8400 మార్కును చేధించిన నిఫ్టీ
Published Thu, Jan 12 2017 9:57 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
ఎలాంటి ప్రత్యేక పాలసీ వివరాలను అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్వల్ప లాభాల్లో ఎంట్రీ ఇచ్చిన సెన్సెక్స్ నిఫ్టీలు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 124.19 పాయింట్ల లాభంలో 27,264 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ తన కీలకమార్కు 8412ను చేధించి ట్రేడ్ అవుతోంది. నవంబర్ 11 తర్వాత మొదటిసారి నిఫ్టీ 8400ను తాకింది. ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్పొ టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ఫార్మా, లుపిన్, సిప్లా, ఐటీసీలు నష్టాలు గడిస్తున్నాయి.
ఇన్ఫోసిస్, టీసీఎస్లు ప్రకటించినున్న క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు 2.15 శాతం, 0.17 శాతం పైకి ట్రేడవుతున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. బుధవారం ముగింపుకు 17 పైసలు లాభపడి 68.15గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ట్రంప్ తొలి మీడియా సమావేశంలో తన ప్రతిపాదిత పాలసీల గురించి ఊసైనా ఎత్తలేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో డాలర్ విలువ పడిపోయింది. ఆసియన్ షేర్లు మిక్స్డ్గా ట్రేడవుతున్నాయి. డాలర్తో పోలిస్తే యెన్ భారీగా బలపడింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర కూడా 187 రూపాయల లాభంతో 28,331వద్ద ట్రేడవుతోంది.
Advertisement
Advertisement