Nice Attack
-
ఆ కిరాతకుడి చివరి మెసేజ్ ఏమిటో తెలుసా?
19 టన్నుల ట్రక్కుతో పిచ్చిపట్టినట్టుగా ప్రజలపైకి దూసుకెళ్లి 84మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది మహమెద్ లావోయైజ్ బౌలెల్ కు సంబంధించి కీలకమైన వివరాలు వెలుగుచూశాయి. చిత్రకళా రంగానికి ప్రఖ్యాతి గాంచిన ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగిపోయిన ప్రజలపై గత గురువారం రాత్రి ఉగ్రవాది మహమెద్ ఈ కిరాతకానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ మారణహోమానికి కొన్ని నిమిషాల ముందు మహెమద్ తన సెల్ ఫోన్ నుంచి కొన్ని మెసెజ్ లు పంపాడు. ప్రస్తుతం పోలీసులు ఈ సందేశాల ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకుపోతున్నారు. దుర్మార్గానికి పాల్పడేందుకు కొన్ని నిమిషాల ముందు అతడు పంపిన ఓ మెసెజ్ లో 'ఇది బాగుంది. నా దగ్గర తగినంతగా పరికరాలు ఉన్నాయి' అంటూ పేర్కొన్నాడు. మరో మెసెజ్ లో 'మరిన్ని ఆయుధాలు తీసుకురండి. సీ కోసం 5 ఆయుధాలు తీసుకురండి' అని పేర్కొన్నాడు. జనంపై ట్రక్కు నడుపుతూ.. తుపాకులతో కాల్పులు జరుపుతూ భయానక బీభత్సాన్ని సృష్టించిన మహెమద్ ను వాహనంలో ఉండగానే పోలీసులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ట్రక్కులో అతడి సెల్ ఫోన్ తోపాటు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు కార్డు దొరికాయి. 'సీ' కోసం ఐదు ఆయుధాలు కావాలి అంటూ అతడు మెసెజ్ పంపించిన నేపథ్యంలో 'సీ' ఎవరు అని కనుక్కొనేందుకు ప్రస్తుతం ఫ్రాన్స్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాది మెసెజ్ లు పంపిన వ్యక్తిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. -
ఆ 84 మందిని చంపింది మేమే
పారిస్: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) శనివారం ప్రకటించింది. నీస్‌లో జనాలపైకి ట్రక్ నడిపిన డ్రైవర్ మహమద్ లహొయెజ్ బోహ్లెల్ తమ సైనికుడని పేర్కొంది. ఐఎస్ఐఎస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బాస్టిల్ డే సందర్భంగా నీస్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 84 మంది మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జనసమూహంపైకి ట్రక్ నడిపి కిరాతకచర్యకు పాల్పడ్డారు. -
నీస్‌లో నరమేధం
- ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే రోజున దారుణం - సంబరాలు తిలకిస్తున్న ప్రజలపై పంజా.. ట్రక్కుతో దూసుకెళ్లి బీభత్సం - రెండు కిలోమీటర్ల పొడవునా మారణహోమం సృష్టించిన ఉగ్రవాది - పది మంది చిన్నారులు సహా 84 మంది మృతి.. 50 మంది క్షతగాత్రులు - ఉగ్రవాదిని కాల్చి చంపిన పోలీసులు.. ఫ్రాన్స్‌లో ఏడాదిన్నరలో మూడో ఉగ్రదాడి (నీస్ నరమేధం: మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) నీస్: ఎనిమిది నెలల కిందట జరిగిన పారిస్ నరమేధం నుంచి కోలుకుంటున్న ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి మారణహోమం సృష్టించింది. చిత్రకళా రంగానికి ప్రఖ్యాతి గాంచిన నీస్ నగరంలో.. గురువారం రాత్రి 10:30 గంటలకు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే ఉత్సవాల్లో తలమునకలైన ప్రజలపైకి మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకొచ్చింది. ఆ ఉగ్రవాద ఉన్మాదానికి పది మంది చిన్నారులు సహా 84 మంది ప్రాణాలు బలయ్యాయి. మరో 50 మంది గాయాలపాలవగా వారిలోనూ చిన్నారులే అధికంగా ఉన్నారు. క్షతగాత్రుల్లో 18 మంది పరిస్థితి విషమంగా ఉందని హోం మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ తెలిపారు. నీస్ నగరంలోని ఫ్రెంచ్ రివేరా రిసార్ట్‌లోని బీచ్ రోడ్డులో (ప్రొమెనేడ్ డెస్ ఆంగ్లయిస్).. బాస్టిల్ డే ఉత్సవాల్లో భాగంగా ప్రజలు బాణసంచా పేలుళ్లను తిలకిస్తుండగా ఉగ్రవాది ట్రక్కును వేగంగా నడుపుతూ వారిపైకి ఎక్కించాడు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రజలను తొక్కించుకుంటూ వెళ్లి నరమేధానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో దాదాపు 30 వేల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. మోటార్‌సైకిల్‌పై వెంబడిస్తూ ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి అదే ట్రక్కు కింద పడి చనిపోగా.. మరొక వ్యక్తి ట్రక్కు కేబిన్‌లోకి దూకి డ్రైవర్‌తో తలపడ్డాడని.. ఆ సమయంలో పోలీ సులు డ్రైవర్‌ను కాల్చిచంపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ ట్యునీసియాలో జన్మించిన ఫ్రాన్స్ పౌరుడని, అతడి పేరు మొహమమ్మద్ లాహౌయీజ్ బోహల్లెల్గా గుర్తించారు. ట్రక్కులో ఉగ్రవాది గుర్తింపు పత్రాలు, తుపాకులు, భారీ ఆయుధాలను గుర్తించినట్లు అధికారులు తెలి పారు. ఇది ఉగ్రవాద దాడేనని దేశాధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలాండ్ పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్రానికి చిహ్నమైన జాతీయ దినోత్సవం నాడు ఫ్రాన్స్‌పై దాడి జరిగింది’’ అని ఆయన టీవీ ప్రత్యక్ష ప్రసారమైన ప్రసంగంలో చెప్పారు. దేశంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఉగ్రదాడులకు ఫ్రాన్స్ ఇంతగా ఎందుకు లక్ష్యంగా మారిం దన్న అంశంపై తాజా దాడితో మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. అన్ని చర్యలూ చేపట్టినట్లయితే ఈ దాడిని నిరోధించగలిగి ఉండొచ్చని ప్రతిపక్ష నేత అలైన్ జెప్ విమర్శించారు. మృతుల్లో ఇద్దరు అమెరికా పౌరులు ఉన్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ తెలిపింది. ఒక ఉక్రేనియన్ పౌరుడు, ఒక రష్యన్ మహిళ కూడా చనిపోయినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. ఏడాదిన్నరలో మూడో ఉగ్రదాడి ఫ్రాన్స్‌కు జూలై 14వ తేదీ అంటే బాస్టిల్ డే..! ఫ్రాన్స్‌లో లౌకిక గణతంత్రానికి.. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలకు ప్రాణం పోసిన రోజది. రాచరికానికి ముగింపు పలికిన 1798 ఫ్రెంచి విప్లవానికి నాందిగా పారిస్‌లో బాస్టిల్ కోట జైలును ముట్టడించి బద్దలు కొట్టింది ఈ రోజే. ఈ చరిత్రాత్మక ఘటనను ఫ్రాన్స్ ప్రజలు ఎంతో ఘనంగా జాతీయ దినోత్సవంగా నిర్వహించుకుంటారు. నీస్ నగరంలో గురువారం రాత్రి (భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:00 గంటలకు) ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రజలపై ఉగ్రవాదం పంజా విసిరి మారణహోమం సృష్టించింది. ఫ్రాన్స్‌లో గత ఏడాదిన్నర కాలంలో జరిగిన మూడో భారీ ఉగ్ర దాడి ఇది. గత ఏడాది జనవరిలో చార్లీ హెబ్డో మేగజీన్‌పై దాడి, అనంతరం నవంబర్‌లో పారిస్‌లో ఐసిస్ సృష్టించిన నరమేధంలో 130 మంది చనిపోయిన విషయం తెలిసిందే. తాజా దాడి నేపథ్యంలో ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితిని మరో మూడు నెలలు పొడిగించనున్నట్లు హోలాండ్ ప్రకటించారు. అలాగే సిరియా, ఇరాక్‌లలోని జిహాదీ ఉగ్రవాదులపై దాడినీ ఉధృతం చేస్తామన్నారు. పిచ్చిపట్టినట్లుగా జనం మీద నుంచి దూసుకెళ్లింది.. ‘‘పిల్లలు నీళ్లలో రాళ్లు విసురుతూ ఆడుకుంటుంటే చూస్తున్నా. అంతలో గందరగోళం చెలరేగింది. బాణసంచాలో ఏదైనా దారి తప్పిందేమో అనుకున్నా. కానీ అరక్షణంలో ఒక పెద్ద తెల్లటి ట్రక్కు పిచ్చిపట్టినట్లుగా వేగంగా జనంపై నుంచి దూసుకెళ్లింది. వీలైనంత ఎక్కువ మందిని చంపడమే లక్ష్యంగా అటూ ఇటూ తిరుగుతూ మరీ జనాన్ని తొక్కుకుంటూ పోయింది. ట్రక్కు నన్ను దాటి కొన్ని మీటర్లు ముందుకు వెళ్లాక కూడా నాకది అర్థం కాలేదు. ట్రక్కు దూసుకెళ్తుండగా దాని తాకిడికి జనాల శరీరాలు దారికి ఇరువైపులా బౌలింగ్ పిన్స్ లాగా చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. జనాల ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించాయి. వాటిని ఎన్నటికీ మరచిపోలేను. భయం తో నేను పరుగు తీసి పక్కనే ఉన్న రెస్టారెంట్లో దాక్కున్నా. కాసేపటికి ఏం జరిగిందో చూడటానికి బయటకు వచ్చాను. నా ఆలోచన పనిచేయటం లేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏ శబ్దమూ లేదు. ఏ సైరనూ లేదు. ఒక్క కారు కూడా లేదు. ట్రాఫిక్ సిగ్నల్ దాటి ట్రక్కు నడిచిన మార్గంలోకి వెళ్లాను. ప్రతి ఐదు మీటర్లకూ నిర్జీవ శరీరాలు.. శరీర భాగాలు.. రక్తపు మడుగుల్లో! బీచ్ అటెండెంట్లు ముందుగా అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారి కోసం మంచినీళ్లు, టవళ్లు తెచ్చి అందించారు. నేను కూడా సాయం చేయటానికి వెళ్లే వాడిని.. కానీ అప్పటికే నేను మళ్లీ చలనం లేకుండా స్తంభించిపోయాను’’ అని డామియెన్ అలెమాండ్ అనే జర్నలిస్టు వివరించారు. అతడు ఒంటరిగా తిరిగేవాడు.. నీస్ నగరంలో నరమేధానికి పాల్పడిన ఉగ్రవాది ఒంటరిగా సంచరించేవాడని, అతడు మత విశ్వాసాలను కూడా పాటించినట్టు కనిపించిందని ఇరుగుపొరుగు వెల్లడించారు. ప్రజలపైకి ట్రక్కును నడిపిన డ్రైవర్ మొహమ్మద్ నివసిస్తున్న ఫ్లాట్‌లో ఫోరెన్సిక్ నిపుణులు సోదా చేశారు. అతడు ఇరుగుపొరుగుతోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని.. పలకరించినా స్పందించేవాడు కాదని చెప్పారు. అతడి మాజీ భార్యను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా అనే దిశగానూ దృష్టి సారించారు. ఉగ్రవాదితో ఇద్దరు వ్యక్తుల వీరోచిత పోరాటం.. ‘‘నేను బాల్కనీలో నిల్చుని ఉన్నా. ప్రజలు సంబ రాలు చేసుకోవటం చూస్తున్నా. అకస్మాత్తుగా ఒక ట్రక్కు ప్రజల గుంపు పైకి దూసుకొచ్చింది. ఆశ్చర్యకరంగా అతడు నెమ్మదిగానే నడిపాడు. అతడిని ఒక వ్యక్తి మోటారుసైకిల్‌పై వెంబడించాడు. ట్రక్కును ఓవర్టేక్ చేసి ముం దుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ట్రక్కు డ్రైవర్ తలుపు తీసి కేబిన్‌లోకి వెళ్లాలని కూడా ప్రయత్నించాడు. కానీ.. అతడు కిందపడిపోయి ట్రక్కు చక్రాల కింద నలిగిపోయి చనిపోయాడు. ఇద్దరు పోలీసు అధికారులు ట్రక్కుపై కాల్పులు జరపటంతో.. డ్రైవర్ ట్రక్కు వేగం పెంచి జనంపై గజి బిజిగా నడుపుతూ దూసుకెళ్లాడు. ఆ తర్వాత 20 సెకన్లకు అతడిపై తుపాకులతో కాల్పులు జరిగాయి. అతడిపై ఎవరు కాల్పులు జరిపారో నాకు తెలియదు. దీంతో జనం భయకంపితులై అన్ని దిక్కులకూ పరుగులు తీశారు. ప్రాణాలు రక్షించుకోగలిగిన వారు హోటళ్లలోకి పరుగులు తీశారు. ఆ తర్వాత నేను స్వయంగా 12 మృతదేహాలను చూశాను. ఇంకా చాలా ఉంటాయని దాంతో స్పష్టమైంది’’ అని.. ఈ దారుణాన్ని స్మార్ట్‌ఫోన్‌తో వీడియో చిత్రీకరించిన జర్మనీ పాత్రికేయుడు రిచర్డ్ గుట్జార్ (42) వివరించారు. ‘‘ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెడుతోంటే.. ఒక వ్యక్తి ట్రక్కులోకి దూకి.. దానిని నడుపుతున్న ఉగ్రవాదితో కలబడ్డాడు. అతడి వద్ద ఉన్న తుపాకీ లాక్కున్నాడు. ఈ ఘర్షణలో ట్రక్కు కొంత సేపు ఆగటంతో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకుని.. ఉగ్రవాదిని కాల్చి చంపటానికి సమయం లభించిం ది. ఈ విధంగా మారణహోమం మరింతసేపు సాగకుండా అడ్డుకునేందుకు సాధారణ పౌరుడు వీరోచితంగా సాయపడ్డాడు. లేదంటే మరింత ప్రాణనష్టం సంభవించేది’’ అని ప్రత్యక్ష సాక్షి ఎరిక్ సియోటి మీడియాకు వివరించారు. తుపాకీ తీసి కాల్పులు జరిపాడు ‘‘ట్రక్కును ఆపాలని, దాని కింద చాలా మంది జనం పడ్డారని, చాలా మంది చనిపోయారని ట్రక్కు డ్రైవర్‌కు చెప్పటానికి నేను అరుస్తూ, చేతులు ఊపుతూ ఉన్నాను. కానీ బయట ఉన్న వారిని ఎవరినీ అతడు పట్టించుకోలేదు. అంతలో అతడు ఏదో వస్తువు తీయటం కనిపించింది. ప్రమాదం బారిన పడిన వారి కోసం అంబులెన్స్‌ను పిలవటానికి సెల్‌ఫోన్ తీస్తున్నాడని అనుకున్నా. కానీ.. అతడు తుపాకీ తీసి పోలీసులపై కాల్పులు జరిపాడు.. అంతకుముందే అక్కడికి వచ్చిన పోలీసులు అతడిపై కేకలు వేస్తూ ఉండగా.. అతడు తుపాకీ తీయటం చూసి వారూ కాల్పులు జరిపి అతడిని హతమార్చారు’’ అని నాదర్ ఎల్ షాఫే అనే మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. బాధితుల్లో భారతీయులు లేరు న్యూఢిల్లీ: నీస్ ఉగ్ర ఘటన బాధితుల్లో భారతీయులెవరూ లేరని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘నీస్‌లోని భారతీయులతో ఫ్రాన్స్‌లో భారత దౌత్యవేత్త సంప్రదించారు. వారంతా క్షేమమని తెలిసింది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. పారిస్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంలో 33140507070 నెంబరుతో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. దిగ్భ్రాంతికి గురయ్యా: ప్రణబ్ ఫ్రాన్స్‌పై జరిగిన దాడితో దిగ్భ్రాంతికి గురయ్యాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫ్రెంచ్ ప్రభుత్వం, ప్రజలు ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో వారికి అండగా ఉంటాం’ అని ట్విటర్లో రాష్ట్రపతి వెల్లడించారు. క్రూరమైన ఉగ్రవాద చర్యపై స్పందించేందుకు మాటలు రావటం లేదని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుతున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. చాలా బాధాకరం: మోదీ ‘ఈ భయంకర ఘటన చాలా బాధాకరం. ఇది ఉగ్రవాదుల బుర్రలేని చర్య. ఈ దురదృష్టకర సమయంలో ఫ్రాన్స్ సోదర, సోదరీమణుల బాధను పంచుకుంటాం.. వారికి మద్దతుగా నిలబడతాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కారకులను కఠినంగా శిక్షించాలి: సోనియా ‘ఫ్రాన్స్ ఘటన.. ప్రజాస్వామ్య విలువలు, శాంతిపట్ల అసహ్యంతో చేసిన చర్య. మృతుల కుటుంబాలకు నివాళులు. ఈ దాడుల వెనుక ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు అండగా ఉంటాం’ అని సోనియా ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్రాన్స్ త్వరగా కోలుకోవాలి ‘ఇది భయంకరమైన ఉగ్రవాద చర్య. మా పాత మిత్రుడైన ఫ్రాన్స్‌పై జరిగిన ఈ చర్యను అమెరికా ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దుర్ఘటన నుంచి ఫ్రాన్స్ కోలుకోవటంలో అమెరికా సంపూర్ణ మద్దతు అందిస్తుంది. విచారణలో ఫ్రాన్స్‌కు అమెరికా ఏజెన్సీల సాయం తప్పకుండా ఉంటుంది. ఫ్రాన్స్ త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాను’ - బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు లాడెన్‌ను మట్టుబెట్టినట్టే ముందుకెళ్లాలి ‘ఇస్లాంను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న వారిపై అంతర్జాతీయ సమాజం యుద్ధం ప్రకటించాలి. వీరిపై యుద్ధం చేసి గెలిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన రీతిలో ముందుకెళ్లాలి. దీన్ని మూడో ప్రపంచయుద్ధంగా కూడా అనుకోవచ్చు. అయితే కాస్త విభిన్నంగా ఉంటుంది’ - హిల్లరీ క్లింటన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం కేన్సర్ మహమ్మారి లాంటి ఉగ్రవాదాన్ని తరిమేసేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళతాం. ఇందుకోసం నాటో దళాల సాయం తీసుకుంటాం. ఉగ్రవాద మూలాలున్న దేశాలనుంచి ప్రజలను అమెరికాలో అడుగు పెట్టనీయం’ - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పిరికిపందల చర్య: ఐక్యరాజ్యసమితి నీస్ నగరంలో జాతీయ దినోత్సవ వేడుకలపై జరిగిన ఉగ్రదాడిని దుర్మార్గమైన చర్యగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రజాస్వామ్యంపై దాడి పిరికిపందల చర్య అని తెలిపింది. అటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కూడా ఉగ్రవాదం.. ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పుగా పరిణమించిందని పేర్కొంది. ఖండించిన ప్రపంచ దేశాధినేతలు ఈ ఘటనతో షాక్‌కు గురైనట్లు రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ప్రపంచ మానవాళి ఏకమై ఉగ్రవాదంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంనాడు దాడి జరగటం.. చాలా దురదృష్టకరమని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ పేర్కొన్నారు. అటు జపాన్ కూడా ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జపాన్ భద్రతకోసం ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను మరింత బలోపేతం చేయనున్నట్లు జపాన్ కేబినెట్ సెక్రటరీ యోషిహిదే తెలిపారు. -
పవర్ వస్తే ఐసిస్‌పై యుద్ధమే: ట్రంప్
న్యూయార్క్: ఫ్రాన్స్‌లోని నీస్‌లో జరిగిన దాడిపట్ల అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తాను అధికారంలోకి వస్తే ఇస్లామిక్ స్టేట్ తో యుద్ధం చేస్తానని అన్నారు. తనను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటే ఇస్లామిక్ స్టేట్ పై ప్రత్యక్ష యుద్ధం చేసే తీర్మానం తీసుకొచ్చి దాని ఆమోదించాలని అమెరికా కాంగ్రెస్ ను కోరతానని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ దాడికి సంబంధించి మాట్లాడారు. ’ఇదొక యుద్ధం. ఇస్లామిక్ స్టేట్ పై యుద్ధం చేయాల్సిందే. ఇదొక క్యాన్సర్ లాంటిది. దీనికోసం నాటోను కూడా ఉపయోగించాలి’ అని ట్రంప్ చెప్పారు. ’మీరు చూస్తునే ఉన్నారు. ఇది వివిధ ప్రాంతాల నుంచి కమ్ముకొస్తున్న యుద్ధం. మనం మన దేశంలోకి వచ్చేవారు ఎలాంటి వారు అనే ఆలోచనే లేకుండా పేపర్ వర్క్ లేకుండా అనుమతిస్తున్నాం. సరైన నిబంధనలు పాటించకుండా, వివరాలు సేకరించకుండా వేలమందిని ఒబామా సర్కార్ అనుమంతించగా.. హిల్లరీ మాత్రం అంతకంటే ఎక్కువ మందినే అనుమతించాలని చూస్తోంది. ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న క్యాన్సర్ లాంటి ఐసిస్ ను అంతమొందించాలంటే మనం నాటో సహాయం కూడా తీసుకోవాలి’ అని ట్రంప్ చెప్పారు. -
‘బౌలింగ్ పిన్స్లా ఎగిరిపడుతున్నా ఏం చేయలేకపోయా’
నీస్: ఫ్రాన్స్ దినోత్సవం(బాస్టిల్ డే) సందర్భంగా సంబురాలు చేసుకుంటున్న ప్రజలపైకి గుర్తు తెలియని భారీ ట్రక్కు ఏ విధంగా దూసుకొచ్చిందో.. ఆ సందర్భంలో కనిపించిన దృశ్యాలేమిటో ప్రత్యక్ష సాక్షి ఒకరు పంచుకున్నారు. ’రోడ్డుపై ట్రక్కు అందరిని ఢీకొడుతుంటే బౌలింగ్ పిన్స్లాగా వారంతా ఎగిరిపడుతుండటం నేను స్వయంగా చూశాను. ఆ సమయంలో వారి అరుపులు విన్నాను. అది నా జీవితంలో మర్చిపోలేను. మీటర్ల వ్యవధిలోనే రక్తపుటేర్లు శవాలు ఒక్కొకటిగా పడుతూ వస్తున్నాయి’ అని అలెమండ్ అనే ఒక సాక్షి తన బ్లాగ్ లో పేర్కొన్నాడు. ‘అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. ఇంతలోనే జనాలు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీస్తూ కనిపించారు. ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు పరుగెత్తండి పరుగెత్తండి అంటూ అరుస్తున్నారు. ఈలోగా గాల్లో రెండు మూడు మీటర్ల ఎత్తులో జనాలు ట్రక్కు ఢీకొనడంతో ఎగిరిపడుతున్నారు. కానీ నేను ఏం చేయలేకపోయాను. ఓ రెస్టారెంటు వద్దకెళ్లి తలదాచుకున్నాను. నేను ఆ ట్రక్కులో డ్రైవర్ని చూడలేదు.. కానీ, అది వేర్వేరు దిశలుగా వెళుతుండటం చూశాను. ఈ ఘటన తర్వాత ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లాను. నేను వెళ్లిన మార్గం వెంట ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు, గాయాలతో అరుస్తున్నవారు కనిపించారు. ఆ దృశ్యం చూసి పూర్తిగా ధైర్యం కోల్పోయాను’ అని ఆ భయానక దృశ్యాలు వివరించాడు. -
ఐసిస్ మద్దతుదారుల హర్షం
నీస్: భయంకరమైన పేలుడుతో ఛిద్రమైన దేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఫ్రాన్స్ లోని నీస్ నగరం మార్మోగింది. పసి పిల్లలతో సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన గురించి తెలిసిన వారంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) మద్దతుదారులు మాత్రం హర్షాతిరేకాలు ప్రకటిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. నీస్ నగరంలో జరిగిన ఉగ్రదాడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఉగ్రదాడిలో ఫ్రాన్స్ పౌరులు మృతి చెందడం తమకెంతో సంతోషం కలిగించిందని కామెంట్లు చేశారు. 'దేవుడు గొప్పవాడు' అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు నీస్ దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించింది. అమాయక పౌరుల ప్రాణాలు తీయడాన్ని తీవ్రంగా గర్హించింది. పారిస్ దాడి జరిగిన తర్వాత దాదాపు 8 నెలలకు ఐసిస్ మరోసారి నరమేధం సృష్టించింది. అయితే యూరో 2016 సాకర్ టోర్నమెంట్ ఆదివారంతో ప్రశాంతంగా ముగియడంతో ఫ్రాన్స్ ఊపిరి పీల్చుకుంది. ఈలోగా ఐసిస్ మరోసారి ఉగ్రదాడికి తెగబడడంతో ఫ్రాన్స్ తో పాటు ప్రపంచమంతా ఉలికిపడింది. -
మరో 90 రోజులు నిఘా నీడలో ఫ్రాన్స్..
పారిస్: ఫ్రాన్స్‌లో మరో దాడి జరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు హోలాండే మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో పారిస్ నగరంలో పై ఉగ్రవాదులు విరుచుకుపడి దాదాపు 130మందిని బలిగొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రస్తుతం అది కొనసాగుతుంది కూడా. అయితే, తాజాగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా మరోసారి ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు నడుపుతూ వారి ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటనలో 80 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మూడు నెలలు దేశంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తున్నట్లు చెప్పారు. -
రక్తపు మడుగులో శవాల కుప్పలు
నీస్: సరిగ్గా ఆరు నెలలు దాటింది.. ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు దాడిచేసి. ఆ దాడినే ఇప్పటివరకు ఆ దేశంతో సహా ప్రపంచ దేశాలు జీర్ణించుకోలేదు. ఇంతలోనే మరో సంఘటన. స్వరూపం ఎలా ఉన్నా మళ్లీ అమాయకుల ప్రాణాలు మాత్రం పోయాయి. ఒక్కడు పదుల సంఖ్యలో ప్రాణం తీశాడు. బాస్టిల్ డే (ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం) సందర్భంగా వీధుల్లో సంబురాలు జరుపుకుంటూ టపాసుల వెలుగులను వీక్షిస్తున్న వారిని అత్యంత క్రూరంగా చిదిమేశాడు. ఆయుధాలతో నిండిన ఓ భారీ ట్రక్కుతో జనాలపైకి దూసుకొచ్చాడు. దాదాపు రెండు కిలో మీటర్ల పొడవునా దొరికినవారిని దొరికినట్లు తొక్కేసి రక్తం పారించి అందులో శవాలను తేలియాడేలా చేశాడు. బాస్టిల్ డే రోజే జరిగిన ఈ ఘటన మరోసారి ఫ్రాన్స్‌లో భద్రత లేమిని మరోసారి చూపిస్తోంది. అలా దాడి చేసిన వాడు ఉగ్రవాదా.. లేక మరింకెవరు? అసలు అతడు దాడి ఎందుకు చేశాడు? ట్రక్కు నిండా ఆయుధాలు ఉన్నాయంటే ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు దూసుకొచ్చాడా? పోలీసులు అతడిని మట్టుబెట్టకుంటే ఎంత పెద్ద అనర్థం జరిగి ఉండేది? ఊహించుకుంటేనే గుండెల్లో రైల్లు పరుగెత్తుతాయి. ఇలాంటి ఘటన ఎలా జరిగింది? జరగడానికి.. జరిగిన తర్వాత పరిస్థితులు ఏమిటీ అనే విషయాలు ఒకసారి పరిశీలిస్తే.. 1. సమయం సరిగ్గా రాత్రి 11.00గంటలు. గురువారం రాత్రి. వందలమంది నీస్ లోని బీచ్ ముందున్న రోడ్డు పైకి వచ్చి క్రాకర్లు వీక్షిస్తున్నారు. అదే సమయంలో జనాలపైకి ఓ భారీ ట్రక్కు శరవేగంతో దూసుకొచ్చింది. దాదాపు రెండు కిలో మీటర్ల పొడవునా అందిరినీ గుద్దేసుకుంటా వెళ్లింది. దానిని అడ్డుకునేందుకు సామాన్యులు పోలీసులు వెంటపడ్డారు. అయినా ట్రక్కు వేగం పెంచడంతో అప్రమత్తమైన మరికొద్ది దూరంలో ఉన్న పోలీసులు ట్రక్కు నడుపుతున్న ఉగ్రవాదిపై వరుస కాల్పులు జరిపి హతమార్చారు. 2. ట్రక్కు వచ్చిన రెండు కిలోమీటర్ల మేర రక్తపు మడుగులో శవాల కుప్పలు పడ్డాయి 3. ఉగ్రవాది చనిపోయిన తర్వాత ట్రక్కు నిండా బాంబులు, గన్లు ఉన్నాయని ఆ ప్రాంత చీఫ్ క్రిస్టియన్ ఎస్ట్రోసి చెప్పారు. 4. మొత్తం 77మంది చనిపోయారని వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే ప్రకటన చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదిని హతం చేసినట్లు తెలిపారు. 5. కొంతమందిని ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నారని ఆన్ లైన్ లో వార్తలు హల్ చల్ చేయగా వాటిని అంతర్గత వ్యవహారాల మంత్రి కొట్టి పారేశారు. దాడి చేసింది ఒక్క ఉగ్రవాదే అని చెప్పారు. 6. దాడిచేసిన ఉగ్రవాది పేరు తెలియరాలేదు. కానీ, అతడికి 31 ఏళ్లు ఉంటాయని, ఫ్రెంచ్-ట్యూనిషియన్ అయ్యుంటాడని పోలీసులు చెప్తున్నారు. అయితే, అతడు నీస్ ప్రాంతం వాడేనని లభ్యమైన ఆధార పత్రాలు చెబుతున్నాయి. 7. దాడికి ఒక్కడే దిగాడా.. లేక మధ్యలో ఎవరైనా ఉగ్రవాదులు దిగి ఎక్కడైనా దాచుకున్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. 8. ఇరాక్, సిరియాలో ఫ్రాన్స్ ప్రాబల్యాన్ని పెంచుతాం. జిహాదిస్టులను అంతమొందిస్తాం. వెనుకడు వేసేది లేదు అని హోలాండే ప్రకటించారు. 9. ఇప్పటి వరకు ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు 10. ఫ్రాన్స్‌లో దాడులు కొనసాగిస్తామని గత నవంబర్ దాడి సందర్భంలోనే ఇస్లామిక్ స్టేట్ చెప్పిన నేపథ్యంలో ఆ సంస్థే ఈ దాడికి వ్యూహం పన్ని ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. -
'నీస్ దాడిలో భారతీయులకు ఏం కాలేదు'
-
నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
-
పక్కా స్కెచ్ వేసి 'ట్రక్'తో బీభత్సం
-
'నీస్ దాడిలో భారతీయులకు ఏం కాలేదు'
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయులెవరూ మృతి చెందలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయులు మృతి చెందినట్టుగానీ, గాయపడినట్టు గానీ సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పారిస్ లోని భారత రాయబారి అక్కడి భారతీయులకు అందుబాటులో ఉన్నారని, నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. నీస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఫ్రాన్స్ లోని భారతీయుల కోసం రాయబార కార్యాలయం +33-1-40507070 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిందని ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఈ నంబర్ కు ఫోన్ చేయొచ్చని తెలిపింది. ఉగ్ర దాడిలో కనీసం 80 మంది మృతి చెందగా, వందమందిపైగా గాయపడినట్టు సమాచారం. -
పక్కా స్కెచ్ వేసి 'ట్రక్'తో బీభత్సం
నీస్: ఉగ్రవాదులు ఈసారి రూట్ మార్చారు. ప్రతిసారి ఆత్మాహుతి దాడి, బాంబులు పేల్చి నరమేధం సృష్టించే ఉగ్రవాదులు...ఈసారి ట్రక్‌తో పెద్ద వ్యూహాన్నే రచించారు. జాతీయ దినోత్సవం సందర్భంగా ట్రక్‌తో మెరుపు దాడికి దిగి బీభత్సం సృష్టించారు. ఎవరూ ఊహించలేని విధంగా... నిఘా వర్గాలు కూడా పసిగట్టకుండా పథక రచన చేశారు. ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలతో పక్కా ప్లాన్‌తో ఈ దాడికి తెగబడ్డారు. ట్రక్‌తో అక్కడున్న ప్రజల్ని ఢీకొట్టి చంపారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొడితే పేలుడు పదార్థాలతో బీభత్సం సృష్టించేందుకు స్కెచ్ వేశారు. ఒకవేళ పేలుళ్లు జరిగే ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకూ 80 మంది దుర్మరణం చెందారు. మరో వందమందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఉగ్రవాదులు వచ్చిన ట్రక్కులో పేలుడు పదార్థాలు, గ్రెనైడ్లు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. దారుణానికి తెగబడిన ట్రక్కు డ్రైవర్‌ను కాల్చి చంపాయి. అతనిని 31ఏళ్ల ట్యునీషియాకు చెందిన వ్యక్తిగా గుర్తించాయి. వాహనంలో ఉన్న మరో ఉగ్రవాది సమీపంలో ఉన్న రెస్టారెంట్లో దాక్కోగా... అతన్ని కూడా హతమార్చాయి. ఘటనా స్థలంలో మరింతమంది ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతాబలగాలు అనుమానిస్తున్నాయి. ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నీస్ నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్న సైన్యం... బీచ్‌రోడ్‌ను జల్లెడ పడుతోంది. రెస్క్యూటీం సహాయక చర్యలు చేపడుతోంది. సంఘటనా స్థలం నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్టీరోస్ స్పందించారు. మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. మరోవైపు నీస్ దాడి జరగగానే అక్కడున్న ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వీధుల్లో పరుగులు తీశారు. కొందరు పక్కనే ఉన్న రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో తలదాచుకున్నారు. కాసేపు బయట ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఓ రెస్టారెంట్లో కొందరు వ్యక్తులు భయంతో దాక్కున్నారు. అక్కడి పరిస్థితిని మరో వ్యక్తి వీడియో తీశాడు. ప్రాణ భయంతో వారంతా వణికిపోతున్న వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. -
నీస్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
నీస్: పారిస్ ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే ఫ్రాన్స్ లో మరోసారి ముష్కరులు మారణహోమానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే సంబరాల్లో నరమేధం సృష్టించారు. పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో పెను విధ్వంసం సృష్టించి 80 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. 100 మందిపైగా క్షతగాత్రులయ్యారు. నీస్ నగరంలో ఉగ్రదాడిని ప్రపంచ దేశాధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. నీస్ దాడి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాస్టిల్ డే సంబరాల్లో పాల్గొన్న అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని తెలిసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుకు ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ దాడిని మతిలేని చర్యగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ కు అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. అమెరికా ప్రజల తరపున భయానక ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. నీస్ దాడి నేపథ్యంలో రేపు జరగనున్న విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉగ్రదాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. I hope the injured recover soon. India shares the pain & stands firmly with our French sisters & brothers in this hour of immense sadness. — Narendra Modi (@narendramodi) 15 July 2016 Appalled by the horrific attack in Nice. I strongly condemn such mindless acts of violence. My thoughts are with the families of deceased. — Narendra Modi (@narendramodi) 15 July 2016 I hope the injured recover soon. India shares the pain & stands firmly with our French sisters & brothers in this hour of immense sadness. — Narendra Modi (@narendramodi) 15 July 2016 -
ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి: 84 మంది మృతి
ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 84 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 18మంది పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా వెలుగులను వీక్షిస్తున్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంతో ట్రక్కును నడిపారు. ట్రక్కులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. ఫ్రాన్స్ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ట్రక్కు దూసుకుపోయిన ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. క్షతగాత్రులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిచాయి. మృతులకు ఒబామా సంతాపం తెలిపారు.