గడువు తేదీ(మెచ్యూరిటీ)కి ముందే ఎఫ్‌ఎంపీ(ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్) నుంచి వైదొలగవచ్చా?
- హర్షిణి, హైదరాబాద్
ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ) అంటే నిర్ణీత కాలానికి నిర్దేశించిన ప్లాన్‌లనే చెప్పాలి. అయితే ఇన్వెస్టర్లు ఈ ప్లాన్‌ల నుంచి ముందే వైదొలిగే వెసులుబాటు కల్పించాల్సిందేనని మ్యూచువల్‌ఫండ్ కంపెనీలకు సెబీ ఆదేశాలిచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టింగ్ అనే రూట్ ద్వారా ఎఫ్‌ఎంపీ(క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్స్)నుంచి ముందే వైదొలిగే అవకాశం ఉంది. ఎఫ్‌ఎంపీకి సంబంధించి క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్ నుంచి మీరు వైదొలగాలనుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో వాటిని విక్రయించుకోవచ్చు. అయితే వీటిని కొనుగోలు చేసే కొనుగోలుదారులు దొరకడం కొంచెం కష్టమైన పనే. క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్ కనుక నిర్దేశిత కాలానికి ఈ ఫండ్ సొమ్ములు లాక్ ఇన్ అయి ఉంటాయి. అందుకే ఇది లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్ కాదని చెప్పవచ్చు.
అందుకే అత్యవసర సమయాల్లో మనం ఎఫ్‌ఎంపీలపై ఆధారపడలేం. ఈ ఏడాది జనవరి నుంచే ఎఫ్‌ఎంపీలు ట్రేడవుతున్నాయి. 20 రోజుల్లో బీఎస్‌లో 8, ఎన్‌ఎస్‌ఈలో 9 స్కీమ్‌లు మాత్రమే చేతులు మారాయి. ఈ ఏడాది కొన్ని స్కీమ్‌లకు సంబంధించిన లావాదేవీలు కొన్ని లక్షలున్నప్పటికీ, రోజుకు వంద మాత్రమే ఉండడం గమనించదగ్గ విషయం. అందుకే ఎఫ్‌ఎంపీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లిక్విడిటీ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
లిక్విడ్, గోల్డ్ ఈ రెండు ఫండ్స్‌లో చెరొక దాంట్లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేశాననుకోండి. ఏడాది తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.1.1 లక్షలయిందనుకుందాం. ఈ ఆదాయమంతా పన్నురహితమైనదేనా? ఇండెక్సేషన్ ప్రభావం ఎలా ఉంటుంది?
- శ్రీరామ్, విశాఖపట్నం
గోల్డ్, లిక్విడ్ ఫండ్స్‌లపై పన్ను ఒకే విధంగా ఉంటుంది. మీ విషయంలో ఏడాది తర్వాత మీకు వచ్చే రిటర్న్‌ల్లో లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను (10 శాతం ఫ్లాట్ లేదా 20 శాతం (ఇండెక్సేషన్ మదింపు తర్వాత) విధిస్తారు. ఇండెక్సేషన్ ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే లాభాలను ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసుకోవచ్చు. మీ పెట్టుబడులపై మీరు ఆర్జించిన వాస్తవ రాబడులు ద్రవ్యోల్బణం సంచిత ప్రభావం వల్ల తగ్గుతాయి. ఉదాహరణకు మీరు పెట్టిన పెట్టుబడి 15 ఏళ్లలో నాలుగింతలైందనుకుందాం. ద్రవ్య కొనుగోలు శక్తి మీరు పెట్టుబడి పెట్టిన కాలంతో పోల్చితే ఇప్పటికి సగానికి కంటే తక్కువకే పడిపోతుంది.
ఇండెక్సేషన్ ప్రకారమైతే, మీరు ఆర్జించిన లాభాలు ద్రవ్యోల్బణం కారణంగా హరించుకుపోతే, ఆ మొత్తంపై ప్రభుత్వం పన్ను విధించదు. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ విషయమై ఇన్వెస్టర్లు కోల్పోయే కొనుగోలు శక్తి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఇన్వెస్టర్లకు ఈ ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు. ఇండెక్సేషన్‌ను ఎలా లెక్కిస్తారంటే.., వ్యయ ద్రవ్యోల్బణ సూచికీ, వాస్తవ ధరలను పోల్చి ఇండెక్సేషన్‌ను లెక్కగడతారు.
ఇండేక్సేషన్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాలను లెక్కిస్తారు. ఆ తర్వాత 20 శాతం పన్ను విధిస్తారు. ఇలా లెక్కించిన పన్ను మొత్తం 10 శాతం ఫ్లాట్ ట్యాక్స్ (ఇండెక్సేషన్‌తో కాకుండా) కంటే అధికంగా ఉంటే, ఆ అధిక మొత్తాన్ని వదిలివేస్తారు.
నా వయస్సు 31 సంవత్సరాలు. రూ.70 లక్షలకు ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను పనిచేసే కంపెనీ తరపు నాకు బీమా ఉన్నప్పటికీ, మరో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోమని మిత్రులంటున్నారు. అవసరమా? చాలా ఆన్‌లైన్ టర్మ్ పాలసీల్లో యాక్సిడెంటల్ కవర్ వంటి రైడర్స్ (ఏగాన్ రెలిగేర్ మినహా) లభించడం లేదు. దేనిని ఎంచుకోవాలి. నాకు తగిన సలహా ఇవ్వండి?
- జాన్సన్, నెల్లూరు
చిన్న వయసులోనే బీమా పాలసీ తీసుకోవాలనుకోవడం మంచి నిర్ణయం. చిన్న వయసు లోనే బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీరు పెద్ద మొత్తానికి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మొత్తానికి రెండు కంపెనీల పాలసీలు తీసుకోవడం ఉత్తమం. ఫలితంగా డైవర్సిఫికేషన్ ప్రయోజనం లభించి రిస్క్ తగ్గుతుంది. యాక్సిడెంటల్ డెత్ రైడర్‌ను ఏగాన్ రెలిగేర్ ఐటెర్మ్ ప్లాన్ ఆఫర్ చేస్తుంది. క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌పై ప్రీమియంను రద్దు చేసే ఆఫర్‌ను కూడా ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ ఆఫర్ వల్ల ఈ ప్లాన్ కవర్ చేసే క్రిటికల్ ఇల్‌నెస్‌కు పాలసీదారుడు గురైతే, భవిష్యత్తులో ప్రీమియంలు చెల్లించాల్సిన పనిలేదు.
అంతేకాకుండా లైఫ్ కవర్ కూడా కొనసాగుతుంది. ఇలాంటి రైడర్లే ఆఫర్ చేసే కొన్ని ఆన్‌లైన్ పాలసీలు-బజాజ్ ఆలియంజ్ ఐ సెక్యూర్ ఇన్సూరెన్స్ ప్లాన్, బజాజ్ అలయెంజ్ ఐ సెక్యూర్ మోర్ ఇన్సూరెన్స్ ప్లాన్, బజాజ్ అలయెంజ్ న్యూరిస్క్ కేర్ టూ, బజాజ్ అలయెంజ్ టర్మ్ కేర్. వాటిల్లో నుంచి మీ అవసరాలకు తగ్గట్లుగా పాలసీలను ఎంచుకోండి. కంపెనీ తరపున బీమా ఉన్నప్పటికీ, మరో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి.
మీరు ఆ కంపెనీ నుంచి వైదొలిగితే మీకు బీమా రక్షణ లభించదు. అందుకనే యాక్సిడెంట్లు, క్రిటికల్ ఇల్‌నెస్‌లు, తదితరాలను కవర్ చేసే సమగ్రమైన ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమం. పాలసీలు తీసుకునే ముందు మీ అవసరాలకనుగుణంగా పాలసీలు ఎంచుకోవాలి. ఆరోగ్య, జీవిత బీమా పాలసీల్లో ఒకే రకమైన రైడర్లు లేకుండా చూసుకోవాలి.