ISIS supporters
-
ఐసిస్ సానుభూతిపరుడికి ముగిసిన కస్టడీ
హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరుడు అతావుల్ రెహమాన్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హజరుపర్చగా.. ఈ నెల 26 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం రెహమాన్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే కస్టడీ ముగిసిన మరో ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. -
మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
-
మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
హైదరాబాద్: కస్టడీ ముగియటంతో ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ఏ1గా ఉన్న యజ్దానీ, ఏ2 హబీబ్ అహ్మద్‌ను ఎన్ఐఏ మరో ఎనిమిది రోజుల పాటు కస్టడీ కోరింది. దీంతో మరో ముగ్గురికి న్యాయస్థానం ఈ నెల 26వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటీవల పాతబస్తీలో అరెస్ట్ చేసిన ఐదుగురిని ఎన్ఐఏ అధికారులు 12 రోజులపాటు విచారణ జరిపి కస్టడీ ముగియటంతో ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. వారి వద్ద నుంచి ఎన్ఐఏ కీలక విషయాలను రాబట్టింది. కాగా నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు మరో ఇద్దరు సానుభూతిపరులు యాసిర్ నియమతుల్లా, అత్తావుల్ రెహ్మాన్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయిదుగురు సానుభూతిపరుల అరెస్ట్ తో వీరిద్దరూ భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకూ ఎన్ఐఏ అధికారులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. కాగా హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి విడుదల చేసింది. -
'హైదరాబాద్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని కోరా'
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డితో కలిసి హోంమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై వారు రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ వ్యాఖ్యలతో పోలీసుల స్థైర్యం దెబ్బతింటుందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా అనర్హుడంటూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు చనిపోతే శవయాత్రలో పాల్గొంటున్నారని, వారికి ఆర్థిక సాయం, న్యాయ సహాయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తామని రాజ్‌నాథ్ చెప్పారన్నారు. ఇక టీఆర్ఎస్ కూడా ఉగ్రవాదులపై నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు. త్వరలో సేవ్ హైదరాబాద్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన ఐఎస్ ఐఎస్ సానుభూతిపరులకు అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
మీడియాకు అదొక్కటే కనిపించిందా?
హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే, ఈ వివాదంపై స్పందించిన ఆయన మీడియాపై మండిపడ్డారు. తాను 90 నిమిషాల ప్రసంగిస్తే.. అందులో 20 నిమిషాలపాటు ఐసిస్‌ను తీవ్రస్థాయిలో విమర్శించానని, ఆ అంశాన్ని పక్కనపెట్టి అనవసర విషయాలపై దృష్టి పెట్టడం దారుణమని అసదుద్దీన్ విరుచుకుపడ్డారు. ఐసిస్‌కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే అమాయకులకు అన్యాయం జరగకూడదనేదే తమ వాదన అన్నారు. మన ప్రజాస్వామ్య పాలనలో అవసరమైతే కోర్టులే నిందితులకు న్యాయ సహాయం అందిస్తాయని అసద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐసిస్ సానుభూతిపరుల కేసులో సత్యాసత్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ఎన్ఐఏదేనని ఆయన స్పష్టం చేశారు. పనిలో పనిగా అసదుద్దీన్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని హిందు రాష్ట్రంగా మార్చేందుకు యత్నిస్తోందని, ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేసేందుకు చూస్తోందని ఆరోపించారు. -
30 రోజులు కస్టడీ కోరిన ఎన్ఐఏ
హైదరాబాద్ : ఐసిస్ సానుభూతిపరుల కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. 30 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా కస్టడీపై అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని, నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి నిన్న విడుదల చేశారు. అరెస్టు చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ లను ఎన్ఐఏ అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూలై 14 వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం ఆ ఐదుగురినీ తమ కస్టడీకి అనుమతించాలని కోర్టులో ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతోంది. -
ఐసిస్ సానుభూతిపరులకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్ : అయిదుగురు ఐసిస్ సానుభూతిపరులను గురువారం ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అతని సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ యాఖస్ ఇర్ఫాన్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు విచారణ నిమిత్తం వీరిని తమ కస్టడీ కోరుతూ ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణకు రానుంది. కాగా నిన్న ఎన్ఐఏ అధికారులు 11మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విచారణ అనంతరం వారిలో ఆరుగురిని ప్రశ్నించి వదిలివేశారు. మరోవైపు నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ విచారణలో బాంబులతో పోలీస్ స్టేషన్లను పేల్చివేసేందుకు కుట్ర పన్నినట్లు ఐసిస్ సానుభూతిపరులు వెల్లడించినట్లు సమాచారం. దాడులకు మొత్తం అయిదుగురిని వాడుకోవాలని చూసినట్లు తెలుస్తోంది. పాతబస్తీతో పాటు సికింద్రాబాద్‌లోని ప్రముఖ దేవాలయాలే వీరు టార్గెట్ చేసుకున్నట్లు వెల్లడి అయింది. కాగా ఐసిస్ సానుభూతిపరులు పెద్దఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్టు ఎన్ఐఎ విచారణలో తేలింది. వీరికి విదేశాల నుంచి హవాలా డబ్బులు అందినట్టు గుర్తించారు. క్రూడ్ బాంబులు తయారు చేయడంలో వీరి నిపుణులని ఎన్ఐఎ అధికారులు అంటున్నారు. కొద్ది రోజుల్లోనే పేలుళ్లకు పక్కా స్కెచ్ వేసినట్టు ఆధారాలు గుర్తించారు. హైదరాబాద్, బెంగళూరు టార్గెట్లుగా మూడు టీమ్‌లు ఏర్పాటు చేశారనీ.. విధ్వంసాలకు పాల్పడేందుకు ప్రాణాళిక వేశారని ఎన్ఐఎ అధికారులు చెబుతున్నారు.