పన్నువడ్డింపుపై క్లారిటీ!
న్యూఢిల్లీ: నగదు లావాదేవీలపై వడ్డించనున్న పన్నులపై ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. రూ50 వేలు, ఆ పైన నగదు లావాదేవీలపై పన్ను విధించే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.
కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇంకా సంఘం సిఫారసులపై తుది అభిప్రాయాన్ని తీసుకోలేదని తెలిపింది. కమిటీ సిఫారసుల ను జాగ్రత్తగా పరిశీలించినమీదట తగిన నిర్ణయంతీసుకుంటామని ఒక ప్రకటలో మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కమిటీ రూ.50వేలకు పైన విత్ డ్రాల పై పన్ను విధించాల్సిందిగా మంగళవారం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై వడ్డీని రద్దుచేయాలని, తద్వారా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందించాలని తెలిపింది. అన్ని లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించాలని, నగదు చెల్లింపులకంటే డిజిటల్ చెల్లింపులు లాభదాయకంగా ఉండేలా ప్రోత్సహించాలని కోరింది. ఎవరైనా కొంత భాగాన్ని డిజిటల్ రూపంలో ఖర్చు చేసే వినియోగదారులకు ఆ మేరకు పన్ను వెనక్కు ఇవ్వాలని సూచించింది. మెట్రో నగరాల్లోని బస్సులు, సబర్బన్ రైళ్లలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ప్రోత్సహించాలని సూచించాలని కోరారు. అలాగే, ఐటీ పరిధిలోకి రానివారికి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు రూ.వెయ్యి, బయోమెట్రిక్ కొనుగోలుకు రూ.వెయ్యి రాయితీ ఇవ్వాలని చెప్పింది. అప్పుడే ప్రజలు నగదు రహిత లావాదేవీలకు ఆకర్షితులవుతారని పేర్కొన్న సంగతి తెలిసిందే.