ములాఖత్‌కు వచ్చి.. పోలీసులకు దొరికేశాడు | Nisar trial and arrested SIT officials | Sakshi
Sakshi News home page

ములాఖత్‌కు వచ్చి.. పోలీసులకు దొరికేశాడు

Published Sat, Oct 17 2015 7:51 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

Nisar trial and arrested SIT officials

‘హుజీ’ కేసులో మరో నిందితుడు ఇస్లాం అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టుల ద్వారా ఉగ్రవాద సానుభూతిపరులను దేశం దాటిం చి, శిక్షణ ఇప్పించేందుకు కుట్రపన్ని పోలీసులకు చిక్కిన నిషిద్ధ హర్కత్ ఉల్ జిహాద్ ఏ ఇస్లామీ(హుజీ) ఉగ్రవాది మహ్మద్ నిసార్ అనుచరుడు ఇస్లాంను సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిసార్‌ను కలవడానికి వచ్చి సిట్‌కు చిక్కాడు. బంగ్లాదేశ్‌కు చెందిన నిసార్‌తో పాటు మరికొందరు బంగ్లాదేశీయులు, మయన్మార్ వాసులు, ఇద్దరు స్థానికుల్ని ఈ ఏడాది ఆగస్టులో అరెస్టు చేసిన విషయం విదితమే.

నిసార్ విచారణలో ఇస్లాం వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి వలపన్ని ఎట్టకేలకు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన నిసార్ భారత్‌కు వచ్చిన తరవాత కొన్ని నెలల పాటు పానిపట్‌లోని బ్లాంకెట్స్ ఫ్యాక్టరీలో పని చేశాడు. బెంగాల్‌లోని దక్షిణ్ దినాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన అలీమ్ ఉల్ ఇస్లాం మండల్‌కు.. మాల్దా రైల్వేస్టేషన్‌లో నిసార్‌తో పరిచయమైంది. నిసార్ ఢిల్లీ వెళ్లేందుకు టిక్కెట్ ఖరీదు చేస్తుండగా ఇస్లాం తారసపడటంతో ఇద్దరూ మాటలు కలిపారు.

ఇద్దరూ ఒకే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం చేసిన నేపథ్యంలో ఒకరి భావాలు మరొకరు పంచుకునిమంచి స్నేహితులయ్యారు. ఈ నేపథ్యంలోనే బెంగాల్‌లోని భత్రా ప్రాంతంలో మదర్సా నెలకొల్పాలని, ఆ ముసుగులో జిహాదీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని వీరు పథకం వేశారు. ఈ ప్రక్రియలో సోహైల్ సహకారం తీసుకున్నారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో సో హైల్, ఇస్లాం మధ్య విభేదాలు రావడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. తరవాత నిసార్ అరెస్టయ్యాడు. ఇస్లాం కోసం సిట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిసార్ ఉన్న చర్లపల్లి జైలు వద్ద ఓ బృందం మాటువేసి ఉంటోంది. శుక్రవారం ములాఖత్ ద్వారా నిసార్‌ను కలిసి భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి వచ్చిన ఇస్లాంను సిట్ అధికారులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement