'నీస్ దాడిలో భారతీయులకు ఏం కాలేదు'
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయులెవరూ మృతి చెందలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయులు మృతి చెందినట్టుగానీ, గాయపడినట్టు గానీ సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పారిస్ లోని భారత రాయబారి అక్కడి భారతీయులకు అందుబాటులో ఉన్నారని, నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.
నీస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఫ్రాన్స్ లోని భారతీయుల కోసం రాయబార కార్యాలయం +33-1-40507070 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిందని ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఈ నంబర్ కు ఫోన్ చేయొచ్చని తెలిపింది. ఉగ్ర దాడిలో కనీసం 80 మంది మృతి చెందగా, వందమందిపైగా గాయపడినట్టు సమాచారం.