మీడియాకు అదొక్కటే కనిపించిందా?
హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే, ఈ వివాదంపై స్పందించిన ఆయన మీడియాపై మండిపడ్డారు. తాను 90 నిమిషాల ప్రసంగిస్తే.. అందులో 20 నిమిషాలపాటు ఐసిస్‌ను తీవ్రస్థాయిలో విమర్శించానని, ఆ అంశాన్ని పక్కనపెట్టి అనవసర విషయాలపై దృష్టి పెట్టడం దారుణమని అసదుద్దీన్ విరుచుకుపడ్డారు. ఐసిస్‌కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
అయితే అమాయకులకు అన్యాయం జరగకూడదనేదే తమ వాదన అన్నారు. మన ప్రజాస్వామ్య పాలనలో అవసరమైతే కోర్టులే నిందితులకు న్యాయ సహాయం అందిస్తాయని అసద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐసిస్ సానుభూతిపరుల కేసులో సత్యాసత్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ఎన్ఐఏదేనని ఆయన స్పష్టం చేశారు. పనిలో పనిగా అసదుద్దీన్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని హిందు రాష్ట్రంగా మార్చేందుకు యత్నిస్తోందని, ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేసేందుకు చూస్తోందని ఆరోపించారు.