'హైదరాబాద్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని కోరా'
న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఉన్న పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డితో కలిసి హోంమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై వారు రాజ్నాథ్కు ఫిర్యాదు చేశారు.
అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ వ్యాఖ్యలతో పోలీసుల స్థైర్యం దెబ్బతింటుందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా అనర్హుడంటూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు చనిపోతే శవయాత్రలో పాల్గొంటున్నారని, వారికి ఆర్థిక సాయం, న్యాయ సహాయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తామని రాజ్నాథ్ చెప్పారన్నారు.
ఇక టీఆర్ఎస్ కూడా ఉగ్రవాదులపై నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు. త్వరలో సేవ్ హైదరాబాద్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన ఐఎస్ ఐఎస్ సానుభూతిపరులకు అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.