నెత్తురోడిన ఫ్రాన్స్
ఉగ్రమూకలు మరోసారి ఫ్రాన్స్‌లో నెత్తురు పారించాయి. నీస్ నగరంలో ఆ దేశ జాతీయ దినోత్సవం వేడుకలను చూడటానికి వచ్చిన వేలాదిమంది పౌరులను లక్ష్యం చేసుకుని ఉగ్రవాది ఒకడు అత్యంత వేగంగా ట్రక్కు నడుపుకుంటూ పోయి పలువురు చిన్నారులతోసహా 84మందిని పొట్టనబెట్టుకున్నాడు. వందలాదిమందిని గాయపరిచాడు. వెంటనే భద్రతా బలగాలు అతన్ని కాల్చిచంపాయి.
1798 ఫ్రెంచ్ విప్లవంలో జూలై 14న జరిగిన బాస్టిల్ కోట ముట్టడి ఒక కీలకమైన ఘట్టం. రాజరికాన్ని, భూస్వామ్యాన్ని తుత్తినియలు చేసిన ఆ దాడి స్ఫూర్తికీ, విలువలకూ పునరంకితమవుతూ ఏటా ఆ రోజును ఫ్రాన్స్ తన జాతీయ దినోత్సవంగా జరుపు కుంటుంది. ఆ వేడుకల్లో భాగంగా జరిగే వివిధ విన్యాసాలను చూడటానికి వచ్చే వేలాదిమందితో అన్ని నగరాల్లాగే నీస్ నగర సముద్రతీరం కూడా కోలాహలంగా ఉంటుంది. ఫ్రాన్స్‌ను దొంగదెబ్బ తీయడానికి పొంచివున్న ఉగ్రభూతాలు దీన్ని అదునుగా తీసుకున్నాయి. ఒక్కసారిగా పంజా విసిరాయి. ఉగ్రవాదానికి రూపురేఖ లుండవు. విలువలుండవు. ఏ పేరు చెప్పుకున్నా దానికి మతం ఉండదు. మృత్యువే దాని మతమూ, అభిమతమూ. ఫ్రాన్స్‌లో గత రెండేళ్లుగా ఉగ్ర జాడలు కనిపిస్తూనే ఉన్నాయి.
నిరుడు జనవరిలో వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ కార్యా లయంపై తుపాకులతో దాడిచేసి పాత్రికేయులు, పోలీసులతోసహా 17మందిని పొట్టనబెట్టు కున్నాక ఆ ఏడాది నవంబర్‌లో పారిస్ నగరంలో మారణహోమం సృష్టించారు. వివిధచోట్ల దాడులు చేసి 130మంది ప్రాణాలు తీశారు. అదే నెలలో ఆఫ్రికా ఖండం మాలిలో ఒక హోటల్‌పై దాడిచేసి 27మందిని కాల్చిచంపగా అందులో అత్యధికులు ఫ్రెంచి పౌరులు. ఆ దాడులకు ముందూ, వెనకా యూరప్ లోని వివిధచోట్ల ఉగ్ర వాదులు దాడులు చేయకపోలేదు. కానీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో 32 మందిని హతమార్చిన ఉదంతమే పెద్దది.
అయితే దాడి జరిగిన తీరు గమనిస్తే ఈ వరస దాడులనుంచి ఫ్రాన్స్ గుణ పాఠం నేర్చుకోలేదనిపిస్తుంది. పారిస్ దాడుల తర్వాత అసాధారణ రీతిలో ఫ్రాన్స్ ఎమర్జెన్సీ విధించింది. అందుకు సంబంధించిన కఠినమైన నిబంధనలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. ఎమర్జెన్సీని ఈ నెలలో తొలగించబోతున్నట్టు ఈమధ్యే ఆ దేశం ప్రకటించింది. ఎమర్జెన్సీ పేరిట విశేషాధికారాలు దఖలు పరుచుకుని ఉగ్రవా దంపై యుద్ధం చేస్తున్నచోట మళ్లీ ముష్కరులు దాడికి ఎలా తెగించారు? రోజూ యధావిధిగా ఉండే భద్రతతోపాటు జాతీయ దినోత్సవానికి అదనపు భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. పటిష్టమైన నిఘా ఉంటుంది. పైగా ఇప్పుడు వేడు కలు జరిగిన బీచ్ ప్రాంతంలో ఎలాంటి వాహనాలనూ అనుమతించరు. తనిఖీల కోసం అక్కడ పోలీస్ బారికేడ్ కూడా ఏర్పాటుచేశారు.
అలాంటి ప్రాంతంలో ఉన్న ట్టుండి ఒక భారీ ట్రక్కు పెనువేగంతో జనంపైకి దూసుకెళ్లడాన్ని...దాన్ని నడుపు తున్న దుండగుడు కాల్పులు జరుపుకుంటూ వెళ్లడాన్ని ఎవరైనా ఊహించగలరా? అది కూడా కొద్దో గొప్పో దూరం కాదు...రెండు కిలోమీటర్ల నిడివి. ఆ దారి పొడవునా అనేకుల్ని నుజ్జు నుజ్జు చేసుకుంటూ వాహనం వెళ్తుంటే అక్కడున్న భద్రతా సిబ్బంది వెనువెంటనే నిలువరించలేకపోయారు. కాల్పులు జరిపి దుండ గుణ్ణి చంపే సమ యానికి 84మంది మృత్యువాతపడ్డారు. ఇవన్నీ ఫ్రాన్స్ అజాగ్రత్తనూ, నిఘా లోటు పాట్లనూ పట్టిచూపుతున్నాయి.
దుండగుడు గతంలో చిన్న దొంగతనం కేసులో అరెస్టుకావడం, ఆ తర్వాత దౌర్జన్యానికి దిగిన కేసులో పోలీసులు ప్రశ్నించడం మినహా అతను ఉగ్రవాదులతో ప్రభావితమైనట్టు పోలీసు రికార్డుల్లో నమోదు కాలేదని అంటున్నారు. దాడికి దిగిన ఉగ్రవాది ఒక్కడే అయినా అతనికి ఉన్మాదాన్ని నూరిపోసినవారూ, పథకరచన చేసి దాడికి పంపినవారూ ఆ గడ్డ పైనే ఉంటారు. వారిని ముందుగా గుర్తించలేకపోవడం నిఘా వైఫల్యం. కనీసం ఇప్పుడైనా మెలకువతో వ్యవహరించడం అవసరమని ఫ్రాన్స్ పాలకులు గుర్తిం చాల్సి ఉంటుంది.
ఎప్పటిలాగే నీస్ మారణహోమం తర్వాత అతివాదులు రెచ్చిపోతున్నారు. ‘ఇస్లామిక్ ఛాందసవాదం’పై పోరు చేయాలంటూ జాతీయవాద నాయకుడు లీ పెన్ డిమాండ్ చేస్తున్నారు. దాడి వెనకున్న ఉన్మాదులు కోరుకునేది కూడా ఇదే. సమాజంలో పరస్పర అనుమానాలు, ద్వేషం, అసహనం, కక్షలు రగల్చగలిగితే అలాం టిచోట మురికి కాల్వల్లో పెరిగే క్రిమికీటకాల మాదిరి శరవేగంతో వృద్ధి చెందడానికి వారికి ఆస్కారం ఉంటుంది. అలాంటి సమాజాన్ని ధ్వంసం చేయడం వారికి తేలికవుతుంది. తమ దేశాల్లో ఉగ్రవాదంపై యుద్ధం పేరిట వైమానిక దాడులు, ద్రోన్ దాడులు చేస్తున్న అమెరికా, పాశ్చాత్యదేశాలకు గుణపాఠం నేర్ప డానికి ఇంతకుమించిన వ్యూహం వారి దగ్గరలేదు.
పాశ్చాత్య దేశాల్లో ఉంటున్న ముస్లింలు తాము ఎటువైపో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమవుతున్నదని 2014 చివరిలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ చేసిన హెచ్చరికను మరువకూడదు. అలాంటి ‘తేల్చుకోవాల్సిన సమయం’ తీసుకురావడంలో భాగంగానే యూరప్ దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అక్కడి సమాజాలు ముస్లింలను అను మాన దృక్కులతో చూస్తే, ద్వేషం విస్తరిస్తే... వారిలో అభద్రతాభావం పెరగక తప్పదని ఉగ్రవాదులు అంచనా వేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడి తేనే అక్కడ పాగా వేయగలమని, ప్రతీకారం తీర్చుకోగలమని వారు భావిస్తు న్నారు. అదే జరిగితే ఇప్పటిలా కొందరు వ్యక్తుల్ని ప్రభావితం చేసి, వారితో విధ్వంసాలను సృష్టించడంకాక భారీ స్థాయిలో నష్టం కలిగించగలమనుకుంటు న్నారు. అందువల్లే జాగ్రత్తగా అడుగేయాల్సిన అవసరం ఉంటుంది. ఉగ్ర భూతాన్ని తుదముట్టించడానికి కఠినమైన చర్యలు, నిఘా అవసరం. అలాంటి చర్యలన్నీ వారిని ఏకాకుల్ని చేసేలా ఉండాలి. అంతేతప్ప సమస్య మూలాలు ఒకచోట ఉంటే దృష్టి కేంద్రీకరణ వేరేచోట ఉండకూడదు. బహుళ సంస్కృతుల మేళవింపుగా... ఉదారవాద భావాల నిలయంగా ఉంటున్న ఫ్రాన్స్ అత్యంత చాకచక్యంతో, సంయ మనంతో వ్యవహరించినప్పుడే ఉగ్రవాదులను ఓడించడం తేలికవుతుంది.