'చంద్రబాబుకు అల్టిమేటం ఇస్తున్నా'
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అల్టిమేటం ఇస్తున్నానని, పొగాకుకు కిలో రూ. 150కి తగ్గకుండా మద్దతు ధర కల్పించి, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్లు చేయించని పక్షంలో ఈనెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. రైతులను నట్టేట ముంచేస్తోందని, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆయన రైతులతో భేటీ అయ్యి, వారి సమస్యలపై చర్చించారు.
పొగాకును గతంలో 120 రోజుల పాటు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దాన్ని కేవలం 80 రోజులకే పరిమితం చేశారని, అలాగే కేవలం 47 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలుచేసి.. రైతులను నిండా ముంచేశారని వైఎస్ జగన్ అన్నారు. అలాగే, ఆయిల్పామ్ టన్ను ధర 8267 రూపాయలు ఉంటే.. ఇప్పడు 6473 రూపాయలు మాత్రమే ఉందని, దాదాపు రెండు వేలు తగ్గిందని ఆయన చెప్పారు. చెరుకు మద్దతు ధర కూడా దారుణంగా ఉందని వైఎస్ జగన్ చెప్పారు. రైతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్యాక్టరీలకు వెళ్లి చెరుకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. రైతులకు రవాణా ఖర్చులతో కలిపి రూ. 900 వరకు ఖర్చవుతుంటే, ఫ్యాక్టరీ వాళ్లు రూ. 700 మాత్రమే ఇస్తున్నారన్నారు. పాత సంవత్సరం బకాయిలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు. ఇక అరటిపండ్లు గతంలో గెల రూ. 250-400 వరకు పలికితే, ఇప్పుడు కనీసం 50 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో ఊరికే పంచిపెడుతున్నారన్నారు. రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని చెప్పబట్టి, రుణాలు తిరిగి కట్టొద్దన్నారు కాబట్టి వాళ్లు ఊరుకున్నారని, దానివల్ల గతంలో 3 లక్షల వరకు పావలా వడ్డీకే వచ్చే రుణాల మీద అపరాధ వడ్డీ రూపంలో 14-18 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారంటే.. అందుకు కారణం చంద్రబాబేనని చెప్పారు.