లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Published Wed, Nov 23 2016 4:23 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM
స్వల్పలాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి దేశీయ మార్కెట్లు ఒడిదుడుకుల మయంగా సాగి ఆఖరికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 91.03 పాయింట్ల లాభంతో 26,051.81 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 8,033.30వద్ద ముగిసింది. బ్యాంక్స్, హెల్త్ కేర్, ఇన్ఫ్రా స్టాక్స్ మద్దతుతో దేశీయ సూచీలు మధ్యాహ్నం ట్రేడింగ్లో లాభాల్లోకి ఎగిశాయి. లుపిన్, టాటాస్టీల్, ఏషియన్ పేయింట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీలు లాభాలనార్జించగా.. మహింద్రా అండ్ మహింద్రా, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సెన్సెక్స్లో నష్టాలను గడించాయి.
లార్సన్ అండ్ టుబ్రో అంచనాలు మించి క్వార్టర్లీ ఫలితాలను పండించడంతో పాటు, అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల పవనాలు పెట్టుబడిదారులు సెంటిమెంట్ను బలపరిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని తీసుకున్న సంచలన నిర్ణయంపై ట్రేడర్లు సెంటిమెంట్ ఇంకా బలహీనంగానే ఉందని, ఆర్థిక ప్రభావంపై వారు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గురువారంతో డెరివేటివ్స్ గడువు ముగుస్తుండంతో మార్కెట్లు ఒడిదుడుకులుగా సాగినట్టు విశ్లేషకులు చెప్పారు. అటు వాల్ స్ట్రీట్ కూడా మంగళవారం వరుసగా రెండో సెషన్లో రికార్డు బ్రేక్ చేయడంతో ఆసియన్ స్టాక్స్ వారం గరిష్టంలో నమోదయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 0.24 పైసలు నష్టపోయి 68.49వద్ద ముగిసింది.
Advertisement