మా భూమి మా ప్రాణం
♦ మా పొలాల జోలికి వస్తే తరిమికొడతాం.. అధికారులకు రైతుల హెచ్చరిక
♦ గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ, బందరు పోర్టులపై గ్రామసభల్లో ఉద్రిక్తత
♦ భూసమీకరణ నోటిఫికేషన్ రద్దుకు డిమాండ్
♦ అభ్యంతరం తెలుపుతూ ఫారం-2ల అందజేత
♦ ఏలూరు కాలువ మళ్లింపునకు భూములు ఇవ్వం
‘ల్యాండ్ బ్యాంకు’ పచ్చని గ్రామాల్లో చిచ్చు రేపుతోంది. భూసమీకరణ సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. పారిశ్రామిక అవసరాల సాకుతో జిల్లాకు లక్ష ఎకరాల చొప్పున మొత్తం 13 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఎత్తులపై రైతులు మండిపడుతున్నారు. రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారు... న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కర్నూలు, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదా వరితోపాటు పలుచోట్ల జరుగుతున్న ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు కేసుల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. పోలీసు పికెట్లతో భయానక వాతావరణం సృష్టిస్తున్నా రైతులు వెనక్కు తగ్గడం లేదు. ప్రాణప్రదంగా చూసుకునే తమ భూముల్లోకి అడుగుపెడితే తరిమి కొడతామని అధికారులను హెచ్చరిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్/ మచిలీపట్నం/ గన్నవరం: రాష్ట్రంలో రైతన్నలు తిరగబడ్డారు. మాయోపాయాలు, బలప్రయోగం ద్వారా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలపై మండిపడ్డారు. అవగాహనా సదస్సులకు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. భూములు లాక్కుని మమ్మల్ని రోడ్డున పడేస్తారా? ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ, బందరుపోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం బుధవారం నిర్వహించిన గ్రామసభలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.
భూసేకరణ, సమీకరణంటూ ప్రభుత్వంతోపాటు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. డ్వాక్రా మహిళల రుణాలు మొత్తం మాఫీ చేస్తానంటూ మోసం చేసినట్లే... మా భూములు తీసుకుని మమ్మల్ని కూడా మోసం చేస్తారా? అంటూ మహిళలు నిలదీశారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తమ భూముల్లోకి అడుగుపెడితే అధికారులను తరిమి తరిమి కొడతామని హెచ్చరికలు జారీ చేశారు.
భూసమీకరణను రద్దు చేయాలి...
బందరుపోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం తమ భూములు ఇచ్చేది లేదని అన్ని గ్రామాల రైతులు తీర్మానం చేసి మూకుమ్మడిగా అభ్యంతర పత్రాలను డెప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. బందరుపోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,601 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ఇటీవల భూ సమీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకోసం బందరు మండలంలోని పోతేపల్లి, కరగ్రహారం, బొర్రపోతుపాలెం, గరాలదిబ్బ (శివగంగ), మంగినపూడి, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామాల్లో బుధవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతు కుటుంబాలను రోడ్డున పడవేసే భూసమీకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ మహిళలు, రైతులు నినాదాలు చేశారు.
పారిశ్రామిక కారిడార్‌కు భూములు ఇచ్చేదిలేదని అభ్యంతరం తెలుపుతూ ఫారం-2లను అందజేశారు. అభ్యంతరాలు స్వీకరించినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డెప్యూటీ కలెక్టర్లను డిమాండ్ చేశారు. బొర్రపోతుపాలెం గ్రామంలో మహిళలు అత్యధిక సంఖ్యలో ముందుకు వచ్చి భూములు తీసుకుంటే గ్రామంలోని కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని, భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెప్పారు. రైతులంతా అవగాహనా శిబిరాల వద్దకు చేరుకుని అధికారులతో వాగ్వావాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూములను ఇచ్చేది లేదని, భూసమీకరణను రద్దు చేయాలని రెండో రోజుకూడా రైతులు తమ వాదనను గట్టిగానే వినిపించారు.
తరిమి తరిమి కొడతాం...
విమానాశ్రయ భూసేకరణలో భాగంగా గన్నవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సామాజిక ప్రభావ మదింపు కోసం తహశీల్దారు ఎం.మాధురి నేతృత్వంలో గ్రామసభ నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఏలూరు కాలువ మళ్లింపునకు ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. కాలువ నిర్మాణం జరిగితే మర్లపాలెం, గన్నవరం మధ్య సంబంధాలు తెగిపోతాయని తెలిపారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా కాలువ మళ్లింపు చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామసభ గురించి నిర్వాసిత రైతులందరికి సమాచారం ఇవ్వకపోవడంపై తహశీల్దారును కంభంపాటి సూర్యచంద్రరావుతో పాటు పలువురు రైతులు గట్టిగా నిలదీశారు. కాలువ మళ్లింపుపై ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులు ఇక్కడికి రావాలంటూ నిర్వాసితుల సంఘ నాయకులు గూడవల్లి నర్సయ్య, ఎంవీఎల్ ప్రసాద్‌లు పట్టుబట్టారు. గతంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ పత్రాలను సమర్పించినప్పటికి తమ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే హక్కు మీకు ఎవరిచ్చారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.
తమ భూముల్లోకి అడుగుపెడితే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. వెంటనే సబ్‌రిజిష్ట్రార్‌ను ఇక్కడికి పిలిపించి తమ భూములు రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కాలువ మళ్లింపును వ్యతిరేకిస్తూ గతంలోనే తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికి, గ్రామసభల పేరుతో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారని డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. కాలువ మళ్లింపు, జల రవాణా ప్రాజెక్టు ప్రతిపాదనలపై రైతులు అడిగిన సందేహలకు ఇరిగేషన్ అధికారులు నీళ్లునమలడంతో సభలో గందరగోళం ఏర్పడింది. కనీస సమాచారం లేకుండా గ్రామసభకు ఎందుకు వచ్చారని ఇరిగేషన్ డీఈ వర్మ, ఇతర అధికారులపై రైతులు విరుచుకుపడ్డారు.
కేంద్ర భూసేకరణ చట్టానికి భిన్నంగా....
ఎక్కడైనా ఏదైనా పెద్ద పారిశ్రామిక సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తే ఉపాధి కల్పన కోసం దానికి భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయడం రివాజు. భూసేకరణకు అయ్యే మొత్తం వ్యయాన్ని ఆ సంస్థే భరించాలి. పంట పొలాలను సేకరించవద్దని, సాగుకు యోగ్యంకాని భూములనే సేకరించాలని కేంద్ర భూసేకరణ చట్టం - 2013 స్పష్టంగా చెబుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటు సాకుతో భారీగా భూములు సేకరించి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారి సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎకరా రూ. 40 లక్షలుపైగా విలువైన భూమిని కేవలం రూ. లక్ష రేటుతో 498 ఎకరాలను విశాఖపట్నం బాట్లింగ్ కంపెనీకి కేటాయించింది.
ఈ కంపెనీ చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ దగ్గరి బంధువు, సీఎంకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి కుటుంబానికి చెందినది కావడం గమనార్హం. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్‌కు తిరుపతి సమీపంలో అత్యంత విలువైన భూమిని కారు చౌకగా కట్టబెట్టడంలాంటి సంఘటనలు ఈ విమర్శలకు పూర్తి బలం చేకూర్చుతున్నాయి. రైతులకు నామమాత్రంగా ఇచ్చి భూమిని లాక్కోవడం, కావాల్సిన వారికి పప్పుబెల్లాలు చందంగా కేటాయించడం కోసం ప్రబుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని దళారీగా మార్చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భూసమీకరణ/ సేకరణ/ కేటాయింపుల విధానం సరిగా లేదని పలుమార్లు న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యానించాయి. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా దివీస్ లేబొరేటరీస్‌కు 505 ఎకరాలను ఎలా కేటాయించారని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రాజధానికి భూములు ఇవ్వని వారిని బలవంతం చేయవద్దని కూడా పేర్కొంది. ప్రైవేటు సంస్థ ఎక్కడైనా ప్రజా ప్రయోజనాల కోసం పరిశ్రమ పెడుతుందా? ప్రైవేటు కర్మాగారానికి భూసేకరణ విస్తృత ప్రజా ప్రయోజనం ఎలా అవుతుంది? అని పశ్చిమ బంగాలోని సింగూరు భూకేటాయింపు రద్దు తీర్పులో సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి గుర్తు చేశారు. ఈ తీర్పులో సుప్రీం పేర్కొన్న అంశాలను ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులు శిక్ష అనుభవించాల్సి వస్తుందని రెవెన్యూ, న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.