రాజీనామాలు వద్దు.. పార్టీలోనే ఉందాం | No resignations, be in congress party | Sakshi
Sakshi News home page

రాజీనామాలు వద్దు.. పార్టీలోనే ఉందాం

Published Sat, Oct 5 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

No resignations, be in congress party

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేవరకు ఎవరూ రాజీనామా చేయకుండా కొనసాగాల్సిన అవసరం ఉందని సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర విభజన జరగకుండా అన్ని మార్గాలను అనుసరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ సమైక్య నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకు మంత్రులు, ఇతర సీనియర్ నేతలతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే న్యాయ పోరాటానికి వీలుగా మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వట్టి వసంతకుమార్‌లతో కమిటీని ఏర్పాటుచేశారు. అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజనకు పూనుకుంటే, దానిపై న్యాయపోరాటం చేయాలని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం జరిగింది.
 
  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, తోట నర్సింహం, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పార్థసారథి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కాసు కృష్ణారెడ్డి, మహీధర్‌రెడ్డి, గల్లా అరుణకుమారి, అహ్మదుల్లా, సి.రామచంద్రయ్య, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాథ్‌లతోపాటు 44 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వెళ్తారనుకోవడం లేదు. దాన్ని అడ్డుకోవడానికి ఎవరూ రాజీనామా చేయొద్దంటున్నాను. మంత్రులు కూడా రాజీనామా చేయొద్దు’’ అని అన్నట్లు తెలిసింది. ఉద్యోగులు ఎంతో కాలం సమ్మె చేయలేరని, రాజకీయ పార్టీలు దాన్ని కొనసాగించాల్సిన అవసరముంటుందని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. సరైన భరోసా ఇస్తే వారు సమ్మె విరమించడానికి సానుకూలంగానే ఉన్నారన్నారు. అసెంబ్లీతో సంబంధం లేకుండానే కేంద్రం పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెడుతుందన్న ప్రచారం సాగుతోందని విప్ రుద్రరాజు పద్మరాజు తదితరులు పేర్కొన్నారు. తాను సమైక్యవాదినని గట్టిగా వాదిస్తున్నా.. తన కార్యాలయంపైనా ఉద్యమకారులు దాడులు చేశారని మంత్రి టీజీ వెంకటేశ్ ఆవేదన వ్యక్తంచేశారు.
 
 సమైక్య నినాదంతో పార్టీ యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించాలని మంత్రి శైలజానాథ్... పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కోరారు. దీంతో సీనియర్ మంత్రులు, నాయకులతో కమిటీని ఏర్పాటు చేస్తానని బొత్స చెప్పారు. తాను పార్టీలోనే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునే పోటీచేస్తానని మంత్రి ఆనం నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని, తాను పోటీ చేయాలనుకోవడం లేదని జేసీ పేర్కొన్నారు. కేంద్రం రూపొందిం చిన ఆర్డినెన్సును చించి పారేయాలని రాహుల్‌గాంధీ పేర్కొన్నం దున బొత్స ఆయనతో మాట్లాడి తెలంగాణ తీర్మానాన్ని కూడా అలాగే చించే లా చూడాలని సమావేశంలో మరో నేత పేర్కొన్నారు.
 
 దాడులు చేసేవారిపై ఫిర్యాదు చేస్తే కేసులు
 ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. విజయనగరంలో తన నివాసంపై జరిగిన దాడి గురించి బొత్స ప్రస్తావించి, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదైతే తప్పనిసరిగా పోలీసులు చర్యలు తీసుకుంటారని సీఎం స్పష్టంచేశారు.
 
 హామీ పత్రం ఇచ్చేందుకు సిద్ధం: గంటా
 సమావేశం అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీఎన్జీవోలు గత 60 రోజులకు పైగా చేస్తున్న సమ్మెను విరమించాలని ఒక విజప్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడే బాధ్యతను తాము తీసుకుంటామని ఉద్యోగులకు ఒక హామీ పత్రం సైతం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు సైతం రాజీనామా చేయవద్దన్న అంశంపైనా చర్చ జరిగిందని తెలిపారు. ఎంపీల రాజీనామాల వల్ల పార్లమెంట్‌లో తమ వాదన వినిపించడానికి అవకాశం ఉండదని, అందువల్ల రాజీనామాలు వద్దన్న అభిప్రాయం వ్యక్తమైందన్నారు.
 
 మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా
 తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలసి రాజీనామా పత్రాన్ని అందించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను ఫ్యాక్స్ ద్వారా గాంధీభవన్‌కు పంపారు. సీమాంధ్ర ప్రజల పట్ల కేంద్రం, కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని ఏరాసు తన లేఖలో పేర్కొన్నారు.
 
 కాంగ్రెస్‌కు బుద్ధప్రసాద్ గుడ్‌బై
 రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకోవడం తీరని అన్యాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతానికి తిలోదకాలు ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement