంతో నిర్ణయం మార్చుకున్న ఆర్టీసీ
గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని వదిలించుకున్న సంస్థ
మళ్లీ ప్రారంభిస్తే నష్టాలని అంచనా
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్‌లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది.
అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు
నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.
దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది.
సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్‌చెరు, అమీర్‌పేట మీదుగా కోటి–పటాన్‌చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది.
సర్కారు మార్పుతో మారిన సీన్
అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది.
ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది.
ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా..
ప్రస్తుతం నగరంలో హెచ్‌ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్‌ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment