చచ్చిపోయినా పైసా విదల్చలేదు..
వరుస కరువులు..అప్పుడప్పుడూ అధిక వర్షాలు
నాలుగేళ్లుగా ఇన్‌పుట్ సబ్సిడీ లేదు
పొగాకుకు గిట్టుబాటు ధరలేదు
అప్పులపాలై జిల్లాలో 38 మంది రైతుల ఆత్మహత్య
23 మందిని మాత్రమే గుర్తించిన సర్కారు
ఆరుగురికే పరిహారం.. మిగిలిన వారికి మొండిచేయి
ఆదుకోని చంద్రబాబు సర్కార్
వరుస కరువులు, అప్పుడప్పుడూ అధికవర్షాలు.. కాస్తో కూస్తో పంటలు పండినా గిట్టుబాటు ధరలు లేవు. చేసిన అప్పులు నెత్తి కొచ్చాయి. నష్టపరిహారం ఇస్తే నిలదొక్కుకోవచ్చనుకుంటే ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదు. గిట్టుబాటు ధర లేక గత ఏడాది పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పర్యవసానంగా జిల్లా వ్యాప్తంగా 38 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయిన వారికైనా పరిహారం చెల్లించి మృతుల కుటుంబాలకు చేయూత నిస్తారనుకుంటే... వారంతా రైతులు కాదంటూ బాబు ప్రభుత్వం అదీ ఎగనామం పెట్టింది. మొత్తంగా భరోసా కోల్పోయి జిల్లా రైతాంగం విలవిల లాడుతోంది. ఆదుకొనే వారికోసం ఎదురు చూపులు చూస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అతివృష్టి, అనావృష్టిలతో జిల్లాలోని ముఖ్యంగా పశ్చిమప్రాంత రైతాంగం కుదేలైంది. వరుస కరువులు రైతులను కోలుకోనివ్వకుండా చేశాయి. పెట్టుబడులు కూడా రాక అప్పులు నెత్తికొచ్చాయి. అన్నదాతలు నష్టపోయిన ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.100 కోట్ల నష్టపరిహారంలో ఇప్పటికీ పైసా కూడా ఇవ్వలేదు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులు అధికంగా సాగు చేసే పొగాకు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఆదుకోవాల్సిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, టుబాకో బోర్డు పట్టించుకోలేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.
అప్పుల బాధ తాళలేక గతేడాది జిల్లావ్యాప్తంగా 38 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కాపురం డివిజన్ పరిధిలోని పెద్దారవీడు, రాచర్ల, యర్రగొండపాలెం, కందుకూరు డివిజన్ పరిధిలోని కందుకూరు, ముండ్లమూరు, కొండపి, మర్రిపూడి, వలేటివారిపాలెం, దర్శి, కురిచేడు, పామూరు, గుడ్లూరు, లింగసముద్రం ఒంగోలు డివిజన్ పరిధిలో పర్చూరు, కొత్తపట్నం, కారంచేడు, మార్టూరు, అద్దంకి, జె.పంగులూరు, టంగుటూరు, ఇంకొల్లు, మద్దిపాడు తదితర ప్రాంతాల పరిధిలో 38 మందికిపైగా రైతులు మార్చి, 2015 మొదలుకొని నవంబర్ 2015లోపు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
పరిహారం ఇవ్వని ప్రభుత్వం..
గతంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల వంతున పరిహారం చెల్లించాల్సి ఉంది. 2015 మార్చి నుంచి పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన 23 మందిలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఆరుగురికి రూ.30 లక్షలు మాత్రమే పరిహారం కింద అందించారు.
మిగతా 17 మందికి రూ.85 లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉన్నా ఇంత వరకు పైసా కూడా చెల్లించకపోవడం గమనార్హం. కనీసం పరిహారమైన ఇచ్చి ఉంటే బాధిత రైతు కుటుంబాలకు కొంతైనా ఉపశమనం లభించి ఉండేది. ప్రభుత్వం అది కూడా చేయలేదు. ఇక ప్రభుత్వం ఆత్మహత్యల కింద తీసుకోకపోవడంతో 15 మంది రైతుల కుటుంబాలకు పైసా వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
మరో వైపు గత నాలుగేళ్లుగా రైతులకు పంట నష్టపరిహారం కింద రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఒక్క పైసా కూడా చంద్రబాబు సర్కారు చెల్లించలేదు. ఇప్పటికే రుణమాఫీ అస్తవ్యస్తంగా మారింది. 30 శాతం మందికి కూడా రుణమాఫీ వర్తించలేదు. పండ్ల తోటల రైతుల రుణాల మాఫీ అమలుకు నోచుకోలేదు.
ప్రధానంగా జిల్లాలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. కిలో పొగాకు ఉత్పత్తికి రూ.130 ఖర్చవుతుండగా, ప్రస్తుతం వ్యాపారులిస్తున్న ధర కేవలం రూ.100 లోపే ఉంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులపాలవుతున్నారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా ఆత్మహత్యలు తప్పేలా లేవని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు పరిహారం అందించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
ఆత్మహత్యలే 23 అని తేల్చిన జిల్లా అధికారులు
జిల్లా కమిటీ రైతు ఆత్మహత్యలను మరింతగా తగ్గించింది. 33 మంది రైతుల్లో 23 మందిని మాత్రమే సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని తేల్చింది. మిగిలిన 10 మందివి నిజమైన ఆత్మహత్యలు కాదని అధికారిక జాబితా నుంచి తొలగించింది. దీంతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు కనీసం ప్రభుత్వం చేయూత కూడా అందే అవకాశం లేకుండా పోయింది. అధికారులు వంచనకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తాయి.
33 మందినే గుర్తించినతిమెన్ కమిటీ..
మండల స్థాయిలో వ్యవసాయశాఖాధికారి, ఎస్సై, తహశీల్దార్‌లతో కూడిన త్రిమెన్ కమిటీ ఆత్మహత్యలకు పాల్పడిన మృతుల వివరాలను డివిజన్ కమిటీకి నివేదించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆత్మహత్యలను నామమాత్రంగా చూపించాలంటూ ఆంక్షలు పెట్టడంతో త్రిమెన్ కమిటీ 33 మందిని మాత్రమే ఆత్మహత్యలకు పాల్పడినట్లు డివిజన్, జిల్లా కమిటీకి నివేదిక సమర్పించింది.