పక్కా స్కెచ్ వేసి 'ట్రక్'తో బీభత్సం
నీస్: ఉగ్రవాదులు ఈసారి రూట్ మార్చారు. ప్రతిసారి ఆత్మాహుతి దాడి, బాంబులు పేల్చి నరమేధం సృష్టించే ఉగ్రవాదులు...ఈసారి ట్రక్‌తో పెద్ద వ్యూహాన్నే రచించారు. జాతీయ దినోత్సవం సందర్భంగా ట్రక్‌తో మెరుపు దాడికి దిగి బీభత్సం సృష్టించారు. ఎవరూ ఊహించలేని విధంగా... నిఘా వర్గాలు కూడా పసిగట్టకుండా పథక రచన చేశారు. ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలతో పక్కా ప్లాన్‌తో ఈ దాడికి తెగబడ్డారు.
ట్రక్‌తో అక్కడున్న ప్రజల్ని ఢీకొట్టి చంపారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొడితే పేలుడు పదార్థాలతో బీభత్సం సృష్టించేందుకు స్కెచ్ వేశారు. ఒకవేళ పేలుళ్లు జరిగే ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకూ 80 మంది దుర్మరణం చెందారు. మరో వందమందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఉగ్రవాదులు వచ్చిన ట్రక్కులో పేలుడు పదార్థాలు, గ్రెనైడ్లు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. దారుణానికి తెగబడిన ట్రక్కు డ్రైవర్‌ను కాల్చి చంపాయి. అతనిని 31ఏళ్ల ట్యునీషియాకు చెందిన వ్యక్తిగా గుర్తించాయి. వాహనంలో ఉన్న మరో ఉగ్రవాది సమీపంలో ఉన్న రెస్టారెంట్‌లో దాక్కోగా... అతన్ని కూడా హతమార్చాయి. ఘటనా స్థలంలో మరింతమంది ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతాబలగాలు అనుమానిస్తున్నాయి.
ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నీస్ నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్న సైన్యం... బీచ్‌రోడ్‌ను జల్లెడ పడుతోంది. రెస్క్యూటీం సహాయక చర్యలు చేపడుతోంది. సంఘటనా స్థలం నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్టీరోస్ స్పందించారు. మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు.
మరోవైపు నీస్ దాడి జరగగానే అక్కడున్న ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వీధుల్లో పరుగులు తీశారు. కొందరు పక్కనే ఉన్న రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో తలదాచుకున్నారు. కాసేపు బయట ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఓ రెస్టారెంట్‌లో కొందరు వ్యక్తులు భయంతో దాక్కున్నారు. అక్కడి పరిస్థితిని మరో వ్యక్తి వీడియో తీశాడు. ప్రాణ భయంతో వారంతా వణికిపోతున్న వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.