నీస్‌లో నరమేధం | Nice attack: truck driver named as France mourns 84 killed in Bastille Day atrocity | Sakshi
Sakshi News home page

పిచ్చిపట్టినట్లుగా జనం మీద నుంచి దూసుకెళ్లింది..

Published Sat, Jul 16 2016 2:39 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

నీస్‌లో నరమేధం

నీస్‌లో నరమేధం

- ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే రోజున దారుణం

- సంబరాలు తిలకిస్తున్న ప్రజలపై పంజా.. ట్రక్కుతో దూసుకెళ్లి బీభత్సం

- రెండు కిలోమీటర్ల పొడవునా మారణహోమం సృష్టించిన ఉగ్రవాది

- పది మంది చిన్నారులు సహా 84 మంది మృతి.. 50 మంది క్షతగాత్రులు

- ఉగ్రవాదిని కాల్చి చంపిన పోలీసులు.. ఫ్రాన్స్‌లో ఏడాదిన్నరలో మూడో ఉగ్రదాడి

 

(నీస్ నరమేధం: మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

నీస్: ఎనిమిది నెలల కిందట జరిగిన పారిస్ నరమేధం నుంచి కోలుకుంటున్న ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి మారణహోమం సృష్టించింది. చిత్రకళా రంగానికి ప్రఖ్యాతి గాంచిన నీస్ నగరంలో.. గురువారం రాత్రి 10:30 గంటలకు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే ఉత్సవాల్లో తలమునకలైన ప్రజలపైకి మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకొచ్చింది. ఆ ఉగ్రవాద ఉన్మాదానికి పది మంది చిన్నారులు సహా 84 మంది ప్రాణాలు బలయ్యాయి. మరో 50 మంది గాయాలపాలవగా వారిలోనూ చిన్నారులే అధికంగా ఉన్నారు. క్షతగాత్రుల్లో 18 మంది పరిస్థితి విషమంగా ఉందని హోం మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ తెలిపారు.

 

నీస్ నగరంలోని ఫ్రెంచ్ రివేరా రిసార్ట్‌లోని బీచ్ రోడ్డులో (ప్రొమెనేడ్ డెస్ ఆంగ్లయిస్).. బాస్టిల్ డే ఉత్సవాల్లో భాగంగా ప్రజలు బాణసంచా పేలుళ్లను తిలకిస్తుండగా ఉగ్రవాది ట్రక్కును వేగంగా నడుపుతూ వారిపైకి ఎక్కించాడు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రజలను తొక్కించుకుంటూ వెళ్లి నరమేధానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో దాదాపు 30 వేల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. మోటార్‌సైకిల్‌పై వెంబడిస్తూ ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి అదే ట్రక్కు కింద పడి చనిపోగా.. మరొక వ్యక్తి ట్రక్కు కేబిన్‌లోకి దూకి డ్రైవర్‌తో తలపడ్డాడని.. ఆ సమయంలో పోలీ సులు డ్రైవర్‌ను కాల్చిచంపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

ట్రక్కు డ్రైవర్ ట్యునీసియాలో జన్మించిన ఫ్రాన్స్ పౌరుడని, అతడి పేరు మొహమమ్మద్ లాహౌయీజ్ బోహల్లెల్‌గా గుర్తించారు. ట్రక్కులో ఉగ్రవాది గుర్తింపు పత్రాలు, తుపాకులు, భారీ ఆయుధాలను గుర్తించినట్లు అధికారులు తెలి పారు. ఇది ఉగ్రవాద దాడేనని దేశాధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలాండ్ పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్రానికి చిహ్నమైన జాతీయ దినోత్సవం నాడు ఫ్రాన్స్‌పై దాడి జరిగింది’’ అని ఆయన టీవీ ప్రత్యక్ష ప్రసారమైన ప్రసంగంలో చెప్పారు. దేశంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఉగ్రదాడులకు ఫ్రాన్స్ ఇంతగా ఎందుకు లక్ష్యంగా మారిం దన్న అంశంపై తాజా దాడితో మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. అన్ని చర్యలూ చేపట్టినట్లయితే ఈ దాడిని నిరోధించగలిగి ఉండొచ్చని ప్రతిపక్ష నేత అలైన్ జెప్ విమర్శించారు. మృతుల్లో ఇద్దరు అమెరికా పౌరులు ఉన్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ తెలిపింది. ఒక ఉక్రేనియన్ పౌరుడు, ఒక రష్యన్ మహిళ కూడా చనిపోయినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి.

 

ఏడాదిన్నరలో మూడో ఉగ్రదాడి

ఫ్రాన్స్‌కు జూలై 14వ తేదీ అంటే బాస్టిల్ డే..! ఫ్రాన్స్‌లో లౌకిక గణతంత్రానికి.. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలకు ప్రాణం పోసిన రోజది. రాచరికానికి ముగింపు పలికిన 1798 ఫ్రెంచి విప్లవానికి నాందిగా పారిస్‌లో బాస్టిల్ కోట జైలును ముట్టడించి బద్దలు కొట్టింది ఈ రోజే. ఈ చరిత్రాత్మక ఘటనను ఫ్రాన్స్ ప్రజలు ఎంతో ఘనంగా జాతీయ దినోత్సవంగా నిర్వహించుకుంటారు. నీస్ నగరంలో గురువారం రాత్రి (భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:00 గంటలకు) ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రజలపై ఉగ్రవాదం పంజా విసిరి మారణహోమం సృష్టించింది.

 

ఫ్రాన్స్‌లో గత ఏడాదిన్నర కాలంలో జరిగిన మూడో భారీ ఉగ్ర దాడి ఇది. గత ఏడాది జనవరిలో చార్లీ హెబ్డో మేగజీన్‌పై దాడి, అనంతరం నవంబర్‌లో పారిస్‌లో ఐసిస్ సృష్టించిన నరమేధంలో 130 మంది చనిపోయిన విషయం తెలిసిందే. తాజా దాడి నేపథ్యంలో ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితిని మరో మూడు నెలలు పొడిగించనున్నట్లు హోలాండ్ ప్రకటించారు. అలాగే సిరియా, ఇరాక్‌లలోని జిహాదీ ఉగ్రవాదులపై దాడినీ ఉధృతం చేస్తామన్నారు.

 

పిచ్చిపట్టినట్లుగా జనం మీద నుంచి దూసుకెళ్లింది..

‘‘పిల్లలు నీళ్లలో రాళ్లు విసురుతూ ఆడుకుంటుంటే చూస్తున్నా. అంతలో గందరగోళం చెలరేగింది. బాణసంచాలో ఏదైనా దారి తప్పిందేమో అనుకున్నా. కానీ అరక్షణంలో ఒక పెద్ద తెల్లటి ట్రక్కు పిచ్చిపట్టినట్లుగా వేగంగా జనంపై నుంచి దూసుకెళ్లింది. వీలైనంత ఎక్కువ మందిని చంపడమే లక్ష్యంగా అటూ ఇటూ తిరుగుతూ మరీ జనాన్ని తొక్కుకుంటూ పోయింది. ట్రక్కు నన్ను దాటి కొన్ని మీటర్లు ముందుకు వెళ్లాక కూడా నాకది అర్థం కాలేదు. ట్రక్కు దూసుకెళ్తుండగా దాని తాకిడికి జనాల శరీరాలు దారికి ఇరువైపులా బౌలింగ్ పిన్స్ లాగా చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. జనాల ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించాయి. వాటిని ఎన్నటికీ మరచిపోలేను. భయం తో నేను పరుగు తీసి పక్కనే ఉన్న రెస్టారెంట్‌లో దాక్కున్నా. కాసేపటికి ఏం జరిగిందో చూడటానికి బయటకు వచ్చాను. నా ఆలోచన పనిచేయటం లేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏ శబ్దమూ లేదు. ఏ సైరనూ లేదు. ఒక్క కారు కూడా లేదు. ట్రాఫిక్ సిగ్నల్ దాటి ట్రక్కు నడిచిన మార్గంలోకి వెళ్లాను. ప్రతి ఐదు మీటర్లకూ నిర్జీవ శరీరాలు.. శరీర భాగాలు.. రక్తపు మడుగుల్లో! బీచ్ అటెండెంట్లు ముందుగా అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారి కోసం మంచినీళ్లు, టవళ్లు తెచ్చి అందించారు. నేను కూడా సాయం చేయటానికి వెళ్లే వాడిని.. కానీ అప్పటికే నేను మళ్లీ చలనం లేకుండా స్తంభించిపోయాను’’ అని డామియెన్ అలెమాండ్ అనే జర్నలిస్టు వివరించారు.

 

అతడు ఒంటరిగా తిరిగేవాడు..

నీస్ నగరంలో నరమేధానికి పాల్పడిన ఉగ్రవాది ఒంటరిగా సంచరించేవాడని, అతడు మత విశ్వాసాలను కూడా పాటించినట్టు కనిపించిందని ఇరుగుపొరుగు వెల్లడించారు. ప్రజలపైకి ట్రక్కును నడిపిన డ్రైవర్ మొహమ్మద్ నివసిస్తున్న ఫ్లాట్‌లో ఫోరెన్సిక్ నిపుణులు సోదా చేశారు. అతడు ఇరుగుపొరుగుతోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని.. పలకరించినా స్పందించేవాడు కాదని చెప్పారు. అతడి మాజీ భార్యను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా అనే దిశగానూ దృష్టి సారించారు.

 

ఉగ్రవాదితో ఇద్దరు వ్యక్తుల వీరోచిత పోరాటం..

‘‘నేను బాల్కనీలో నిల్చుని ఉన్నా. ప్రజలు సంబ రాలు చేసుకోవటం చూస్తున్నా. అకస్మాత్తుగా ఒక ట్రక్కు ప్రజల గుంపు పైకి దూసుకొచ్చింది. ఆశ్చర్యకరంగా అతడు నెమ్మదిగానే నడిపాడు. అతడిని ఒక వ్యక్తి మోటారుసైకిల్‌పై వెంబడించాడు. ట్రక్కును ఓవర్‌టేక్ చేసి ముం దుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ట్రక్కు డ్రైవర్ తలుపు తీసి కేబిన్‌లోకి వెళ్లాలని కూడా ప్రయత్నించాడు. కానీ.. అతడు కిందపడిపోయి ట్రక్కు చక్రాల కింద నలిగిపోయి చనిపోయాడు. ఇద్దరు పోలీసు అధికారులు ట్రక్కుపై కాల్పులు జరపటంతో.. డ్రైవర్ ట్రక్కు వేగం పెంచి జనంపై గజి బిజిగా నడుపుతూ దూసుకెళ్లాడు. ఆ తర్వాత 20 సెకన్లకు అతడిపై తుపాకులతో కాల్పులు జరిగాయి. అతడిపై ఎవరు కాల్పులు జరిపారో నాకు తెలియదు. దీంతో జనం భయకంపితులై అన్ని దిక్కులకూ పరుగులు తీశారు. ప్రాణాలు రక్షించుకోగలిగిన వారు హోటళ్లలోకి పరుగులు తీశారు. ఆ తర్వాత నేను స్వయంగా 12 మృతదేహాలను చూశాను. ఇంకా చాలా ఉంటాయని దాంతో స్పష్టమైంది’’ అని.. ఈ దారుణాన్ని స్మార్ట్‌ఫోన్‌తో వీడియో చిత్రీకరించిన జర్మనీ పాత్రికేయుడు రిచర్డ్ గుట్జార్ (42) వివరించారు. ‘‘ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెడుతోంటే.. ఒక వ్యక్తి ట్రక్కులోకి దూకి.. దానిని నడుపుతున్న ఉగ్రవాదితో కలబడ్డాడు. అతడి వద్ద ఉన్న తుపాకీ లాక్కున్నాడు. ఈ ఘర్షణలో ట్రక్కు కొంత సేపు ఆగటంతో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకుని.. ఉగ్రవాదిని కాల్చి చంపటానికి సమయం లభించిం ది. ఈ విధంగా మారణహోమం మరింతసేపు సాగకుండా అడ్డుకునేందుకు సాధారణ పౌరుడు వీరోచితంగా సాయపడ్డాడు. లేదంటే మరింత ప్రాణనష్టం సంభవించేది’’ అని ప్రత్యక్ష సాక్షి ఎరిక్ సియోటి మీడియాకు వివరించారు.

 

తుపాకీ తీసి కాల్పులు జరిపాడు

‘‘ట్రక్కును ఆపాలని, దాని కింద చాలా మంది జనం పడ్డారని, చాలా మంది చనిపోయారని ట్రక్కు డ్రైవర్‌కు చెప్పటానికి నేను అరుస్తూ, చేతులు ఊపుతూ ఉన్నాను. కానీ బయట ఉన్న వారిని ఎవరినీ అతడు పట్టించుకోలేదు. అంతలో అతడు ఏదో వస్తువు తీయటం కనిపించింది. ప్రమాదం బారిన పడిన వారి కోసం అంబులెన్స్‌ను పిలవటానికి సెల్‌ఫోన్ తీస్తున్నాడని అనుకున్నా. కానీ.. అతడు తుపాకీ తీసి పోలీసులపై కాల్పులు జరిపాడు.. అంతకుముందే అక్కడికి వచ్చిన పోలీసులు అతడిపై కేకలు వేస్తూ ఉండగా.. అతడు తుపాకీ తీయటం చూసి వారూ కాల్పులు జరిపి అతడిని హతమార్చారు’’ అని నాదర్ ఎల్ షాఫే అనే మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

 

బాధితుల్లో భారతీయులు లేరు

న్యూఢిల్లీ: నీస్ ఉగ్ర ఘటన బాధితుల్లో భారతీయులెవరూ లేరని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘నీస్‌లోని భారతీయులతో ఫ్రాన్స్‌లో భారత దౌత్యవేత్త సంప్రదించారు. వారంతా క్షేమమని తెలిసింది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. పారిస్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంలో 33140507070 నెంబరుతో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

 

దిగ్భ్రాంతికి గురయ్యా: ప్రణబ్

ఫ్రాన్స్‌పై జరిగిన దాడితో దిగ్భ్రాంతికి గురయ్యాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫ్రెంచ్ ప్రభుత్వం, ప్రజలు ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో వారికి అండగా ఉంటాం’ అని ట్విటర్లో రాష్ట్రపతి వెల్లడించారు. క్రూరమైన ఉగ్రవాద చర్యపై స్పందించేందుకు మాటలు రావటం లేదని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుతున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.           

 

చాలా బాధాకరం: మోదీ

‘ఈ భయంకర ఘటన చాలా బాధాకరం. ఇది ఉగ్రవాదుల బుర్రలేని చర్య. ఈ దురదృష్టకర సమయంలో ఫ్రాన్స్ సోదర, సోదరీమణుల బాధను పంచుకుంటాం.. వారికి మద్దతుగా నిలబడతాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

 

కారకులను కఠినంగా శిక్షించాలి: సోనియా

‘ఫ్రాన్స్ ఘటన.. ప్రజాస్వామ్య విలువలు, శాంతిపట్ల అసహ్యంతో చేసిన చర్య. మృతుల కుటుంబాలకు నివాళులు. ఈ దాడుల వెనుక ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు అండగా ఉంటాం’ అని సోనియా ఓ ప్రకటనలో తెలిపారు.

 

ఫ్రాన్స్ త్వరగా కోలుకోవాలి

‘ఇది భయంకరమైన ఉగ్రవాద చర్య. మా పాత మిత్రుడైన ఫ్రాన్స్‌పై జరిగిన ఈ చర్యను అమెరికా ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దుర్ఘటన నుంచి ఫ్రాన్స్ కోలుకోవటంలో అమెరికా సంపూర్ణ మద్దతు అందిస్తుంది. విచారణలో ఫ్రాన్స్‌కు అమెరికా ఏజెన్సీల సాయం తప్పకుండా ఉంటుంది. ఫ్రాన్స్ త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాను’

- బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు

 

లాడెన్‌ను మట్టుబెట్టినట్టే ముందుకెళ్లాలి

‘ఇస్లాంను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న వారిపై అంతర్జాతీయ సమాజం యుద్ధం ప్రకటించాలి. వీరిపై యుద్ధం చేసి గెలిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన రీతిలో ముందుకెళ్లాలి. దీన్ని మూడో ప్రపంచయుద్ధంగా కూడా అనుకోవచ్చు. అయితే కాస్త విభిన్నంగా ఉంటుంది’

- హిల్లరీ క్లింటన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి

 

ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం

కేన్సర్ మహమ్మారి లాంటి ఉగ్రవాదాన్ని తరిమేసేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళతాం. ఇందుకోసం నాటో దళాల సాయం తీసుకుంటాం. ఉగ్రవాద మూలాలున్న దేశాలనుంచి ప్రజలను అమెరికాలో అడుగు పెట్టనీయం’

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి

 

పిరికిపందల చర్య: ఐక్యరాజ్యసమితి

నీస్ నగరంలో జాతీయ దినోత్సవ వేడుకలపై జరిగిన ఉగ్రదాడిని దుర్మార్గమైన చర్యగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రజాస్వామ్యంపై దాడి పిరికిపందల చర్య అని తెలిపింది. అటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కూడా ఉగ్రవాదం.. ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పుగా పరిణమించిందని  పేర్కొంది.

 

ఖండించిన ప్రపంచ దేశాధినేతలు

ఈ ఘటనతో షాక్‌కు గురైనట్లు రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ప్రపంచ మానవాళి ఏకమై ఉగ్రవాదంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంనాడు దాడి జరగటం.. చాలా దురదృష్టకరమని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ పేర్కొన్నారు. అటు జపాన్ కూడా ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జపాన్ భద్రతకోసం ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను మరింత బలోపేతం చేయనున్నట్లు జపాన్ కేబినెట్ సెక్రటరీ యోషిహిదే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement