రక్తపు మడుగులో శవాల కుప్పలు
నీస్: సరిగ్గా ఆరు నెలలు దాటింది.. ఫ్రాన్స్లో ఉగ్రవాదులు దాడిచేసి. ఆ దాడినే ఇప్పటివరకు ఆ దేశంతో సహా ప్రపంచ దేశాలు జీర్ణించుకోలేదు. ఇంతలోనే మరో సంఘటన. స్వరూపం ఎలా ఉన్నా మళ్లీ అమాయకుల ప్రాణాలు మాత్రం పోయాయి. ఒక్కడు పదుల సంఖ్యలో ప్రాణం తీశాడు. బాస్టిల్ డే (ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం) సందర్భంగా వీధుల్లో సంబురాలు జరుపుకుంటూ టపాసుల వెలుగులను వీక్షిస్తున్న వారిని అత్యంత క్రూరంగా చిదిమేశాడు. ఆయుధాలతో నిండిన ఓ భారీ ట్రక్కుతో జనాలపైకి దూసుకొచ్చాడు.
దాదాపు రెండు కిలో మీటర్ల పొడవునా దొరికినవారిని దొరికినట్లు తొక్కేసి రక్తం పారించి అందులో శవాలను తేలియాడేలా చేశాడు. బాస్టిల్ డే రోజే జరిగిన ఈ ఘటన మరోసారి ఫ్రాన్స్లో భద్రత లేమిని మరోసారి చూపిస్తోంది. అలా దాడి చేసిన వాడు ఉగ్రవాదా.. లేక మరింకెవరు? అసలు అతడు దాడి ఎందుకు చేశాడు? ట్రక్కు నిండా ఆయుధాలు ఉన్నాయంటే ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు దూసుకొచ్చాడా? పోలీసులు అతడిని మట్టుబెట్టకుంటే ఎంత పెద్ద అనర్థం జరిగి ఉండేది? ఊహించుకుంటేనే గుండెల్లో రైల్లు పరుగెత్తుతాయి. ఇలాంటి ఘటన ఎలా జరిగింది? జరగడానికి.. జరిగిన తర్వాత పరిస్థితులు ఏమిటీ అనే విషయాలు ఒకసారి పరిశీలిస్తే..
1. సమయం సరిగ్గా రాత్రి 11.00గంటలు. గురువారం రాత్రి. వందలమంది నీస్ లోని బీచ్ ముందున్న రోడ్డు పైకి వచ్చి క్రాకర్లు వీక్షిస్తున్నారు. అదే సమయంలో జనాలపైకి ఓ భారీ ట్రక్కు శరవేగంతో దూసుకొచ్చింది. దాదాపు రెండు కిలో మీటర్ల పొడవునా అందిరినీ గుద్దేసుకుంటా వెళ్లింది. దానిని అడ్డుకునేందుకు సామాన్యులు పోలీసులు వెంటపడ్డారు. అయినా ట్రక్కు వేగం పెంచడంతో అప్రమత్తమైన మరికొద్ది దూరంలో ఉన్న పోలీసులు ట్రక్కు నడుపుతున్న ఉగ్రవాదిపై వరుస కాల్పులు జరిపి హతమార్చారు.
2. ట్రక్కు వచ్చిన రెండు కిలోమీటర్ల మేర రక్తపు మడుగులో శవాల కుప్పలు పడ్డాయి
3. ఉగ్రవాది చనిపోయిన తర్వాత ట్రక్కు నిండా బాంబులు, గన్లు ఉన్నాయని ఆ ప్రాంత చీఫ్ క్రిస్టియన్ ఎస్ట్రోసి చెప్పారు.
4. మొత్తం 77మంది చనిపోయారని వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే ప్రకటన చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదిని హతం చేసినట్లు తెలిపారు.
5. కొంతమందిని ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నారని ఆన్ లైన్ లో వార్తలు హల్ చల్ చేయగా వాటిని అంతర్గత వ్యవహారాల మంత్రి కొట్టి పారేశారు. దాడి చేసింది ఒక్క ఉగ్రవాదే అని చెప్పారు.
6. దాడిచేసిన ఉగ్రవాది పేరు తెలియరాలేదు. కానీ, అతడికి 31 ఏళ్లు ఉంటాయని, ఫ్రెంచ్-ట్యూనిషియన్ అయ్యుంటాడని పోలీసులు చెప్తున్నారు. అయితే, అతడు నీస్ ప్రాంతం వాడేనని లభ్యమైన ఆధార పత్రాలు చెబుతున్నాయి.
7. దాడికి ఒక్కడే దిగాడా.. లేక మధ్యలో ఎవరైనా ఉగ్రవాదులు దిగి ఎక్కడైనా దాచుకున్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది.
8. ఇరాక్, సిరియాలో ఫ్రాన్స్ ప్రాబల్యాన్ని పెంచుతాం. జిహాదిస్టులను అంతమొందిస్తాం. వెనుకడు వేసేది లేదు అని హోలాండే ప్రకటించారు.
9. ఇప్పటి వరకు ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు
10. ఫ్రాన్స్లో దాడులు కొనసాగిస్తామని గత నవంబర్ దాడి సందర్భంలోనే ఇస్లామిక్ స్టేట్ చెప్పిన నేపథ్యంలో ఆ సంస్థే ఈ దాడికి వ్యూహం పన్ని ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.