పింఛన్ లేదు.. రేషన్ లేదు
ఇదీ శ్రీశైలం చెంచుగూడెం గుండె చప్పుడు
- ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ప్రజల ఆవేదన
- మన ప్రభుత్వంతో అందరికీ న్యాయం జరుగుతుందన్న ప్రతిపక్ష నేత
- పింఛన్ల కోసం కోర్టులో కేసు వేద్దామని స్పష్టీకరణ
- కర్నూలు జిల్లాలో ఐదో రోజు కొనసాగిన యాత్ర
- ఇద్దరు రైతు కుటుంబాలకు జగన్ పరామర్శ
రైతు భరోసా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు: సారూ... నా పేరు సుబ్బమ్మ. ప్రభుత్వం నాకు ముసలోల్ల పింఛను ఇవ్వట్లేదు. ఎట్లాగైనా ఇప్పించండి సారూ!
సారూ... నా పేరు బయ్యన్న. మాది ఓంకారం చెంచుగూడెం. మాకు రచ్చబండ రేషన్ కార్డులిచ్చినారు. వాటికి ఏడాది నుంచి రేషన్ ఇస్తలేరు. మేము ఏం తిని బతకాలి?
సార్.. నా పేరు శాంతుడు. మాది లింగాపురం. నాకు 80 ఏళ్లు. నాకు పింఛన్ రావడం లేదు. ఎట్టా బతకాలి?
‘రైతు భరోసా యాత్ర’లో సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు విన్నవించిన సమస్యలు ఇలాంటివి ఎన్నెన్నో... చంద్రబా బు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క సమస్యనైనా పరిష్కరించడం లేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మండి పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు. పింఛన్ల కోసం కోర్టులో కేసు వేసి పోరాడుదామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలిసి భరోసానిచ్చేందుకు ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర కర్నూ లు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సోమ వారం ఐదో రోజుకు చేరుకుంది.
ఉదయం 9 గంటలకు లింగాపురం నుంచి బయలుదేరిన జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. దారి పొడవునా ఆయనకు ప్రజ లు తమ సమస్యలను విన్నవించారు. జగన్ వారికి ధైర్యం చెబుతూ మన ప్రభుత్వం వచ్చేలా దేవుడిని కోరుకోవాలని అన్నారు. మన ప్రభుత్వంతో అందరికీ మేలు జరుగు తుందని తెలిపారు. లింగాపురం నుంచి బయలుదేరిన ఆయన ఓంకారేశ్వరంలో దేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. అక్క డి నుంచి కడమల కాల్వ మీదుగా వెంగళరెడ్డి పేటకు చేరుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం బి.కోడూరుకు చేరుకుని రైతు దూదేకుల చాంద్‌బాషా కుటుంబాన్ని కలిసి భరోసానిచ్చారు. అక్కడి నుంచి పుట్టపల్లి, అబ్బీపురం మీదుగా తిమ్మాపురం చేరుకుని రైతు చిన్నస్వామి కుటుంబాన్ని కలసి ధైర్యం చెప్పారు. ఐదో రోజు భరోసా యాత్ర దాదాపు 30 కిలోమీటర్లకు పైగా సాగింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే మొత్తం 12 గంటల పాటు యాత్ర కొనసాగింది.
ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం
భరోసా యాత్రలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో గ్రామంలోని ప్రజలు రోడ్డు మీదకు వచ్చి తమ సమస్యలను వైఎస్ జగన్‌కు ఏకరువు పెట్టారు. తమకు ఇంతవరకు ఇల్లు కట్టివ్వలేదని ఒకరు... 80 ఏళ్లు వచ్చినా పింఛన్ ఇవ్వట్లేదని మరొకరు... తమ పొలాలకు నీరివ్వడం లేదని ఇంకొందరు ఆయన వద్ద బోరున విలపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏ ఒక్క మేలు చేయడం లేదని, ఆయనది మొదటి నుంచీ అదే తీరని జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రధానంగా వృద్ధులకు పింఛన్లను కూడా ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా కోర్టులో కేసు వేసి మరీ పోరాడి ప్రభుత్వానికి బుద్ధి చెబుదామన్నారు. తాము నారు పోసుకున్న తర్వాత నీరు ఇవ్వబోమంటూ ప్రభుత్వం దండోరా వేస్తోందని రైతులు వాపోయారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ రెండో కారు పంటకు సాగునీరు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మూడో కారు పంటకు నీరిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వస్తోంది.. ప్రజలకు ఒక్క మేలూ చేయని చంద్రబాబు ప్రభుత్వం పోవాలని గట్టిగా దేవుడిని కోరుకోవాలని ప్రజలతో వైఎస్ జగన్ పేర్కొన్నారు. మన ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
జ్వరం వస్తే దవాఖానా లేదు
దోమల బెడద ఎక్కువవుతోందని, ప్రభుత్వం తమకు కనీసం దోమతెరలు కూడా పంపిణీ చేయలేదని ఓంకారం చెంచుగూడేనికి చెందిన చెంచులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జ్వరం వస్తే వెళ్లడానికి ప్రభుత్వ దవాఖానా కూడా లేదని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా అందరికీ మేలు జరుగుతుందని వైఎస్ జగన్ అభయమిచ్చారు.