మరో 90 రోజులు నిఘా నీడలో ఫ్రాన్స్..
పారిస్: ఫ్రాన్స్లో మరో దాడి జరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు హోలాండే మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ఏడాది నవంబర్లో పారిస్ నగరంలో పై ఉగ్రవాదులు విరుచుకుపడి దాదాపు 130మందిని బలిగొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రస్తుతం అది కొనసాగుతుంది కూడా. అయితే, తాజాగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా మరోసారి ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు నడుపుతూ వారి ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటనలో 80 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మూడు నెలలు దేశంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తున్నట్లు చెప్పారు.