ఐసిస్ సానుభూతిపరులకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్ : అయిదుగురు ఐసిస్ సానుభూతిపరులను గురువారం ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అతని సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ యాఖస్ ఇర్ఫాన్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
మరోవైపు విచారణ నిమిత్తం వీరిని తమ కస్టడీ కోరుతూ ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణకు రానుంది. కాగా నిన్న ఎన్ఐఏ అధికారులు 11మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విచారణ అనంతరం వారిలో ఆరుగురిని ప్రశ్నించి వదిలివేశారు. మరోవైపు నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఎన్ఐఏ విచారణలో బాంబులతో పోలీస్ స్టేషన్లను పేల్చివేసేందుకు కుట్ర పన్నినట్లు ఐసిస్ సానుభూతిపరులు వెల్లడించినట్లు సమాచారం. దాడులకు మొత్తం అయిదుగురిని వాడుకోవాలని చూసినట్లు తెలుస్తోంది. పాతబస్తీతో పాటు సికింద్రాబాద్లోని ప్రముఖ దేవాలయాలే వీరు టార్గెట్ చేసుకున్నట్లు వెల్లడి అయింది.
కాగా ఐసిస్ సానుభూతిపరులు పెద్దఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్టు ఎన్‌ఐఎ విచారణలో తేలింది. వీరికి విదేశాల నుంచి హవాలా డబ్బులు అందినట్టు గుర్తించారు. క్రూడ్ బాంబులు తయారు చేయడంలో వీరి నిపుణులని ఎన్‌ఐఎ అధికారులు అంటున్నారు. కొద్ది రోజుల్లోనే పేలుళ్లకు పక్కా స్కెచ్ వేసినట్టు ఆధారాలు గుర్తించారు. హైదరాబాద్, బెంగళూరు టార్గెట్‌లుగా మూడు టీమ్‌లు ఏర్పాటు చేశారనీ.. విధ్వంసాలకు పాల్పడేందుకు ప్రాణాళిక వేశారని ఎన్‌ఐఎ అధికారులు చెబుతున్నారు.